ఫ్యాక్ట్ చెక్: 28 దీవులను మాల్దీవుల ప్రభుత్వం భారత్‌కు అప్పగించిందన్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
జనవరి 2024లో, మాల్దీవుల క్యాబినెట్ మంత్రులు భారత ప్రధాని, భారతదేశం మీద జాత్యహంకారం వ్యాఖ్యలు చేయడంతో దేశ వ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు మొదలయ్యాయి. మాల్దీవులకు వెళ్లడాన్ని కూడా ఆపేసుకున్నారు ఎంతో మంది భారతీయులు
జనవరి 2024లో, మాల్దీవుల క్యాబినెట్ మంత్రులు భారత ప్రధాని, భారతదేశం మీద జాత్యహంకారం వ్యాఖ్యలు చేయడంతో దేశ వ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు మొదలయ్యాయి. మాల్దీవులకు వెళ్లడాన్ని కూడా ఆపేసుకున్నారు ఎంతో మంది భారతీయులు. ఈ ఆందోళనల కారణంగా భారతదేశం, మాల్దీవుల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. 2023 ఎన్నికల సమయంలో మాల్దీవుల అధ్యక్షుడి ప్రచార అంశం కూడా ‘ఇండియా అవుట్’ విధానం కావడంతో రాను రాను రెండు దేశాల మధ్య దూరం ఎక్కువైంది.
వీటన్నింటి తర్వాత, భారత విదేశాంగ మంత్రి జైశంకర్ మాల్దీవుల అధ్యక్ష కార్యాలయాన్ని సందర్శించినట్లు చూపించే వీడియో వైరల్ అవుతూ ఉంది. 'మాల్దీవులకు చెందిన 28 దీవులను భారతదేశానికి అప్పగించింది' అనే శీర్షికతో వీడియోను పోస్టు చేస్తున్నారు. ఆ దేశ అధ్యక్షుడు ముయిజీ స్వయంగా ఒప్పందంపై సంతకం చేశారని తెలిపారు.
మేము క్లెయిమ్‌తో పాటు షేర్ చేసిన వీడియోను గమనించినప్పుడు, ఆ వీడియోలో Zeenews లోగో ఉన్నట్లు మేము కనుగొన్నాము. కాబట్టి మేము జీ న్యూస్‌లో ప్రచురించిన వీడియో వార్తల నివేదిక కోసం వెతికాము. ‘India Bangladesh breaking: बांग्लादेश छोड़िए, मालदीव के 28 द्वीपों में घुसा भारत |Maldives|Jaishankar’ అనే టైటిల్‌తో జీ న్యూస్ యూట్యూబ్ ఛానెల్ షేర్ చేసిన వీడియోను న్యూస్ రిపోర్ట్‌లో కనుగొన్నాం.
మాల్దీవుల్లోని 28 దీవుల్లోకి భారత్ ఒకేసారి ప్రవేశించిందని వీడియోలోని కథనం పేర్కొంది. "మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జూ మాల్దీవుల్లోని 28 దీవులను భారత్‌కు అప్పగించారు. మాల్దీవుల్లో భారత్ భారీ విజయం సాధించింది. మాల్దీవులలో విజయం రాబోయే కాలంలో బంగ్లాదేశ్ చిత్రపటాన్ని మారుస్తుంది, ఎందుకంటే బంగ్లాదేశ్, మాల్దీవులు రెండింటిలోనూ ఇండియా ఔట్ ప్రచారం ద్వారా ప్రతిపక్ష పార్టీలు అధికారంలోకి వచ్చాయి, కానీ ఇప్పుడు రెండూ మోకాళ్లపైకి రావడానికి సిద్ధంగా ఉన్నాయి. మాల్దీవుల్లోని 28 దీవులను భారత్‌కు అప్పగించినట్లు మహ్మద్ ముయిజు ప్రకటించారు. భారతదేశం ఈ 28 ద్వీపాలలో నీరు, మురుగునీటి ప్రాజెక్టులను నిర్మించగలదు. సముద్రంతో చుట్టుముట్టబడిన మాల్దీవులలో నీటి కొరత తీవ్రంగా ఉన్న సంగతి తెలిసిందే. కొద్దిరోజుల క్రితం మాల్దీవులు అహంకారం చూపి చైనా నుంచి నీళ్లు కొనుక్కుంది. మహ్మద్ ముయిజ్జూ ఈరోజు విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్‌ను కలవడం చాలా ఆనందంగా ఉందని రాశారు. మాల్దీవుల్లోని 28 దీవుల్లో నీరు, మురుగునీటి పారుదల ప్రాజెక్టుల ప్రాజెక్టులను భారత్‌కు ఇచ్చాను. మాల్దీవులకు ఎల్లవేళలా మద్దతు ఇస్తున్నందుకు భారత ప్రభుత్వానికి, ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు చెప్పారు. మా భాగస్వామ్యం నిరంతరం బలపడుతోంది. ఇదే వ్యక్తి కొద్దిరోజుల క్రితం భారతదేశానికి వ్యతిరేకంగా మాట్లాడాడు.. కానీ ఈ రోజు స్వయంగా విదేశాంగ మంత్రి కి బాధ్యతలు అప్పగించాడు. చైనా దెయ్యాన్ని మాల్దీవుల నుంచి తరిమికొట్టారు. భారత్ ముందు మాల్దీవులు మోకరిల్లింది. రాబోయే రోజుల్లో బంగ్లాదేశ్ కూడా అదే పరిస్థితి రానుంది. ఈరోజు హిందువులను చంపేస్తున్న బంగ్లాదేశ్ హిందువులకు క్షమాపణలు చెబుతుంది." అని ఆ వీడియోలో ఉంది. అయితే ఈ వీడియో ఇప్పుడు డిలీట్ చేసేసారు.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. మాల్దీవులు 28 దీవులను భారత్‌కు అప్పగించలేదు. భారత విదేశాంగ మంత్రి 28 మాల్దీవుల దీవుల్లో నీరు, మురుగునీటి ప్రాజెక్టును ప్రారంభించారు.
