ఫ్యాక్ట్ చెక్: జర్నలిస్టులను తిట్టినా, బెదిరించినా శిక్ష పడుతుందని సుప్రీం కోర్టు చెప్పలేదు

జర్నలిస్టులను తిట్టినా, బెదిరించినా శిక్ష పడుతుందని సుప్రీం కోర్టు చెప్పిందంటూ పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Update: 2023-05-22 10:43 GMT

జర్నలిస్టులను తిట్టినా, బెదిరించినా శిక్ష పడుతుందని సుప్రీం కోర్టు చెప్పిందంటూ పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

“*జర్నలిస్టులను తిట్టినా, బెదిరించినా* *రూ.50వేల జరిమానా - ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష, సుప్రీం తీర్పు* *న్యూఢిల్లీ : దేశంలోని వర్కింగ్ జర్నలిస్టులు, పాత్రికేయులను బెదిరించినా, తిట్టినా లేదా కొట్టినా రూ.50వేల జరిమానా లేదా ఐదేళ్లు కఠిన కారాగార శిక్షకు అర్హులవుతారని దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది. ఈ మేరకు గురువారం ఓ కేసు విచారణ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ తీర్పుతో పలువురు జర్నలిస్టులు తమ వృత్తి పరంగా ఎలాంటి భయాందోళనలకు గురి కాకుండా నిర్భయంగా ప్రజలకు వాస్తవ సమాచారం అందించే అవకాశం ఉంటుందని పలు జర్నలిస్టు సంఘాల నేతలు, సీనియర్ జర్నలిస్టులు తీర్పును ఆహ్వానిస్తున్నారు. అలాగే రాజకీయ నాయకుల నుంచి ఒకింత రక్షణ ఉంటుందని సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.”

ఫ్యాక్ట్ చెకింగ్:

జర్నలిస్టులపై అసభ్యంగా ప్రవర్తిస్తే సుప్రీంకోర్టు శిక్ష విధిస్తుందన్న వాదనలో ఎటువంటి నిజం లేదు. అత్యున్నత న్యాయస్థానం అలాంటి ఉత్తర్వులేవీ ఇవ్వలేదు. మేము కీ వర్డ్స్ ను ఉపయోగించి ఇంటర్నెట్‌లో సెర్చ్ చేయగా ప్రముఖ వార్తాపత్రికలలో ఎక్కడా అటువంటి సమాచారం ప్రచురించలేదని గుర్తించాం. సుప్రీంకోర్టు వెబ్‌సైట్‌ లో కూడా అలాంటి తీర్పును ప్రచురించలేదు.

భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 (1) (ఎ) దేశంలోని ప్రతి పౌరునికి వాక్ స్వాతంత్ర్యం, భావప్రకటన స్వేచ్ఛను ఇస్తుంది. ఈ ఆర్టికల్ కి కొన్ని పరిమితులు ఉన్నాయి.

మేము మరింత పరిశోధించినప్పుడు, మీడియా రక్షణ బిల్లును ఆమోదించిన మొదటి రాష్ట్రం మహారాష్ట్ర అని మేము కనుగొన్నాము. ఈ బిల్లు పేరు “The Maharashtra Media Persons and Media Institutions (Prevention of Violence and Damage or Loss to Property) Bill 2017 అని ఉంది.

ఎకనామిక్ టైమ్స్ ప్రకారం, ఈ బిల్లును దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వం 2017లో ఆమోదించింది. కేంద్రం వద్ద రెండేళ్లుగా పెండింగ్‌లో ఉంది. విధి నిర్వహణలో ఉన్న మీడియా ప్రతినిధులపై దాడి చేస్తే మూడేళ్ల వరకు శిక్ష లేదా రూ. 50,000 వరకు జరిమానా లేదా రెండూ విధించాలని ఈ బిల్లు సిఫార్సు చేస్తోంది.

2019 లో ఈ బిల్లుకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదం తెలిపారు.

ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం కూడా మార్చి 2023లో జర్నలిస్టులకు రక్షణ కల్పించేందుకు చట్టాన్ని ఆమోదించింది. ఈ బిల్లును 'ఛత్తీస్‌గఢ్ మీడియాపర్సన్స్ ప్రొటెక్షన్ బిల్లు 2023’ అని పిలుస్తారు. దీన్ని మీడియా ప్రతినిధులకు రక్షణ కల్పించడం, వారిపై హింసను నిరోధించడానికి లక్ష్యంగా పెట్టుకుని తీసుకుని వచ్చిన బిల్లు.

వైరల్ అవుతున్న వాదనలో ఎటువంటి నిజం లేదు. విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టులను దుర్భాషలాడడం, బెదిరించినందుకు శిక్ష విధించామని సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పును ఇవ్వలేదు. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వాలు తమ తమ రాష్ట్రాల్లో ఇటువంటి బిల్లులను ఆమోదించాయి.

Claim :  Supreme Court passed Media protection bill
Claimed By :  Social Media Users
Fact Check :  False
Tags:    

Similar News