ఫ్యాక్ట్ చెక్: భారీగా కొండచరియలు విరిగిపడడాన్ని చూపించే వైరల్ వీడియో కేరళలోని వాయనాడ్ కు చెందినది కాదు
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆగస్టు 10, 2024న కేరళలోని కొండచరియలు విరిగిపడిన వాయనాడ్ జిల్లాను సందర్శించనున్నారు. రిలీఫ్ క్యాంప్, హాస్పిటల్, రిలీఫ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ల కోసం సైన్యం డిజాస్టర్ జోన్‌లో నిర్మించిన బెయిలీ బ్రిడ్జి ప్రాంతాలకు ప్రధాని మోదీ వస్తారని అధికారులు తెలిపారు
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆగస్టు 10, 2024న కేరళలోని కొండచరియలు విరిగిపడిన వాయనాడ్ జిల్లాను సందర్శించనున్నారు. రిలీఫ్ క్యాంప్, హాస్పిటల్, రిలీఫ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ల కోసం సైన్యం డిజాస్టర్ జోన్‌లో నిర్మించిన బెయిలీ బ్రిడ్జి ప్రాంతాలకు ప్రధాని మోదీ వస్తారని అధికారులు తెలిపారు. విపత్తు జరిగిన చోటులో ఏరియల్ సర్వే కూడా చేయనున్నారు. ఆయన ప్రత్యేక విమానంలో కన్నూర్ విమానాశ్రయానికి చేరుకుని ఐఏఎఫ్ హెలికాప్టర్‌లో వాయనాడ్‌కు వెళతారు.
వయనాడ్‌లో భారీ కొండచరియలు విరిగిపడి వందలాది మంది మృతి చెందగా, వేలాది మంది నిర్వాసితులైన నేపథ్యంలో రాష్ట్ర స్థాయి ఓనం వేడుకలను రద్దు చేయాలని కేరళ పర్యాటక శాఖ నిర్ణయించింది. తప్పిపోయిన వారి కోసం అన్వేషణ, ప్రాణాలతో బయటపడిన వారి పునరావాసం కోసం ప్రయత్నాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పర్యాటక శాఖ మంత్రి పి.ఎ.మహ్మద్ రియాస్ తెలిపారు.
అనధికారిక రికార్డుల ప్రకారం.. వాయనాడ్‌లోని మెప్పాడి పంచాయితీలోని అనేక ప్రాంతాలలో కొండచరియలు విరిగిపడటంతో మొత్తం 413 మంది మరణించారు. ఈ విపత్తులో 225 మంది మరణించినట్లు అధికారిక రికార్డులు చెబుతున్నాయని ముఖ్యమంత్రి పినరయి విజయన్ మీడియాకు తెలిపారు. శరీర భాగాలు, గుర్తుతెలియని మృతదేహాల డీఎన్‌ఏ పరీక్ష ఫలితాలు వచ్చిన తర్వాతే కొండచరియలు విరిగిపడి మరణించిన వారి సంఖ్యను కచ్చితంగా నిర్ధారించగలమని ఆయన అన్నారు. ఇంకా 131 మంది గల్లంతయ్యారని అధికారులు చెబుతున్నారు.
ఇక ఈ విధ్వంసానికి సంబంధించిన వీడియోలు అంటూ పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. యూట్యూబ్‌లో సర్క్యులేషన్‌లో ఉన్న అలాంటి ఒక వీడియోలో.. కేరళలోని వాయనాడ్‌లో కొండచరియలు విరిగిపడడాన్ని చూపుతున్న వీడియో అంటూ వినియోగదారులు పేర్కొన్నారు. భారీగా కొండచరియలు విరిగిపడటం వీడియోలో కనిపిస్తోంది.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. చైనాలోని జిగుయ్ కౌంటీలో కొండచరియలు విరిగిపడిన దృశ్యం వైరల్‌గా మారింది.
మేము వీడియో నుండి సంగ్రహించిన కీఫ్రేమ్‌లను ఉపయోగించి.. రివర్స్ ఇమేజ్ సెర్చ్ ను అమలు చేసాం. ఈ వీడియో X (Twitter), YouTube వంటి సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లలో జూలై 17, 2024న కొంతమంది వినియోగదారులు వీడియోను అప్లోడ్ మేము కనుగొన్నాము. “చైనాలోని హుబీ ప్రావిన్స్‌లోని జిగుయ్ కౌంటీలో (17.07.2024) భారీ కొండచరియలు విరిగిపడ్డాయి. ” అనే వాదనతో వీడియోలను అప్లోడ్ చేశారు.
మరింత సెర్చ్ చేయగా, eos.org అనే వెబ్‌సైట్ ఈ కొండచరియలు విరిగి పడిన ఘటనపై కథనాన్ని ప్రచురించినట్లు మేము కనుగొన్నాము. చైనాలోని జిగుయ్ కౌంటీలో జూలై 17, 2024న కొండచరియలు విరిగి పడ్డాయని.. ఆ వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేశారని కథనం పేర్కొంది. ఈ ప్రదేశం త్రీ గోర్జెస్ రిజర్వాయర్ ఒడ్డున ఉన్న జియాజియాడియన్ గ్రామం, గుయిజౌ టౌన్, జిగుయ్ కౌంటీ, హుబీ ప్రావిన్స్‌గా నివేదించబడింది. కొండచరియలు 800,000 క్యూబిక్ మీటర్ల పరిమాణంలో ఉన్నట్లు నివేదికలు సూచిస్తున్నాయి. చైనాలోని ఈ ప్రాంతంలో భారీ వర్షపాతం నమోదైందని.. అందుకే ఇలా జరిగిందని కూడా స్థానిక అధికారులు తెలిపారు. త్రీ గోర్జెస్ డ్యామ్ ద్వారా నీటిని నిల్వ చేశారని.. అయితే మరింత వర్షపాతం నమోదవ్వడంతో ఆ తర్వాత గేట్లు తెరిచారని తెలుస్తోంది.
ntdtv.com అనే చైనీస్ వెబ్‌సైట్‌లో కూడా కొండచరియలు విరిగిపడిన నివేదికను ప్రచురించారు. ఇందులో కూడా వైరల్ వీడియోను పంచుకున్నారు.
అందువల్ల, వైరల్ వీడియో చైనాలోని జిగుయ్ కౌంటీలో విరిగిపడిన కొండచరియలను చూపిస్తుంది. కేరళలోని వాయనాడ్ కు సంబంధించింది కాదు. వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
Claim : కేరళలోని వాయనాడ్‌లో భారీగా కొండచరియలు విరిగిపడిన వీడియో వైరల్‌గా మారింది
Claimed By : Youtube Users
Fact Check : False