జగన్ కూడా తెగనమ్ముతున్నారు…?

రాజులంతా ఒక్కటే. రాజ్యాలు, ప్రాంతాలు మాత్రమే మారుతాయి అని అంటారు. అలాగే ప్రభుత్వం కంటే బలవంతులు ఎవరూ ఉండరు. ఏలిన వారు తలచుకోవాలే కానీ పుత్తడి కూడా [more]

Update: 2021-04-08 08:00 GMT

రాజులంతా ఒక్కటే. రాజ్యాలు, ప్రాంతాలు మాత్రమే మారుతాయి అని అంటారు. అలాగే ప్రభుత్వం కంటే బలవంతులు ఎవరూ ఉండరు. ఏలిన వారు తలచుకోవాలే కానీ పుత్తడి కూడా ఇత్తడి అయిపోతుంది. ఇపుడు అదే జరుగుతోంది. అయిదేళ్ల కాల పరిమితికి నేతలను గద్దెనెక్కిస్తే ఈ దేశానికి శాశ్వత సంపదగా భావించే వాటినే తెగనమ్ముతున్నారు. కేంద్రంలోని బీజేపీ లక్షల విలువ చేసే విశాఖ స్టీల్ ప్లాంట్ ని అమ్మకానికి పెట్టేసింది. ఇక ఏపీలోని వైసీపీ సర్కార్ కూడా విశాఖలో తన వాటా చూసుకుంటోంది.

లూలూ భూమి అలా…?

చంద్రబాబు సీఎం గా ఉండగా విశాఖ‌ బీచ్ రోడ్డులో వేయి కోట్ల రూపాయలు విలువ చేసే 13 ఎకరాల భూమిని ఒక్క పైసా కూడా తీసుకోకుండా లూలూ గ్రూపు కి ఇచ్చేస్తూ ఘనమైన ఒప్పందం కుదుర్చుకున్నారు. లూలూ గ్రూప్ విశాఖలో లీజ్ మీద ఫైవ్ స్టార్ హొటల్, అతి పెద్ద కాన్వకేషన్ హాల్, షాపింగ్ మాల్స్ కడుతుందని కూడా నాడు తమ్ముళ్ళు ఊదరగొట్టారు. ఇలా తనది కాని చోట వ్యాపారాలు చేసుకునేందుకు లూలూకి ప్రభుత్వ భూమిని అప్పగించడానికి బాబు సర్కార్ సిధ్ధపడితే ప్రజా సంఘాలు దాని మీద ఆందోళన చేశాయి. వైసీపీ సర్కార్ వచ్చిన తరువాత ఆ ఒప్పందాన్ని రద్దు చేసింది.

అమ్మకానికి రెడీ….

ఇపుడు ఆ విలువైన భూమిని అమ్మకానికి వైసీపీ పెట్టేసింది. దాని కనీసపు ధరను 1400 కోట్లుగా నిర్ణయించి మరీ వేలం పాటకు రంగం సిధ్ధం చేసింది. దీంతో విశాఖవాసులతో పాటు మేధావులు ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి. చంద్రబాబు అన్యాయంగా లూలూ గ్రూపునకు ఈ భూమిని ఇస్తూంటే అడ్డుకున్నామని ఇపుడు ఆ భూమిని ఏకంగా అమ్మకానికి పెట్టడమేంటని వైసీపీ నేతల మీద మేధావులు మండిపడుతున్నారు. ప్రభుత్వానికి సంబంధించిన ఇంతటి విలువైన భూమిని ప్రజోపయోగ కార్యక్రమాలకు వినియోగిస్తే బాగుంటుంది అని కూడా సూచిస్తున్నారు.

హోల్ సేల్ గానే….?

విశాఖలో ఉన్న ప్రభుత్వ భూములే తక్కువ. పైగా విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటించిన ప్రభుత్వం రేపటి రోజున అవసరాలను ఏ మాత్రం దృష్టిలో ఉంచుకోకుండా తెగనమ్మడానికి సిద్ధపడడమేంటని కూడా ప్రతిపక్ష పార్టీలు కూడా విమర్సిస్తున్నాయి. ఒక్క గజం ప్రభుత్వ స్థలం అమ్మినా కూడా చూస్తూ ఊరుకోమని వామ‌పక్ష పార్టీలు హెచ్చరిస్తున్నాయి. విశాఖలో ప్రభుత్వ భూములను ఎక్కడ ఉన్నా గుర్తించి అమ్మకానికి పెడితే భవిష్యత్తులో ఏదైనా ప్రాజెక్ట్ టేకప్ చేయలన్నా కూడా జాగా దొరకదు అని కూడా అంటున్నారు. మొత్తానికి అటు స్టీల్ ప్లాంట్ అగ్గి అలా మండుతూండగానే ఇటు ప్రభుత్వ భూముల వేలానికి వైసీపీ సర్కార్ తెర తీయడం పట్ల విశాఖవాసులు గగ్గోలు పెడుతున్నారు.

Tags:    

Similar News