ఫ్యాక్ట్ చెక్: వైరల్ వీడియో లో ఆస్ట్రేలియన్ వ్యోమగామి అంతరిక్షంలో నుండి భూమి పైకి దూకడంలేదు

ఆస్ట్రేలియన్ వ్యోమగామి అంతరిక్షం నుండి దూకుతున్న వీడియో అని పేర్కొంటూ, అంతరిక్షంలా కనిపించే ఎత్తైన ప్రదేశం నుండి ఒక వ్యక్తి దూకుతున్న వీడియో వైరల్‌ అవుతోంది. వీడియోలో, ఒక వ్యక్తి ఆకాశం నుండి దూకడం, జంప్ ని చూస్తున్న వ్యక్తులు, దూకిన తర్వాత ఒకరినొకరు అభినందించుకోవడం మనం చూడవచ్చు.

Update: 2024-08-20 05:23 GMT

Felix

ఆస్ట్రేలియన్ వ్యోమగామి అంతరిక్షం నుండి దూకుతున్న వీడియో అని పేర్కొంటూ, అంతరిక్షంలా కనిపించే ఎత్తైన ప్రదేశం నుండి ఒక వ్యక్తి దూకుతున్న వీడియో వైరల్‌ అవుతోంది. వీడియోలో, ఒక వ్యక్తి ఆకాశం నుండి దూకడం, జంప్ ని చూస్తున్న వ్యక్తులు, దూకిన తర్వాత ఒకరినొకరు అభినందించుకోవడం మనం చూడవచ్చు.

తెలుగులో క్లెయిమ్‌తో వీడియో ఆన్‌లైన్‌లో షేర్ చేస్తున్నారు. “ఆస్ట్రేలియన్ శాస్త్రవేత్త అంతరిక్షం నుంచి 1,28,000 అడుగుల ఎత్తునుంచి దూకి భూమికి చేరుకున్నాడు... 1236 కి.మీ. ప్రయాణాన్ని 4 నిమిషాల 5 సెకన్లలో పూర్తి చేశాడు... అతను భూమి కదులుతున్నట్లు స్పష్టంగా చూశాడు... అద్భుతమైన వీడియో, మీరూ చూడండి...” అంటూ పోస్టు పెట్టారు.




Full View

ఫ్యాక్ట్ చెకింగ్:

వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదారి పట్టిస్తోంది.

మేము Google రివర్స్ ఇమేజ్ సెర్చ్ ను ఉపయోగించి వీడియోకు సంబంధించిన కీఫ్రేమ్‌లను సెర్చ్ చేయగా.. మేము 2012లో ప్రచురించిన అనేక కథనాలను కనుగొన్నాము.

స్పేస్ న్యూస్ లో 43 సంవత్సరాల బామ్‌గార్ట్‌నర్ గురించి ప్రచురించిన ఒక కథనాన్ని మేము కనుగొన్నాము. అతను 39,044 మీటర్ల ఎత్తు నుండి దూకాడని తెలిపారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన స్కైడైవ్‌గా కొత్త రికార్డును నెలకొల్పాడు. బామ్‌గార్ట్‌నర్ అంతరిక్షం అధికారిక అంచు నుండి 100 కిలోమీటర్ల పైకి దూకకపోయినా, సాహసోపేతమైన సూపర్‌సోనిక్ జంప్ ప్రొఫెషనల్ వ్యోమగాముల దృష్టిని ఆకర్షించింది. రెడ్ బుల్ స్ట్రాటోస్ మిషన్ లో బామ్‌గార్ట్‌నర్ ఈ జంప్ చేశారు. ప్రముఖ ఎనర్జీ డ్రింక్ సంస్థ ఈ జంప్ ను స్పాన్సర్ చేసింది. ఈ స్టంట్ ను ప్రత్యక్ష ప్రసారం కూడా చేశారు.

fai.org ప్రకారం, 14 అక్టోబర్ 2012న ఆస్ట్రియన్ స్కైడైవర్, ఫెలిక్స్ బామ్‌గార్ట్‌నర్ అంతరిక్షం అంచు నుండి దూకడం చూడడం కోసం ఎనిమిది మిలియన్ల మందికి పైగా ప్రజలు ఆన్‌లైన్‌లో చూశారు. ఈ జంప్ కేవలం 09నిమిషాల 03 సెకన్లు మాత్రమే ఉంది. న్యూ మెక్సికోలోని రోస్వెల్ నుండి 38,969.4 మీటర్ల ఎత్తులో, బామ్‌గార్ట్నర్ ప్రత్యేకంగా రూపొందించిన సూట్‌ను ధరించి, ప్రెషరైజ్డ్ క్యాప్సూల్ నుండి బయటకు వచ్చాడు. అతను 36,529 మీటర్ల ఫ్రీఫాల్ చేసాడు. చివర్లో అతను తన పారాచూట్‌ని లాగి సురక్షితంగా భూమిపైకి చేరాడు.

