ఫ్యాక్ట్ చెక్: అయోధ్య రామ్ లల్లాకు ఇచ్చిన 12 బంగారు వాహనాలు కాదు, ఇవి భద్రాచల శ్రీరాముడికి వచ్చినవి.
జనవరి 22, 2024న అయోధ్య రామ మందిరం ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరిగింది. ఇక అయోధ్య రామాలయానికి భక్తుల నుండి విరాళాలుగా రూ. 11 కోట్లకు పైగా అందాయి.
జనవరి 22, 2024న అయోధ్య రామ మందిరం ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరిగింది. ఇక అయోధ్య రామాలయానికి భక్తుల నుండి విరాళాలుగా రూ. 11 కోట్లకు పైగా అందాయి. రామజన్మభూమి తీర్థ క్షేత్రం ప్రకారం 11 రోజుల్లో దాదాపు 25 లక్షల మంది భక్తులు రామమందిరాన్ని సందర్శించారు.
అనేక బంగారు వాహనాలు లేదా రథాలను చూపించే వీడియో వైరల్ అవుతూ ఉంది. అమెరికాకు చెందిన NRI వాసవి అసోసియేషన్ అయోధ్య ఆలయంలో శ్రీరాముడికి 12 బంగారు వాహనాలను విరాళంగా ఇచ్చిందని ప్రచారం చేస్తున్నారు.
ఈ వీడియోలో బంగారంతో తయారు చేసిన 12 విభిన్నమైన అలంకారాలు, అందంగా చెక్కిన వాహనాలు కూడా ఉన్నాయి.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదారి పట్టించేది. మార్చి 2023లో భద్రాచలంలోని రామ మందిరానికి ఎన్‌ఆర్‌ఐ వాసవి అసోసియేషన్ విరాళంగా ఇచ్చిన 12 బంగారు వాహనాలకు సంబంధించిన వీడియో ఇదని మేము ధృవీకరించాం.
మేము వీడియో నుండి కీఫ్రేమ్‌లను తీసుకుని Google లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసాం. భద్రాచలం ఆలయంలో 12 కొత్త బంగారు వాహనాలను.. NRI వాసవీ సంఘం విరాళంగా ఇచ్చింది అనే శీర్షికతో V6 తెలుగు న్యూస్ ప్రచురించిన వీడియో నివేదికను మేము కనుగొన్నాము. మార్చి 21, 2023న వీడియోను అప్లోడ్ చేశారు. ఈ వీడియో వైరల్ వీడియోలో ఉన్నటువంటి షాట్‌లను చూపుతుంది.
మేము మరింత సెర్చ్ చేయగా.. భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ ఖజానాకు 12 కొత్త బంగారు వాహనాలు చేరినట్లు పలు మీడియా కథనాలలో వెలువడింది. ఈ వాహనాల తయారీకి ప్రవాసాంధ్ర ఆర్య వైశ్య సంఘం రూ.75 లక్షల ఆర్థిక సాయం అందించింది. ఆలయ వైదిక కమిటీ సలహాలు, సూచనల మేరకు తమిళనాడులోని కుంభకోణంకు చెందిన కళాకారులతో వాహనాలను తయారు చేశారు.
భద్రాచల శ్రీసీతారామచంద్రస్వామి వారి దేవస్థానం లో స్వామివారి తిరువీధి సేవకు ఉపయోగిస్తున్న వాహనాల స్థానంలో సరికొత్త వాహనాలు తీసుకుని వచ్చారు. మూడు శతాబ్దాల కాలం నుంచి స్వామి వారి తిరువీధి సేవకు ఉపయోగిస్తున్న ఈ వాహనాలు తరచూ మరమ్మతులకు గురికావడంతో వాటి స్థానంలో నూతన వాహనాలను తయారుచేసి ఇచ్చేందుకు అమెరికాకు చెందిన వాసవి అసోసియేషన్ ముందుకు వచ్చింది. గరుడ, హనుమత్, శేష సూర్యప్రభ, చంద్రప్రభ, హంస, అశ్వ, కల్ప వృక్ష సార్వభౌమ, బంగారు సింహాసనం, గజ, సింహ వాహనాలను తయారు చేయించారు.
మేము అయోధ్య రామ మందిరానికి విరాళాలకు సంబంధించిన నివేదికల కోసం కూడా వెతికాము, రామ్ లల్లాకు బంగారు వాహనాలు విరాళంగా వచ్చినట్లు ఎలాంటి వార్తా నివేదికలు మేము గుర్తించలేకపోయాం. కాబట్టి, వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదారి పట్టించేది. వైరల్ పోస్టులు అయోధ్యలోని రామ్ లల్లాకు చెందినవి కావు. భద్రాచలంలోని రాముడికి సంబంధించినవి.
Claim : The NRI Association from the USA donates 12 gold vahanas to Lord Rama in Ayodhya
Claimed By : Facebook Users
Fact Check : Misleading