ఫ్యాక్ట్ చెక్: బైక్ మీద వెళుతున్న మహిళలను కుక్కలు వెంటాడుతున్న వీడియో హైదరాబాద్ లో చోటు చేసుకుంది కాదు
హైదరాబాద్ నగరంలో వీధికుక్కల కారణంగా ఎన్నో సమస్యలు తలెత్తుతూ ఉన్నాయంటూ ఫిర్యాదులు అందుతూనే ఉన్నాయి. కొద్దిరోజుల కిందట టోలీచౌకీలో వీధికుక్కల దాడిలో నాలుగేళ్ల బాలుడు చనిపోయిన ఘటన పట్ల దేశం మొత్తం విస్తుపోయింది.
హైదరాబాద్ నగరంలో వీధికుక్కల కారణంగా ఎన్నో సమస్యలు తలెత్తుతూ ఉన్నాయంటూ ఫిర్యాదులు అందుతూనే ఉన్నాయి. కొద్దిరోజుల కిందట టోలీచౌకీలో వీధికుక్కల దాడిలో నాలుగేళ్ల బాలుడు చనిపోయిన ఘటన పట్ల దేశం మొత్తం విస్తుపోయింది.ఇద్దరు మహిళలు స్కూటర్‌పై పిల్లవాడితో సహా ప్రయాణిస్తూ ఉండగా.. వీధి కుక్కలు వెంబడించగా ఆ బైక్ కాస్తా ఆగి ఉన్న కారును ఢీకొట్టిన వీడియో పలు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో వైరల్ అవుతోంది. ఈ సంఘటన హైదరాబాద్‌లోని గాంధీనగర్‌లో జరిగిందని నెటిజన్లు చెబుతూ వస్తున్నారు.సీసీటీవీ ఫుటేజీతో కూడిన 24 సెకన్ల నిడివి గల వీడియోలో, స్కూటర్‌పై ప్రయాణిస్తున్న మహిళలను వీధికుక్కలు వెంబడించాయి. స్కూటర్ వెళ్లి పార్క్ చేసిన కారుని ఢీకొట్టడంతో వారందరూ ఎగిరి నేలపై పడ్డారు. అదృష్టవశాత్తూ కుక్కలు వారిని వెంబడించడం మానేసి పారిపోయాయి. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని గాంధీనగర్ 7వ లేన్‌గా పేర్కొన్నారు.“హైదరాబాద్ గాంధీనగర్లో కుక్కలు బీభత్సం సృష్టించాయి. కాలనీలో ద్విచక్రవాహనంపై వెళ్తున్న మహిళలను కుక్కలు దాడి చేసేందుకు వెంబడించాయి. ఈ క్రమంలో వాటి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో వెనక్కిచూస్తూ.. స్కూటీ డైవ్ చేసింది. దీంతో ముందువైపు రోడ్డుకు పక్కన పార్కు చేసిన కారును ఢీకొనడంతో ఒక్కసారిగా యాక్టీవ్ బండి పై నుండి ఇద్దరు మహిళలు , ఓ బాలుడు ఎగిరిపడ్డారు.” అంటూ పోస్టులు పెట్టారు.
https://www.facebook.com/
జమ్మూలోని గాంధీనగర్‌లో ఈ ఘటన చోటుచేసుకుందనే వాదనతో ఈ వీడియోను మరికొందరు షేర్ చేశారు.
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా ఈ వీడియోను ట్వీట్ చేశారు. జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మిని కూడా ట్యాగ్ చేశారు.
ఫ్యాక్ట్ చెకింగ్:
హైదరాబాద్‌లోని గాంధీనగర్‌లో జరిగిన ఘటన జరిగిందంటూ జరుగుతున్న ప్రచారంలో ఎటువంటి నిజం లేదు. ఈ ఘటన ఒడిశాలోని బెర్హంపూర్‌లో చోటుచేసుకుంది.వీడియో నుండి సంగ్రహించిన కీలక ఫ్రేమ్‌లను గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ ఉపయోగించి శోధించాము. ఒడిశాలోని బెర్హంపూర్ నగరంలోని గాంధీనగర్ ప్రాంతంలో ఈ సంఘటన జరిగిందని పేర్కొన్న కొన్ని పోస్ట్‌లు మాకు కనిపించాయి.PTI న్యూస్ ట్విట్టర్ ఖాతా లో కూడా వైరల్ వీడియో ఒడిశాలోని బెర్హంపూర్ నగరంలో చోటు చేసుకుందని ప్రస్తావించారు. వీధికుక్కలు కరుస్తాయనే భయంతో ఓ మహిళ రోడ్డు పక్కన ఆగి ఉన్న కారుని తన స్కూటర్‌తో ఢీకొట్టింది. ఈ ఘటనలో మహిళలు ఇద్దరికీ అనేక గాయాలు అయ్యాయని తెలిపారు. “Caught on Camera | Scared of being bitten by stray dogs, a woman rammed her scooter into a car parked on the side of the road in Berhampur city in Odisha. Both women and the child sustained multiple injuries in the incident.” అనే క్యాప్షన్ తో వీడియోను పోస్టు చేశారు.
దీన్ని ఆధారంగా తీసుకుని, మేము “dogs chase scooter in Gandhinagar” అనే కీవర్డ్‌లతో సెర్చ్ చేసాం. అనేక వార్తా వెబ్‌సైట్‌లు ఈ వైరల్ వీడియోను ప్రచురించినట్లు మేము కనుగొన్నాము.republicworld.com ప్రకారం వీధికుక్కలు వెంబడించడంతో ఇద్దరు మహిళలు, ఒక చిన్నారి తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. బెర్హంపూర్ నగరంలోని గాంధీనగర్ ప్రాంతంలో కుక్కలు వెంబడించగా ఈ సంఘటన జరిగింది. ఈ ఘటనలో ముగ్గురికీ గాయాలు అయ్యాయి. ఈ ఘటన మొత్తం సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. ఉదయం 6 గంటల సమయంలో తాము గుడికి వెళ్తున్నామని, కుక్కల గుంపు తమను వెంబడించడం ప్రారంభించిందని బాధితుల్లో ఒకరు తెలిపారు. అప్పుడే ద్విచక్రవాహనం నడుపుతున్న మహిళ భయంతో స్కూటర్ వేగాన్ని పెంచాలని నిర్ణయించుకుంది. అలా వెళ్లే సమయంలో రోడ్డు పక్కన ఆగి ఉన్న కారును ఢీకొట్టింది.newindianexpress.com ప్రకారం.. సుప్రియ, సుస్మిత అనే మహిళలు సాయి కిరణ్ అనే పిల్లాడితో కలిసి ఆలయానికి వెళుతున్నారు. ఆ సమయంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో వారికి తల, నడుముపై గాయాలు అయ్యాయి. ముగ్గురిని ఓ ప్రైవేట్ క్లినిక్‌కి తరలించారు.వైరల్ వీడియోలో ఘటన ఒడిశాలోని బెర్హంపూర్‌లో చోటు చేసుకుంది. హైదరాబాద్‌లో చోటు చేసుకుందనే వాదనలో ఎటువంటి నిజం లేదు.
Claim : Dog chasing scooter in Gandhinagar, Hyderabad
Claimed By : Social Media Users
Fact Check : False