ఈ జంప్ ద్వారా ఫెలిక్స్ మూడు FAI ప్రపంచ రికార్డులు బద్దలుకొట్టారు:

గరిష్ట వర్టికల్ స్పీడ్ (without drogue): 1,357.6 km/h

హయ్యస్ట్ ఎగ్జిట్ (జంప్) ఎత్తు: 38,969,4 metres

ఫ్రీఫాల్ నిలువు దూరం(without drogue): 36,402.6 metres

ఈ జంప్‌లో, బామ్‌గార్ట్‌నర్ మార్చి 2012లో అతను నెలకొల్పిన తన గరిష్ట నిలువు వేగం రికార్డును బద్దలు కొట్టాడు. అతని 14 అక్టోబర్ రికార్డ్ ఇప్పటికీ అలాగే ఉంది. అతని ఫాల్ డిస్టెన్స్ రికార్డ్ కూడా అలాగే ఉంది. అయితే ఎగ్జిట్ ఆల్టిట్యూడ్ రికార్డ్‌ను 2014లో అలాన్ యూస్టేస్ అధిగమించారు. డ్రోగ్ పారాచూట్‌తో 4,422మీ నుండి అలాన్ యూస్టేస్ దూకారు. బామ్‌గార్ట్నర్ రక్షణ లేదా ప్రొపల్షన్ లేకుండా ధ్వని వేగాన్ని విచ్ఛిన్నం చేసిన మొదటి వ్యక్తి గా నిలిచాడు. అతను 30 సెకన్ల పాటు 'సూపర్‌సోనిక్' గా మారాడు.. మ్యాక్ 1.25కి చేరుకున్నాడు. ఆసక్తికరంగా, 14 అక్టోబర్ 1947న, చక్ యెగెర్ X-1 గ్లామరస్ గ్లెన్నిస్‌లో మాక్ 1.05 వద్ద ధ్వని వేగాన్ని అధిగమించాడు.

Red Bull యొక్క Youtube ఛానెల్‌లో “Felix Baumgartner's supersonic freefall from 128k' - Mission Highlights” శీర్షికతో ప్రచురించిన వీడియో పొడవైన సంస్కరణను కూడా మేము కనుగొన్నాము. అక్టోబర్ 15, 2012న వీడియోను అప్లోడ్ చేశారు. వీడియో వివరణ ప్రకారం, హీలియం నిండిన బెలూన్‌లో 39,045 మీటర్లు (128,100 అడుగులు) ఎత్తుకు ప్రయాణించిన తర్వాత, ఫెలిక్స్ బామ్‌గార్ట్‌నర్ అంతరిక్షం అంచు నుండి రికార్డ్-బ్రేకింగ్ జంప్‌ను పూర్తి చేశాడు. సరిగ్గా 65 సంవత్సరాల తర్వాత చక్ యెగెర్ రికార్డును బ్రేక్ చేసినట్లు తెలిపారు. 43 ఏళ్ల ఆస్ట్రియన్ స్కైడైవింగ్ నిపుణుడు మరో రెండు ప్రపంచ రికార్డులను (అత్యధిక ఫ్రీఫాల్, అత్యధిక మానవ సహిత బెలూన్ ఫ్లైట్) బద్దలు కొట్టాడు.

Full View

అందువల్ల, ఒక వ్యక్తి ఆకాశం నుండి దూకుతున్నట్లు చూపించే వీడియోలో వ్యోమగామి అంతరిక్షం నుండి దూకడం లేదు, అది అంతరిక్షం అంచు నుండి సూపర్‌సోనిక్ ఫ్రీఫాల్‌ చేస్తున్న స్కైడైవర్‌ కి సంబంధించింది. వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదారి పట్టిస్తోంది.

Claim :  ఆస్ట్రేలియన్ వ్యోమగామి అంతరిక్షంలో 128000 ఎత్తు నుండి భూమికి దూకినట్లు వైరల్ వీడియో చూపిస్తుంది
Claimed By :  Social media users
Fact Check :  Misleading
Tags:    

Similar News