ఫ్యాక్ట్ చెక్: ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లకు తాను వ్యతిరేకమని ప్రధాని మోదీ చెప్పలేదు
మోదీ ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకమని;

భారతదేశంలో పార్లమెంట్ సీట్లకు సంబంధించిన చర్చ జరుగుతూ ఉంది. పార్లమెంటరీ నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుండి పారదర్శకత, స్పష్టత లేకపోవడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ జాయింట్ యాక్షన్ కమిటీ (జెఎసి) మార్చి 22న ఒక తీర్మానాన్ని ఆమోదించింది. 1971 జనాభా లెక్కల ఆధారంగా పార్లమెంటరీ నియోజకవర్గాలపై స్తంభనను మరో 25 సంవత్సరాలు పొడిగించాలని జెఎసి ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. మార్చి 22, 2025 శనివారం చెన్నైలో జరిగిన కేంద్రం ప్రతిపాదిత పార్లమెంటరీ సీట్ల పునర్విభజనపై జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్, కేరళ సీఎం పినరయి విజయన్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, కర్ణాటక డిప్యూటీ సీఎం డికె శివకుమార్, డిఎంకె నాయకుడు టిఆర్ బాలు, బిఆర్ఎస్ నాయకుడు కెటి రామారావు తదితరులు పాల్గొన్నారు.
"ఇది PMO India యొక్క ఆలోచన విధానం మందకృష్ణ మాదిగ గారు వినండి జరా ఆలోచన తో సోయి తో ఉండండి. ఎవరి స్వార్థం కోసమే బీజేపీ ఆడుతున్న డ్రామా బలి కావొద్దు పేద అన్న..
#trendingpost #tranding" అంటూ పోస్టులు పెట్టారు.
ప్రధానమంత్రి మోదీ పార్లమెంటులో రిజర్వేషన్ల గురించి మాట్లాడుతున్న వీడియో పలు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో షేర్ అవుతోంది, ముఖ్యంగా ఉద్యోగాలలో రిజర్వేషన్ వ్యవస్థ మోదీకి నచ్చడం లేదని ఈ కథనం చెబుతోంది.
వైరల్ పోస్టుకు సంబంధించిన స్క్రీన్ షాట్ ను ఇక్కడ చూడొచ్చు
వైరల్ అవుతున్న వీడియోను ఎడిట్ చేసి, తప్పుడు వాదనతో సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
మేము సంబంధిత కీవర్డ్స్ తో గూగుల్ లో సెర్చ్ చేయగా, ప్రధాని నరేంద్ర మోదీ ఓ లెటర్ ను పార్లమెంట్ లో చదివారని తెలుస్తోంది. భారత మాజీ ప్రధాని, దివంగత జవహర్ లాల్ నెహ్రూ రిజర్వేషన్స్ కు వ్యతిరేకంగా రాసిన లేఖను చదివారు.
ఫిబ్రవరి 07, 2024న పలు మీడియా సంస్థలు ప్రచురించిన కథనాలు మాకు లభించాయి. రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చకు సమాధానంగా ప్రధానమంత్రి మోదీ జవహర్‌లాల్ నెహ్రూ ముఖ్యమంత్రులకు రాసిన లేఖను ఉదహరించారని ఈ కథనాలు చెబుతున్నాయి. మొదటి ప్రధానమంత్రి ఏ రకమైన రిజర్వేషన్లకు, ముఖ్యంగా ఉద్యోగాలలో వ్యతిరేకమని చెప్పారని మోదీ లేఖతో సహా స్పష్టం చేశారు. ప్రభుత్వ శాఖల్లో రిజర్వేషన్లను అమలు చేస్తే అది ప్రభుత్వ పనితీరును ప్రతికూలంగా ప్రభావితం చేసిందని ఆ లేఖలో స్పష్టంగా ఉందని ప్రధాని మోదీ అన్నారు.
ఆ కథనాలను ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు. ఈ కథనాలకు సంబంధించిన థంబ్నైల్స్ లోనూ, వైరల్ వీడియోలోనూ మోదీ వేసుకున్న డ్రెస్ ఒకటేనని మేము గుర్తించాం.
అలాగే ప్రధాని మోదీ జవహర్ లాల్ నెహ్రు లెటర్ ను చదువుతున్న స్పీచ్ కు సంబంధించిన అనేక వీడియోలు మాకు లభించాయి.
వైరల్ అవుతున్న వీడియోలో మోదీ చేసిన వ్యాఖ్యలు, ఈ వీడియోలలోని వ్యాఖ్యలు ఒకటేనని స్పష్టంగా తెలుస్తోంది.
ఇక నరేంద్ర మోదీ అధికారిక యూట్యూబ్ ఛానల్ లో ఫిబ్రవరి 7, 2024న "PM Modi LIVE | Rajya Sabha Speech | Motion of Thanks on the President's Address" అనే టైటిల్ తో సుదీర్ఘ వీడియోను అప్లోడ్ చేశారు.
1:44 గంటల నిడివి గల ఈ వీడియోను చూస్తున్నప్పుడు వైరల్ వీడియో 40 నిమిషాల 20 సెకన్ల టైమ్‌స్టాంప్ దగ్గర తీసుకున్నారని తెలుస్తోంది. మొత్తం ప్రసంగాన్ని విన్నప్పుడు, ప్రధాని మోదీ ఒక లేఖను చదువుతున్నట్లు చూడవచ్చు. ఇది మాజీ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ అప్పటి రాష్ట్రాల ముఖ్యమంత్రులకు రాసినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలలో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా నెహ్రూ తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నట్లు లేఖలో ఉంది.
ఆ లేఖలో నెహ్రూను ఉటంకిస్తూ ప్రధాని మోదీ మాట్లాడుతూ “ఇది ఆ సమయంలో దేశ ముఖ్యమంత్రులకు ప్రధాని నెహ్రూ జీ రాసిన లేఖ. ఇది రికార్డులో ఉంది, నేను అనువాదాన్ని చదువుతున్నాను. ఏ రిజర్వేషన్లు ఇవ్వడం ఇష్టం లేదు... ముఖ్యంగా ఉద్యోగాలలో రిజర్వేషన్లు ఇష్టం లేదు. ద్వితీయ శ్రేణి ప్రమాణాలకు దారితీసే అసమర్థతను ప్రోత్సహించే ఏ చర్యకైనా నేను వ్యతిరేకం. ఇది పండిట్ నెహ్రూ ముఖ్యమంత్రులకు రాసిన లేఖ.” అని అన్నారు. కాబట్టి, మాజీ ప్రధాని నెహ్రూ రాసిన లేఖను ప్రధాని మోదీ చదివి వినిపించారు.
ఇదే వాదనతో గతంలో పలు వీడియోలు పలు భాషల్లో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వాటిని ఖండిస్తూ పలు ఫ్యాక్ట్ చెక్ సంస్థలు నిజ నిర్ధారణ చేశాయని మేము గుర్తించాము. వాటిని ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు.
కాబట్టి, భారతప్రధాని నరేంద్ర మోదీ తాను రిజర్వేషన్లకు వ్యతిరేకమని ఎక్కడా చెప్పలేదు. ఆయన దివంగత మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ అప్పటి ముఖ్యమంత్రులకు రాసిన లేఖ గురించి ప్రస్తావించారు.
వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఉంది.