లక్షల విలువైన వజ్రపు ఉంగరం చోరీ.. పోలీసుల భయంతో డెంటల్ క్లినిక్ లో..
ఆసుపత్రిలో ఉంగరాన్ని మరిచిపోయిన విషయం గుర్తొచ్చిన ఆమె.. హడావిడిగా ఆసుపత్రికి వచ్చారు. అక్కడి సిబ్బంది ప్రశ్నించగా..
ఓ యువతి లక్షల రూపాయల విలువైన వజ్రపు ఉంగరాన్ని తన పర్సులో గుర్తించింది. ఆ తర్వాత పోలీసులు పట్టుకుంటారన్న భయంతో దానిని టాయిలెట్ కమోడ్ లో పడేసింది. ఈ ఘటన ఎక్కడో కాదు.. మన హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లోనే జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బంజారాహిల్స్‌కు చెందిన నరేంద్రకుమార్ కోడలు గత నెల 27న జూబ్లీహిల్స్‌లోని ఎఫ్ఎంఎస్ దంత, చర్మ వైద్యశాలకు వెళ్లారు. చికిత్స సమయంలో ఆమె తన చేతివేలికి ఉన్న రూ.50 లక్షల విలువైన వజ్రపు ఉంగరాన్ని తీసి పక్కన పెట్టారు. చికిత్స పూర్తయ్యాక దానిని తీసుకోవడం మరిచిపోయి ఇంటికి వెళ్లిపోయారు.
ఆసుపత్రిలో ఉంగరాన్ని మరిచిపోయిన విషయం గుర్తొచ్చిన ఆమె.. హడావిడిగా ఆసుపత్రికి వచ్చారు. అక్కడి సిబ్బంది ప్రశ్నించగా.. తమకు తెలియదని జవాబిచ్చారు. దాంతో నరేంద్రకుమార్ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆసుపత్రిలోని సీసీటీవీ కెమెరాలను పరిశీలించారు. అయినా ఫలితం లేదు. ఆసుపత్రిలో సిబ్బందిలో ఒకరైన లాలస అనే యువతిని ప్రశ్నించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. టిష్యూ పేపర్‌లో చుట్టిన ఉంగరాన్ని తన పర్సులో ఎవరో పెట్టారని, తాను భయంతో దానిని టాయిలెట్ కమోడ్‌లో విసిరేశానని తెలిపింది. దీంతో టాయిలెట్ కమోడ్, పైపులైన్లను తొలగించి గాలించగా ఉంగరం దొరికింది. కాగా.. ఉంగరాన్ని నిజంగానే ఎవరైనా లాలస పర్సులో పెట్టారా ? లేక దొంగ అనే ముద్ర పడుతుందని లాలస తప్పించుకునేందుకు అబద్ధం చెప్పిందా ? అని పోలీసులు ఆమెను విచారిస్తున్నారు.