ఫ్యాక్ట్ చెక్: ఏఆర్ ఫుడ్స్ సంస్థ మేనేజ్మెంట్ లో అందరూ ముస్లింలు, పాకిస్థాన్ కు చెందిన వారే అన్నది నిజం కాదు

ఏఆర్ ఫుడ్స్ సంస్థ మేనేజ్మెంట్ లో ముస్లిం వ్యక్తులు, పాకిస్థాన్ కు

Update: 2024-09-23 12:28 GMT

TirumalaLaddu

తిరుమల లడ్డూ వివాదం దేశ వ్యాప్తంగా సంచలనం రేపుతున్న సంగతి తెలిసిందే. హిందువుల మనోభావాలను దారుణంగా దెబ్బతీశారంటూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆరోపించారు. తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వును కలిపి తీవ్ర అపచారం చేశారంటూ తిరుమల శ్రీవారి ఆలయంలో మహా శాంతి యాగాన్ని కూడా నిర్వహించారు. తిరుమలలో సంప్రోక్షణ కార్యక్రమాన్ని కూడా చేపట్టారు. భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఈ నేరానికి పాల్పడిన వారిపై తగిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం చెబుతూ ఉంది.

తిరుపతి లడ్డూలలో జంతువుల కొవ్వును కల్తీ చేశారని తెలియడంతో తాను 11 రోజుల పాటూ దీక్ష చేపట్టనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. వైసీపీ పాలనలో ఆలయాలు ధ్వంసమయ్యాయని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విమర్శించారు. తిరుమల లడ్డూ కల్తీ ఘటనను నిరసిస్తూ ఆయన ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. గుంటూరు జిల్లా నంబూరులోని దశావతార వేంకటేశ్వరస్వామి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి దీక్ష ప్రారంభించారు. 11 రోజుల పాటు ఆయన దీక్ష కొనసాగించనున్నారు. అనంతరం తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు.

టీటీడీకి ఉన్న కఠిన నియమ, నిబంధనలను దాటుకుని కల్తీ నెయ్యితో ప్రసాదాలు తయారయ్యే ఆస్కారమే లేదని ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. గత కొన్ని దశాబ్దాలుగా టీటీడీ ఈ నిబంధనలను అనుసరిస్తోందని, టీటీడీలో పాటిస్తున్న అత్యుత్తమ విధానాల గురించి ప్రజలకు చెప్పాల్సింది పోయి, సీఎం చంద్రబాబు నాయుడు అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని ప్రధాని మోదీకి లేఖ రాశారు వైఎస్ జగన్. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు.

తిరుమలకు నెయ్యిని సరఫరా చేసిన ఏఆర్ ఫుడ్స్ కు సంబంధించి కూడా మరో వైపు చర్చ జరుగుతూ ఉంది. ఇంతలో సోషల్ మీడియా ఖాతాలలో ఏఆర్ ఫుడ్స్ కు మేనేజ్మెంట్ లిస్ట్ లో ఉన్న వ్యక్తులు ముస్లిం సమాజానికి సంబంధించిన వారంటూ కూడా ప్రచారం జరుగుతూ ఉంది. అది కూడా వారు పాకిస్థాన్ కు చెందిన వారనే వాదనతో లింక్డ్ ఇన్ ప్రొఫైల్స్ ను షేర్ చేస్తున్నారు.








ఫ్యాక్ట్ చెకింగ్:

వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎలాంటి నిజం లేదు. ఏఆర్ ఫుడ్స్ మేనేజ్మెంట్ లో ముస్లిం సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు లేరు.

