ఫ్యాక్ట్ చెక్: నివేతా పేతురాజ్ పోలీసులతో వాగ్వాదానికి దిగిందంటూ వైరల్ అవుతున్న వీడియో తప్పుదారి పట్టించేలా ఉంది
ఈ రోజుల్లో, ప్రజలను ఆకర్షించడానికి నెగటివ్ పబ్లిసిటీని ఫ్యాషన్ గా పెట్టుకున్నారు. ఇటీవల నటి పూనమ్ పాండే సర్వైకల్ క్యాన్సర్ కారణంగా చనిపోయిందని నమ్మించేలా ప్రకటన చేసింది. అకస్మాత్తుగా ఏమి జరిగిందో అని అందరూ ఆశ్చర్యపోయారు.
ఈ రోజుల్లో, ప్రజలను ఆకర్షించడానికి నెగటివ్ పబ్లిసిటీని ఫ్యాషన్ గా పెట్టుకున్నారు. ఇటీవల నటి పూనమ్ పాండే సర్వైకల్ క్యాన్సర్ కారణంగా చనిపోయిందని నమ్మించేలా ప్రకటన చేసింది. అకస్మాత్తుగా ఏమి జరిగిందో అని అందరూ ఆశ్చర్యపోయారు. ఆమె చనిపోయిందని చాలా మీడియా కథనాన్ని ప్రచురించాయి. కానీ తరువాత.. ఆమె PR బృందం మహిళల్లో గర్భాశయ క్యాన్సర్‌పై అవగాహన కల్పించడం కోసం చేసిన ప్రచారమని తెలిపింది. ఈ స్టంట్ వల్ల సర్వైకల్ క్యాన్సర్‌పై సాధారణ ప్రజల్లో అవగాహన కల్పించారు, అయితే చనిపోయిందంటూ పూనమ్ గురించి జరిగిన ప్రచారం మాత్రం తీవ్రమైన విమర్శలకు కారణమైంది.
నటి నివేతా పేతురాజ్ అండ్ టీమ్ కూడా ప్రజల దృష్టిని ఆకర్షించడానికి ఓ వీడియోను విడుదల చేసింది. నివేతా పేతురాజ్ కారు నడుపుతూ, పోలీసు అధికారులతో మాట్లాడుతున్న వీడియో వైరల్ అయింది. ఆమె తన కారు బూట్ లో ఏదో దాచిపెట్టిందని.. అందుకే డిక్కీ తెరవమంటే పోలీసులతో గొడవకు దిగిందంటూ కొన్ని మీడియా సంస్థలు ఈ వీడియోను ప్రచారం చేశాయి. తెలుగు భాషలో ఆమె పోలీసులతో వాగ్వాదానికి దిగడం ఆ వీడియోలో మనం చూడవచ్చు. పోలీసు అధికారులు ఆమెను కారు ట్రంక్ తెరవమని అడిగినప్పుడు, ఆమె తెరవలేను.. అది పరువుకు సంబంధించినదని చెప్పడం వినవచ్చు. వీడియో చివర్లో, ఎవరో వీడియో రికార్డింగ్ చేస్తున్నారని చూసి భయపడి, వారిపై కోప్పడడం మనం గమనించవచ్చు.
“Actress #NivethaPethuraj argued and hesitated to open backside trunk of the car and scolded the recorded person... Her expressions made Policemen to doubt on herself... #Tollywood #NivethaPethuraj #Police” అంటూ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేశారు. నివేతా పేతురాజ్ ఎందుకు ఇలా చేసిందా అనే కుతూహలం ప్రజల్లో మొదలైంది.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదారి పట్టించేది. వైరల్ వీడియో తెలుగు వెబ్ సిరీస్ ‘పరువు’ ప్రచారంలో ఓ భాగం.
మేము వైరల్ వీడియో గురించి మరింత సమాచారం కోసం శోధించినప్పుడు.. ఇది ప్రమోషనల్ వీడియో కావచ్చని పేర్కొంటూ సోషల్ మీడియా వినియోగదారులు చేసిన కామెంట్లను మేము కనుగొన్నాము. వీడియో ప్రారంభంలో.. పోలీసు అధికారి బూట్లకు బదులుగా క్రాక్స్ ధరించడాన్ని మనం చూడవచ్చు. పోలీసు అధికారులు విధుల్లో ఉన్నప్పుడు షూస్ ను ధరిస్తారని చెబుతూ.. దీనిని పలువురు వినియోగదారులు ప్రశ్నించారు.
తదుపరి పరిశోధన తర్వాత మేము జీ తెలుగుకు సంబంధించిన ఒక పోస్ట్‌ను కనుగొన్నాము. #PARUVUonZee5 అంటూ పరువు అనే వెబ్ సిరీస్ ను తీసుకుని వస్తున్నట్లు జీ5 యాప్ తెలిపింది. Zee 5 రూపొందించిన వెబ్ సిరీస్‌కు ప్రమోషన్ వీడియో అని స్పష్టం చేసింది.
పరువు అనే తెలుగు వెబ్ సిరీస్ Zee 5 తెలుగు OTTలో ప్రసారం కానుంది. ఇది జూన్ 2024లో విడుదల కానుంది. హిందూస్తాన్ టైమ్స్ తెలుగు ప్రకారం, వైరల్ వీడియో ఈ వెబ్ సిరీస్‌కు ప్రమోషన్స్ లో భాగమని తేలింది. పరువు హత్యల నేపథ్యంలో ఈ సిరీస్ రూపొందుతోంది.
కాబట్టి, వైరల్ వీడియో Zee 5లో ప్రసారం కానున్న పరువు అనే వెబ్ సిరీస్‌కి ప్రమోషనల్ వీడియో. నటి నివేతా పేతురాజ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారనే వాదనలో ఎలాంటి నిజం లేదు. కారు బూట్ ను తెరవడానికి నివేతా పోలీసులతో వాదిస్తున్నారనే వాదనలో ఎలాంటి నిజం లేదు. వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదారి పట్టిస్తోంది.
ఈ వైరల్ వీడియో ఎవరికీ ఎలాంటి హాని చేయకున్నా.. ప్రేక్షకులలో ఉత్సుకతను పెంచుతోంది. అయితే ప్రమోషన్‌ల కోసం ఇటువంటి వ్యూహాలను ఉపయోగించడం ప్రేక్షకులను గందరగోళానికి గురిచేస్తుంది. తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తుంది. ఇది ముఖ్యంగా సోషల్ మీడియాలో ప్రమాదకరమైన ట్రెండ్ కు కారణమవుతుంది.
Claim : కారు బూట్ తెరవమని అడిగిన పోలీసులపై నటి నివేదా పేతురాజ్ ఆగ్రహం వ్యక్తం చేసిందని వైరల్ వీడియో చూపిస్తుంది
Claimed By : Social media users
Fact Check : Misleading