ఫ్యాక్ట్ చెక్: ఆర్‌బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ ప్రధాని మోదీని విమర్శించారంటూ వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు

గత ప్రభుత్వాల హయాంలో భారతదేశం ఆర్థికంగా ఎన్నో విజయాలు సాధించిందని.. మోదీ చేసిందేమీ లేదన్నట్లుగా రఘురామ్ రాజన్

Update: 2023-09-21 14:25 GMT


ప్రధాని నరేంద్ర మోదీ అధికారంలో వచ్చాక భారతదేశ ఆర్థిక పురోగతి కుంటుపడిందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ చేసిన ప్రకటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
గత ప్రభుత్వాల హయాంలో భారతదేశం ఆర్థికంగా ఎన్నో విజయాలు సాధించిందని.. మోదీ చేసిందేమీ లేదన్నట్లుగా రఘురామ్ రాజన్ విమర్శిస్తున్నట్లు వైరల్ పోస్టుల్లో ఉన్నాయి. ప్రధాని మోదీ అధికారంలోకి రాకముందే గత 70 ఏళ్లుగా భారతదేశం గొప్ప విజయాలు సాధించిందని.. వీటన్నిటినీ ప్రధాని మోదీ తన క్రెడిట్ లోకి వేసుకుంటున్నారంటూ వైరల్ పోస్టుల్లో ఉన్నాయి.
మోదీ కారణంగానే ఈ లక్ష్యాలను భారత్ అందుకుందని ఎంతో మంది భావిస్తూ ఉన్నారని.. అంతా మోదీ చేశారని కొంతమంది చెప్పే వ్యాఖ్యలను తాను నమ్మనని రఘురామ్ రాజన్ చెప్పినట్లుగా పోస్టులు వైరల్ అవుతున్నాయి.





ఫ్యాక్ట్ చెకింగ్:
రఘురామ్ రాజన్ భారత ప్రధాని నరేంద్ర మోదీపై ఇలాంటి వ్యాఖ్యలు ఏమైనా చేశారా అని మేము గూగుల్ లో సెర్చ్ చేశాం. కానీ మాకు అలాంటి కథనాలు ఏవీ దొరకలేదు.
రఘురామ్ రాజన్ లాంటి ప్రముఖులు అలాంటి ప్రకటనలు చేసి ఉండి ఉంటే.. తప్పకుండా అవి మీడియా దృష్టిని ఆకర్షించి ఉండేవి. కానీ అలాంటి వార్తా కథనాలు ఏవీ మాకు లభించలేదు.
రఘురామ్ రాజన్ ఈ ప్రకటనలు చేశారనే దానికి సాక్ష్యాలుగా విశ్వసనీయమైన వార్తా నివేదికలు లేదా సోషల్ మీడియా పోస్ట్‌లు ఏవీ కనిపించలేదు.
రఘురామ్ రాజన్ లింక్డ్ఇన్ ప్రొఫైల్‌లో కూడా అటువంటి ప్రకటన ఏదీ కనిపించలేదు. అందులో ఆయన తాను రాసిన విషయాలను తరచుగా అప్లోడ్ చేస్తూ ఉంటారు. పలు విషయాల గురించి చర్చిస్తూ ఉంటారు. అయితే అక్కడ వైరల్ పోస్టుకు సంబంధించిన పోస్టులు కూడా మాకు కనిపించలేదు.
వైరల్ పోస్టులలో అందించిన నిర్దిష్ట సమాచారం కూడా సరికాదని గుర్తించాం. ఉదాహరణకు.. రాజన్ ఆర్‌బిఐ మాజీ ఛైర్మన్ అని వైరల్ పోస్టుల్లో పేర్కొన్నారు. అయితే ఆయన ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌. ప్రస్తుతం ఆయన చైర్మన్ పదవిలో లేరు.
మరొక విషయం ఏమిటంటే.. ప్రధానిగా మోదీ కేవలం నాలుగు సంవత్సరాలు మాత్రమే పనిచేశారని ఉంది. అయితే ఆయన ఇప్పటికే తొమ్మిదేళ్లకు పైగా అధికారంలో ఉన్నారు.
కాబట్టి, ఆర్‌బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ ప్రధాని మోదీని విమర్శించారంటూ వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు.


Claim :  Raghuram Rajan passed a statement criticizing Modi
Claimed By :  Twitter Users
Fact Check :  False
Tags:    

Similar News