లడ్డుకు సంబంధించిన వివాదంపై మేము గూగుల్ లో సంబంధిత కీవర్డ్ సెర్చ్ చేశాం. మేము జూన్ నుండి జూలై వరకు  "తిరుమల తిరుపతి దేవస్థానాలకు నెయ్యి సరఫరా చేస్తున్నాము.. ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానాలకు నెయ్యి ఇవ్వడం లేదని" ఏఆర్ డైరీ ఫుడ్స్ తెలిపింది. నెయ్యి ఉత్పత్తిలో 25 సంవత్సరాలకు పైగా అనుభవం ఉందని, ఇప్పటి వరకు ఎటువంటి ఫిర్యాదులు లేదా నాణ్యత సమస్యలు రాలేదని ఏ.ఆర్. డైరీ ఫుడ్స్ నాణ్యత తనిఖీ విభాగం ఇన్‌ఛార్జ్ తెలిపారు. జూన్, జూలైలో పంపిన నెయ్యిలో లోపాల గురించి వార్తలు వచ్చాయి. ఆహార భద్రతా విభాగం, అగ్‌మార్క్ అధికారులు సందర్శించి, నమూనాలను సేకరించారు. ఎటువంటి లోపాలు కనుగొనలేదని తెలిపారు. మా నెయ్యి స్వచ్ఛమైనది, ఎవరైనా ప్రయోగశాలలో పరీక్షలు చేయవచ్చని తాము ఆహ్వానిస్తున్నామని ఏ.ఆర్. డైరీ ఫుడ్స్ నాణ్యత తనిఖీ విభాగం ఇన్‌ఛార్జ్ కన్నన్ తెలిపారు.

ఇక AR డైరీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ తమిళనాడు ఆధారిత డైరీ కంపెనీ. 1995లో ప్రారంభించారు. దీనిని ముగ్గురు డైరెక్టర్లు ఉన్నారు. రాజశేఖరన్, సూర్య ప్రభ, శ్రీనివాసన్ నిర్వహణ బాధ్యతలను చూసుకుంటూ ఉన్నారని పలువురు ప్రముఖ మీడియా సంస్థలు కూడా తెలిపాయి. తిరుమల ఆలయానికి తమ నెయ్యి సరఫరా కేవలం జూన్, జూలై నెలలకే పరిమితమైందని స్పష్టం చేశారు.

AR డైరీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యానికి సంబంధించి హిందుస్థాన్ టైమ్స్ కూడా కథనాన్ని ప్రచురించింది. తమిళనాడుకు చెందిన డైరీ కంపెనీ 1995లో ప్రారంభించారని, ముగ్గురు డైరెక్టర్లు ఆర్. రాజశేఖరన్, ఆర్.సూర్య ప్రభ, ఎస్ఆర్ శ్రీనివాసన్ నిర్వహిస్తున్నారని కంపెనీ వెబ్‌సైట్ తెలిపిందని తమ కథనంలో తెలిపారు.

AR డైరీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి సంబంధించిన వెబ్సైట్ లో డైరెక్టర్స్ గురించి వివరాలను మేము గమనించాం. మీరు కూడా ఆ వివరాలను చూడొచ్చు.


 ఇక D-Intent Data అనే ట్విట్టర్ ఖాతాలో వైరల్ పోస్టుల్లో ఎలాంటి నిజం లేదని, ప్రజలను తప్పుదారి పట్టించారని వివరించారు.

ఇక వైరల్ పోస్టులో ఉన్న S.M.Naseem Javaid అనే ప్రొఫైల్ గురించి లింక్డ్ ఇన్ లో మేము వెతికాం. ఆ వ్యక్తి పాకిస్థాన్ లోని A.R.Foods (Pvt) Limited లో బాధ్యతలు చూసుకుంటూ ఉన్నారు. ఆ కంపెనీ ఇస్లామాబాద్ లో ఉంది. భారతదేశానికి ఈ కంపెనీకి ఎలాంటి సంబంధం లేదు.

పాకిస్థాన్ కు చెందిన ఏఆర్ ఫుడ్స్ లో పని చేసే వ్యక్తులకు సంబంధించిన వివరాలను మీరు చూడొచ్చు. పాకిస్థాన్ లోని ఏ ఆర్ ఫుడ్స్ లింక్ ను మీరు ఇక్కడ చూడొచ్చు.


 కాబట్టి, వైరల్ అవుతున్న పోస్టులు ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఉన్నాయి. పాకిస్థాన్ లో కూడా ఏ.ఆర్. ఫుడ్స్ సంస్థ ఉంది. అందుకు సంబంధించిన వివరాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. తమిళనాడు లోని ఏఆర్ ఫుడ్స్ సంస్థ మేనేజ్మెంట్ లో ఎక్కువగా ముస్లిం వ్యక్తులు, పాకిస్థాన్ కు చెందిన వారే ఉన్నారంటూ జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదు.

Claim :  ఏఆర్ ఫుడ్స్ సంస్థ మేనేజ్మెంట్ లో ముస్లిం వ్యక్తులు, పాకిస్థాన్ కు చెందిన వారు ఉన్నారు.
Claimed By :  social media users
Fact Check :  Misleading
Tags:    

Similar News