క్యాన్సర్ శరీరంలోని కొన్ని కణాలు నియంత్రణ లేకుండా పెరిగి శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపిస్తాయి. మానవ శరీరంలోని కణాలు పాతవి అయినప్పుడు, దెబ్బతిన్నప్పుడు అవి చనిపోతాయి. కొత్త కణాలు వాటి స్థానంలో వస్తాయి. కానీ, కొన్నిసార్లు ఈ ప్రక్రియ సరిగా సాగకపోతే, అసాధారణమైన లేదా దెబ్బతిన్న కణాలు పెరుగుతాయి. ఈ కణాలే క్యాన్సర్ లేదా కణితులను తయారు చేస్తాయి.
ఏ రకమైన క్యాన్సర్‌కైనా నిర్దిష్ట వైద్యం లేదు, కానీ దానిని నయం చేసే చికిత్సలు ఉన్నాయి. సాధారణ క్యాన్సర్ చికిత్సలలో కీమోథెరపీ, రేడియేషన్, సర్జరీ, హార్మోన్ థెరపీ మొదలైనవి ఉన్నాయి. క్యాన్సర్ రకాన్ని బట్టి వీటిలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ప్రక్రియలను ఉపయోగిస్తారు.
ఇదిలా ఉండగా పైనాపిల్, వేడి నీళ్లను ఉపయోగించడం ద్వారా క్యాన్సర్‌ను ఓడించవచ్చంటూ సోషల్ మీడియా పోస్ట్ ఒకటి వైరల్ అవుతోంది. ఈ వివరాలను 10 మందితో పంచుకోవాలని ప్రొఫెసర్ డాక్టర్ గిల్బర్ట్ ఎ క్వాక్ చెప్పినట్లు ఆ మెసేజీలో ఉంది. పైనాపిల్ ను ఉంచిన నీరు క్యాన్సర్ కణాలను పూర్తిగా తొలగిస్తుందని అందులో ఉంది. పైనాపిల్ ముక్కలను వేడి నీటిలో వేసి, ఈ మిశ్రమాన్ని తాగడం వల్ల క్యాన్సర్ వ్యాధితో పోరాడే శరీర సామర్థ్యాన్ని పెంచవచ్చని సందేశం పేర్కొంది.
“క్యాన్సర్ ఓడిపోయింది, పైనాపిల్ వేడి నీరు. దయచేసి ప్రచారం చేయండి!! దయచేసి ప్రచారం చేయండి!! ఈ బులెటిన్‌ని అందుకున్న ప్రతి ఒక్కరూ పది కాపీలను ఇతరులకు పంచితే కనీసం ఒకరి ప్రాణమైనా కాపాడబడుతుందని ఐసిపిఎస్ జనరల్ హాస్పిటల్ ప్రొఫెసర్ డా. గిల్బర్ట్ ఎ. క్వాక్ అన్నారు. నేను నా వంతు పూర్తి చేసాను మరియు మీరు కూడా చేయగలరని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు! పైనాపిల్ వేడి నీరు మీ జీవితాన్ని పాడుతుంది వేడి పైనాపిల్ క్యాన్సర్ కణాలను నాశనం చేస్తుంది. ఒక కప్పు వేడి నీటిలో 2 నుండి 3 తరిగిన పైనాపిల్స్ వేసి, ప్రతిరోజూ త్రాగడం వల్ల "ఆల్కలీన్ వాటర్" అందరికీ మంచిది. వేడి పైనాపిల్ క్యాన్సర్ నిరోధక పదార్థాలను విడుదల చేస్తుంది, సమర్థవంతమైన క్యాన్సర్ చికిత్స కోసం ఔషధం యొక్క తాజా పురోగతి. వేడి పైనాపిల్‌కు సిస్ట్‌లు మరియు ట్యూమర్‌లను తొలగించే సామర్థ్యం ఉంది. ఇది అన్ని రకాల క్యాన్సర్లకు చికిత్స చేస్తుందని నిరూపించబడింది. పైనాపిల్ వేడి నీరు అలర్జీలు/అలర్జీల వల్ల శరీరంలోని అన్ని క్రిములు మరియు టాక్సిన్స్ ను తొలగిస్తుంది. పైనాపిల్ రసం నుండి తీసుకోబడిన ఔషధం ప్రాణాంతక కణాలను చంపుతుంది మరియు ఆరోగ్యకరమైన కణాలను ప్రభావితం చేయదు. అలాగే పైనాపిల్ జ్యూస్‌లో ఉండే అమినో యాసిడ్‌లు మరియు పైనాపిల్ పాలీఫెనాల్స్ అధిక రక్తపోటును నియంత్రిస్తాయి, అంతర్గత రక్తనాళాలు అడ్డుపడకుండా చేస్తాయి, రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి మరియు రక్తం గడ్డకట్టడాన్ని తగ్గిస్తాయి.” అంటూ పోస్టు వైరల్ అవుతోంది.
ఇదే మెసేజీ 2023లో కూడా వైరల్ అయింది.
ఈ పోస్ట్ వాట్సాప్ లో కూడా వైరల్ అవుతోంది.
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
మొదటిగా, మేము ప్రొఫెసర్ డాక్టర్ గిల్బర్ట్ ఎ క్వాక్ కోసం వెతికినప్పుడు, ఏ ఆసుపత్రిలోనూ అటువంటి వైద్యుడు ఉన్న దాఖలాలు కనుగొనలేకపోయాం. అతని పేరు మీద ఎలాంటి సోషల్ మీడియా ఖాతాలు కూడా లేవు. Dr Gilbert A Kwok అసలు లేరంటూ కొన్ని X పోస్ట్‌లను కూడా మేము కనుగొన్నాము.