జీన్యూస్ వీడియో కథనం తప్పు అయినప్పటికీ.. మాల్దీవులలో 28 నీటి ప్రాజెక్టులకు భారతదేశం నిధులు సమకూరుస్తుందని వీడియో వివరణ పేర్కొంది. జైశంకర్ మాల్దీవుల్లో భారతదేశం-నిధులతో కూడిన అతిపెద్ద పారిశుద్ధ్య ప్రాజెక్టును ప్రారంభించారు. విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మాల్దీవులకు సుమారు రూ. 923 కోట్ల (USD 110 మిలియన్లు) నిధులతో 28 ద్వీపాలలో భారీ నీరు, పారిశుద్ధ్య ప్రాజెక్టును అందజేశారు. మూడు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం మాల్దీవులకు వెళ్లిన జైశంకర్ ఇక్కడి అధ్యక్షుడు మహ్మద్ ముయిజు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ప్రాజెక్టులను ప్రారంభించారు. ఈ వీడియో ఇప్పుడు డిలీట్ చేసేసారు.
డాక్టర్ మొహమ్మద్ ముయిజ్జూ చేసిన ట్వీట్ కోసం మేము శోధించగా.. మాల్దీవులలోని 28 దీవులలో నీరు, మురుగునీటి ప్రాజెక్టులను అధికారికంగా అప్పగించినట్లు ట్వీట్ పేర్కొంది. మాల్దీవులకు ఎల్లప్పుడూ మద్దతు ఇస్తున్నందుకు భారత ప్రభుత్వానికి, ప్రత్యేకించి ప్రధానమంత్రి @narendramodiకి కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్ చేశారు. “Our enduring partnership continues to strengthen, bringing our nations closer through cooperation in security, development, and cultural exchange. Together, we build a brighter, more prosperous future for the region.” అని ట్వీట్ ఉంది. భారతదేశ మద్దతును ఆయన స్వాగతించారు. మాల్దీవాన్ దీవులను భారత్‌కు అప్పగిస్తున్నట్లు పోస్టులో ఎక్కడా పేర్కొనలేదు.
ఆగస్ట్ 11, 2024న NDTV ప్రచురించిన నివేదిక ప్రకారం.. విదేశాంగ మంత్రి S జైశంకర్ USD 110 మిలియన్ల విలువైన నీరు, పారిశుద్ధ్య ప్రాజెక్టును భారతదేశం ద్వారా మాల్దీవులకు అప్పగించారు. ఈ ప్రాజెక్ట్ 28 ద్వీపాలలో విస్తరించి ఉంది.
వర్చువల్ ప్రారంభోత్సవాన్ని ఉద్దేశించి ఎస్ జైశంకర్ మాట్లాడుతూ, భారతదేశం, మాల్దీవుల మధ్య భాగస్వామ్యం కారణంగా మాల్దీవుల ప్రజలు, ప్రభుత్వ అవసరాలు, ప్రాధాన్యతలను తీర్చడంపై దృష్టి పెట్టామని తెలిపారు.
ఇండియా టుడే నివేదిక ప్రకారం, జైశంకర్ మాల్దీవుల్లోని మాలేలో 3 రోజుల అధికారిక పర్యటనలో ఉన్నారని తెలిపింది. ఎగ్జిమ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా ఇండియన్ లైన్ ఆఫ్ క్రెడిట్ ఫెసిలిటీ కింద ప్రాజెక్టును ప్రారంభించారు.. 28 ద్వీపాలలో నీరు, పారిశుద్ధ్య ప్రాజెక్టులను జైశంకర్ గొప్ప పనిగా అభివర్ణించారు.
అందువల్ల, భారత విదేశాంగ మంత్రి జైశంకర్.. మాల్దీవుల్లోని 28 దీవులలో నీరు, పారిశుద్ధ్య ప్రాజెక్టును ప్రారంభించారు. ఈ అభివృద్ధి ప్రాజెక్టుకు సంబంధించిన ఒప్పందంపై ఇరు దేశాల మంత్రులు కూడా సంతకాలు చేశారు. 28 దీవులను మాల్దీవుల ప్రభుత్వం భారత్‌కు అప్పగించిందన్న వాదన అవాస్తవం.
Claim : మాల్దీవులు 28 దీవులను భారతదేశానికి అప్పగించింది. అధ్యక్షుడు ముయిజు స్వయంగా ఒప్పందంపై సంతకం చేశారు.
Claimed By : Social media users
Fact Check : False