ఫ్యాక్ట్ చెక్: మార్కెట్‌లో విక్రయించే అన్ని ప్రొటీన్‌ పౌడర్‌లను పురుగులను ఉపయోగించి తయారు చేయడం లేదు

మనిషి శరీరంలోని ఎముకలు, కండరాలకు ప్రోటీన్ చాలా ముఖ్యం. హార్మోన్లు, ఎంజైమ్‌లు వంటి వాటిని ఉత్పత్తి చేయడానికి శరీరానికి

Update: 2024-10-10 04:57 GMT

mealworms

మనిషి శరీరంలోని ఎముకలు, కండరాలకు ప్రోటీన్ చాలా ముఖ్యం. హార్మోన్లు, ఎంజైమ్‌లు వంటి వాటిని ఉత్పత్తి చేయడానికి శరీరానికి ప్రోటీన్లు అవసరం. అనేక మంది అథ్లెట్లు, ఫిట్‌నెస్ ఔత్సాహికులు కండలను పెంచడానికి, ఫిట్‌గా ఉండటానికి ప్రోటీన్ సప్లిమెంట్లను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. జిమ్ లలో జాయిన్ అయితే చాలు ప్రోటీన్ పౌడర్ తీసుకోవాలంటూ సలహాలు ఇస్తూ ఉంటారు. సాధారణంగా మనం తీసుకునే ఫుడ్ నుండి కావాల్సిన ప్రోటీన్ అందకపోతే ప్రోటీన్ పౌడర్లను వాడాలని చెబుతూ ఉంటారు.

ప్రోటీన్ పౌడర్‌లు కండరాలను నిర్మించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ప్రోటీన్ పౌడర్లను తీసుకోవడం వల్ల బరువు తగ్గడం, కండరాలను సరైన షేప్ లో ఉంచడంలో సహాయపడతాయి. మార్కెట్లో వివిధ ప్రోటీన్ పౌడర్లు అందుబాటులో ఉన్నాయి, కొన్ని పాల ఆధారితమైనవి అయితే, కొన్ని మొక్కల నుంచి తీసినవి. వీగన్ అంటూ చెప్పుకునే వారు ప్లాంట్ బేస్డ్ ప్రోడక్ట్స్ ను ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. 
అయితే ఒక వివరణాత్మక వీడియోను షేర్ చేస్తున్న
 ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. ప్రొటీన్ పౌడర్‌లను ఉత్పత్తి చేయడానికి తయారీదారులు ఉపయోగించే అసలు విధానం ఈ వీడియోలో ఉందంటూ పేర్కొన్నారు. ఆ వీడియోలో లేత గోధుమరంగు పురుగులను నలిపి పౌడర్ చేయడం చూడొచ్చు. అలా ఆ పొడిని పాలలో కలపడం మనం చూడొచ్చు. “Protein తయారు చేసే విధానం #protein #socialawareness #shorts” అంటూ పోస్టులు పెడుతున్నారు. ‘మీకు ప్రోటీన్ బూస్ట్లు తాగేఅలవాటు ఉందా అయితే చుడండి ఎలా తయారుచేస్తున్నారో” అంటూ పోస్టు వైరల్ అవుతూ ఉంది.

ఫ్యాక్ట్ చెకింగ్:

వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదారి పట్టించేది. మీల్‌వార్మ్‌ల నుండి ప్రోటీన్ పౌడర్ తయారీ చేయడాన్ని వీడియో చూపిస్తుంది. ముందుగా, మేము ప్రోటీన్ సప్లిమెంట్ల గురించి సమాచారం కోసం వెతికాము మార్కెట్లో విక్రయించే ప్రోటీన్ సప్లిమెంట్లలో ఎక్కువ భాగం వెయ్ ప్రోటీన్ అని మేము కనుగొన్నాము.
Whey Protien
 అనేది పాల నుండి సేకరించిన ప్రోటీన్, ఇది జున్ను తయారు చేసేటప్పుడు పెరుగు నుండి వేరు చేస్తారు. ఇది అత్యంత సాధారణ ప్రోటీన్ సప్లిమెంట్. అథ్లెట్ల పనితీరును మెరుగుపరచడానికి, బలాన్ని పెంచుకోడానికి వే ప్రోటీన్‌ను ఉపయోగిస్తారు. ఇది మధుమేహం, ఉబ్బసం, బరువు తగ్గడం మొదలైన వాటికి కూడా ఉపయోగిస్తారు.
Whey Protien తయారీ మొదట ఆవు పాలతో మొదలవుతుంది. ఇందులో కేసిన్, వే అనే రెండు ప్రధాన ప్రోటీన్లు ఉంటాయి. 1 కిలో వే ప్రొటీన్ పౌడర్‌ను ఉత్పత్తి చేయడానికి దాదాపు 200లీటర్ల పాలు అవసరమవుతాయి. 100లీటర్ల పాల నుండి 12 కిలోల చీజ్‌ని ఉత్పత్తి చేస్తారు.
ప్రోటీన్ పౌడర్‌లలో సాధారణ రకాలుగా వే (పాలవిరుగుడు), కాసిన్, సోయా, జనపనార ఉంటాయి. వే, కాసిన్ రకాలు పాల ఆధారితమైనవి కాగా.. సోయా, జనపనార మొక్కల ఆధారిత ప్రోటీన్లు.
వైరల్ వీడియో నుండి కీఫ్రేమ్‌లను తీసుకుని Google రివర్స్ ఇమేజ్ సెర్చ్‌ని ఉపయోగించి సెర్చ్ చేశాం. అప్పుడు కింగ్ ఫుడ్ అనే యూట్యూబ్ ఛానెల్ ప్రచురించిన నిడివి ఎక్కువ ఉన్న వీడియోను మేము కనుగొన్నాము. 11 నిమిషాల వీడియోను “This is a protein thug! Future Food Edible Insect, Mealworm / Korean food factory” అనే టైటిల్‌తో షేర్ చేశారు.
Full View
ఈ పురుగుల నుండి తయారైన ప్రొటీన్ పౌడర్ భారతదేశంలో అందుబాటులో ఉన్నప్పటికీ, దీనిని 'హై ప్రోటీన్ మీల్వార్మ్ పౌడర్' వంటి పేర్లతో విక్రయిస్తున్నారు. బతికే ఉన్న మీల్‌వార్మ్‌లను పక్షులు, ఇతర పెంపుడు జంతువులకు ఆహారంగా ఆన్‌లైన్‌లో కూడా విక్రయిస్తారు.


 


ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారులు షేర్ చేసిన వీడియోలో మీల్‌వార్మ్‌లను ఉపయోగించి ప్రోటీన్ పౌడర్ తయారీ చేసినప్పటికీ, ఈ తరహా ప్రోటీన్ పౌడర్లు స్టోర్‌లలో ఎక్కువగా అందుబాటులో ఉండవు. స్టోర్లలో లభించే సాధారణ ప్రోటీన్ సప్లిమెంట్ వే ప్రోటీన్ అని భావించవచ్చు. దీన్ని ఆవు పాల నుండి సేకరిస్తారు. ఈ వైరల్ వీడియో మార్కెట్‌లో కనిపించే సాధారణ ప్రోటీన్ సప్లిమెంట్‌లను చూపుతుందనే వాదన తప్పుదారి పట్టిస్తోంది. మీల్‌వార్మ్స్ అనే కీటకాల నుండి ప్రోటీన్‌ను సేకరించేందుకు ఉపయోగించే ఒక ప్రత్యేక ప్రక్రియ అని గుర్తుంచుకోవాలి. వైరల్ పోస్టులు ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఉన్నాయి.

Claim :  మార్కెట్‌లో అమ్మే ప్రొటీన్‌ పౌడర్‌లను పురుగులను ఉపయోగించి తయారు చేస్తున్నారు
Claimed By :  Instagram User
Fact Check :  Misleading
Tags:    

Similar News