మేము ఒక న్యూస్ లెటర్ ను కూడా కనుగొన్నాము. ఏప్రిల్ 2024, సంచిక 84 - సెయింట్ జాన్స్ నేషనల్ అకాడమీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వైరల్ క్లెయిమ్‌పై ఫ్యాక్ట్ చెక్ ను ప్రచురించి, వైరల్ అవుతున్న వాదన నిరాధారమైనదని తెలిపింది. ఆహారంలో భాగంగా పైనాపిల్ ను తీసుకోవడం మంచిదేనని నిపుణులు సూచించారు. అయితే పైనాపిల్ నిజంగా అలాంటి మాయలను చేయగలదో లేదో తెలుసుకోవాలంటే మాత్రం తదుపరి అధ్యయనాలు అవసరమని అభిప్రాయపడ్డారు.
PUBMEDలో లిటరేచర్ సెర్చ్ చేయగా, క్యాన్సర్‌ను నివారించడంలో, చికిత్స చేయడంలో పైనాపిల్ నీరు లేదా రసం ప్రభావాలను అధ్యయనం చేసిన కథనాలు ఏవీ కనుగొనలేకపోయామన్నారు. పైనాపిల్ చెట్టు కాండం నుండి 'బ్రోమెలైన్' అనే ఎంజైమ్ వేరుచేశారు, ఇది ప్రయోగశాల అధ్యయనాలలో కణ విభజనను తగ్గించి, దెబ్బతిన్న కణాల 'అపోప్టోసిస్'ను ప్రేరేపిస్తుందని తేలింది. ఈ అన్వేషణను ధృవీకరించడానికిమానవ అధ్యయనాలు ఏవీ లేవు.
మేము పైనాపిల్ క్యాన్సర్ నిరోధక లక్షణాల కోసం వెతికినప్పుడు, పైనాపిల్‌లో బ్రోమెలైన్ ఉందని మేము కనుగొన్నాము, ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ చర్యలు, ఫైబ్రినోలైటిక్ ప్రభావాలు, యాంటీకాన్సర్ కార్యకలాపాలు, ఇమ్యునోమోడ్యులేటరీ ప్రభావాలను కలిగి ఉంటుంది. ఈ కథనాలు
ncbiలో ప్రచురించారు.
science direct.com కూడా ఈ శాస్త్రీయ పత్రాలను ప్రచురించారు, అయితే ఈ పరీక్షలు ఎలుకలపై జరిగాయి. మానవులపై కాదు.
AFP ఫ్యాక్ట్ చెక్ ప్రకారం, ఇండోనేషియా క్యాన్సర్ ఫౌండేషన్ ఛైర్మన్ ప్రొఫెసర్ డాక్టర్ అరు విసాక్సోనో సుడోయో, క్యాన్సర్‌కు చికిత్సగా పైనాపిల్‌ను ఉపయోగించడాన్ని సమర్ధించే ఆధారాలు లేవని తెలిపారు. "ఇతర పండ్ల మాదిరిగానే - యాపిల్స్, అవకాడోలతో సహా పైనాపిల్స్ కూడా ఆరోగ్యకరమైనవి. అవి మంచి ఆరోగ్యం, రోగనిరోధక శక్తికి తోడ్పడగల పండ్లు. అంతకన్నా ఎక్కువ కాదు," అని ఆగస్టు 6, 2021న AFPకి చెప్పారు.
పైనాపిల్, ఇతర ఆరోగ్యకరమైన పండ్లు, కూరగాయలను తీసుకోవడం క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడవచ్చు, అయితే అవి వ్యాధికి వైద్య చికిత్సలు లేదా చికిత్సలకు సమానం కాదని గుర్తించాలి. బ్రోమెలైన్, పైనాపిల్‌లో కనిపించే ఎంజైమ్‌ల సమూహం, క్యాన్సర్ కణాల పెరుగుదలను అణిచివేసేందుకు టెస్ట్-ట్యూబ్ అధ్యయనాలలో పరిశోధించారు.
ఫస్ట్ చెక్ 2023లోనే ఈ క్లెయిమ్ పై ఫ్యాక్ట్ చెక్ చేసింది. ప్రాంతీయ క్యాన్సర్ సెంటర్ BJ మెడికల్ కాలేజ్‌లోని ప్రొఫెసర్, భారతదేశంలోని అహ్మదాబాద్‌లోని అపోలో హాస్పిటల్స్‌లో డాక్టర్ జయేష్ డి పటేల్ అనే కన్సల్టెంట్ ఆంకాలజిస్ట్ చేసిన ప్రకటనను ప్రచురించింది. ఇలాంటి తప్పుదారి పట్టించే వాదనలు రోగులకు సకాలంలో వైద్యం అందకుండా నిరోధిస్తాయని, అత్యంత ప్రమాదకరమని ఆయన హెచ్చరించారు. “పైన్ యాపిల్ లో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నప్పటికీ, అవి క్యాన్సర్‌ను నయం చేయలేవు. ఈ పండు రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది, ”అని ఆయన చెప్పారు.
పైనాపిల్‌ను వేడి నీటిలో మరిగించి తీసుకోవడం వలన క్యాన్సర్ నయం అవుతుందనే వాదన అబద్ధం. పైనాపిల్‌ను మితమైన పరిమాణంలో తినడం ఆరోగ్యకరమే అయినప్పటికీ, ఇది క్యాన్సర్‌ను నయం చేస్తుందని శాస్త్రీయంగా ఎవరూ నిరూపించలేదు. నిర్ధారణ అవ్వలేదు. ఆరోగ్యపరమైన సమస్యలు వస్తే సొంత వైద్యాన్ని ఎక్కువగా నమ్ముకోకుండా వైద్యులను సంప్రదించండి.