ఫ్యాక్ట్ చెక్: ఓ వ్యక్తి బహిరంగంగా పోలీస్‌ని చెంపదెబ్బ కొట్టిన వీడియో ఆంధ్రప్రదేశ్ ది కాదు, తమిళనాడులో జరిగిన ఘటన.
ఏపీలో పోలింగ్ రోజు దగ్గర పడుతూ ఉండడంతో ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ పార్టీల నేతలు ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు, వారి ఓట్లను రాబట్టుకునేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఏపీలో పోలింగ్ రోజు దగ్గర పడుతూ ఉండడంతో ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ పార్టీల నేతలు ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు, వారి ఓట్లను రాబట్టుకునేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు నాయకులు తమ ప్రచార సమయంలో సామాన్యుల కష్టాలు తమకు తెలుసని చెబుతున్నారు. మరి కొందరు ఓటర్లను ప్రసన్నం చేసుకోవడం కోసం రోడ్డు పక్కన క్యాంటీన్లలో దోసెలు తయారు చేయడం, వృద్ధులకు తినిపించడం వంటి కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నారు. ఎలాంటి సహాయం చేయడానికైనా సిద్ధమని చెబుతూ ప్రజలను ఆకట్టుకోడానికి ప్రయత్నిస్తున్నారు.
ఇక ప్రత్యర్థులను ఓడించడానికి అనేక పనులు చేస్తూ ఉన్నారు. అవకాశవాద రాజకీయాలకు కూడా ఏపీ కేంద్రంగా మారింది. ప్రభుత్వం మీద, రాష్ట్రంలో పరిస్థితుల గురించి తప్పుడు సంకేతాలు వెళ్లేలా చేయడానికి కూడా కొందరు ప్రయత్నిస్తూ ఉన్నారు. అందులో భాగంగా చాలా పాత చిత్రాలు, వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో వైరల్ అయ్యే కొన్ని వార్తలు మార్ఫింగ్ కూడా చేస్తున్నారు. ఇక కొన్ని వీడియోలతో ప్రజలను తప్పుదారి పట్టించడమే లక్ష్యంగా చేసుకుంటూ ఉంటారు.
అటువంటి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. పట్టపగలు ఓ వ్యక్తి పోలీసులను చెంపదెబ్బ కొట్టడం ఆ వీడియోలో ఉంది. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్‌లో జరిగిందనే క్యాప్షన్‌తో షేర్ చేస్తున్నారు.
“పట్టపగలు నడిరోడ్డు మీద ఒక పోలీస్ అధికారి మీద ఇలా చెయ్య చేసుకుంటున్నాడు అంటే చాలా దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉంది ఆంధ్రప్రదేశ్... మేలుకో ఆంధ్రుడా నీ అమూల్యమైన ఓటు ని టీడీపీ జనసేన కూటమికి వేసి ఆంధ్రరాష్ట్రాన్ని పరిరక్షించు...” అంటూ తెలుగులో పోస్టులను వైరల్ చేస్తున్నారు.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదారి పట్టించేదిలా ఉంది. ఈ వీడియో తమిళనాడులోని చెన్నైకి చెందినది.. ఆంధ్రప్రదేశ్ లో చోటు చేసుకున్నది కాదు. మేము వీడియో నుండి తీసుకున్న కీఫ్రేమ్‌లను Google లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేశాం. 2017లో ప్రచురించిన కొన్ని వార్తా నివేదికలను మేము కనుగొన్నాము.
Mirror Now అనే యూట్యూబ్ ఛానల్ లో డిసెంబర్ 25, 2017న ‘Chennai: Students Slap Cop When He Caught Three Of Them Riding On A Motorbike’ అనే టైటిల్ తో వీడియోను అప్లోడ్ చేశారని గుర్తించాం. చెన్నై లో ట్రిపుల్ రైడింగ్ చేస్తున్న వారిని పట్టుకునే సమయంలో పోలీసుల మీద దాడి జరిగిందని ఈ వీడియోను అప్లోడ్ చేసిన వ్యక్తులు తెలిపారు.
టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రకారం.. టిపుల్ రైడింగ్ చేస్తున్న ముగ్గురు విద్యార్థులను పోలీసు ఆపాడు. ఆ తరువాత జరిగిన వాదనలో, 21 ఏళ్ల విద్యార్థి పోలీసులను చెంపదెబ్బ కొట్టాడు.
ఈ వీడియోను oneindia.com యూట్యూబ్ ఛానెల్ లో కూడా పోస్టు చేసింది. చెన్నై పోలీసును కాలేజీ విద్యార్థి చెంపదెబ్బ కొట్టిన షాకింగ్ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారిందని వీడియో వివరణలో ఉంది. ట్రాఫిక్ ఉల్లంఘన చేస్తున్నారని ఆపగా.. విద్యార్థి పోలీసులపై మొదట దుర్భాషలాడడం మొదలు పెట్టాడు. ఆపై అతనిపై దాడి చేయడం వీడియోలో చూడొచ్చు. పిలియన్ రైడర్లలో ఒకరైన మణికందన్ కానిస్టేబుల్ వద్దకు వెళ్లి గొడవపడ్డాడు. కానిస్టేబుల్ మగేశ్వరణ్.. పరి నగర్-కరికాలన్ నగర్ జంక్షన్ వద్ద విధులు నిర్వర్తిస్తూ ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది.
ఓ వ్యక్తి పోలీసులను చెంపదెబ్బ కొట్టిన వైరల్ వీడియో ఆంధ్రప్రదేశ్‌కి చెందినది కాదు, తమిళనాడులోని చెన్నైకి చెందినది. వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదారి పట్టిస్తూ ఉంది.
Claim : ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ వ్యక్తి పట్టపగలు పోలీసును కొట్టాడు, ఇది ఏపీలో పోలీసుల దయనీయ పరిస్థితి
Claimed By : Social media users
Fact Check : Misleading