903 కోట్ల రూపాయల స్కామ్ ను బయటపెట్టిన హైదరాబాద్ పోలీసులు

Update: 2022-10-13 01:34 GMT

హైదరాబాద్ పోలీసులు మరో స్కామ్ ను బయటపెట్టారు. హైద‌రాబాద్ కేంద్రంగా జ‌రిగిన రూ. 903 కోట్ల కుంభ‌కోణాన్ని హైద‌రాబాద్ పోలీసులు బయటపెట్టడం విశేషం. భారతదేశం, చైనా, తైవాన్, కంబోడియా, యుఏఈలలో 903 కోట్ల విలువైన కుంభకోణాన్ని.. చైనా చేస్తున్న మోసాన్ని హైదరాబాద్ పోలీసులు ఛేదించారు. ఒక చైనీస్, తైవాన్ జాతీయుడు సహా పది మందిని అరెస్టు చేశారు. ఈ కుంభ‌కోణం వివ‌రాల‌ను హైద‌రాబాద్ పోలీసు క‌మిష‌న‌ర్ సీవీ ఆనంద్ మీడియాకు వెల్ల‌డించారు. పెట్టుబడుల పేరుతో రూ. 903 కోట్లు మోసం చేసి, ఆ డబ్బును హవాల ద్వారా విదేశాలకు తరలిస్తున్న అంతర్జాతీయ ముఠాను హైదరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులు అరెస్టు చేసిన‌ట్లు తెలిపారు. అరెస్టు అయిన వారిలో ఒకరు తైవాన్‌, మరొకరు చైనీయుడు ఉండగా, మిగతా వారు భారతీయులని స్ప‌ష్టం చేశారు. చైనా దేశ‌స్థుడిని ఐబీ డిటెన్షన్‌ సెంటర్‌లో అదుపులోకి తీసుకున్నారు. కంబోడియా దేశం అడ్డాగా భారతీయులకు కమీషన్‌ ఆశ చూపి కొందరు చైనీయులు భారతదేశంలో రహస్యంగా తమ నెట్‌వర్క్‌ను నిర్వహిస్తున్నారు.

వాట్సాప్‌ ద్వారా మెసేజీలు పంపుతూ కొన్ని సంస్థల్లో పెట్టుబడి పెడితే.. భారీగా లాభాలు వస్తాయని లేదా వర్క్‌ ఫ్రం హోం ద్వారా గంటకు ఐదువేలు సంపాదించవచ్చని ఆశ చూపుతూ మోసాలు చేస్తూ వస్తున్నారు. లాగ్‌జామ్‌ వంటి కొన్ని యాప్స్‌ పంపి వాటి ద్వారా పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహిస్తారు. అలా వచ్చిన సొమ్మును స్థానికంగా ఉండే తమ ఏజెంట్ల సాయంతో బ్యాంక్‌ ఖాతాల ద్వారా విదేశాలకు తరలిస్తూ వచ్చారు. తాము అరెస్టు చేసిన వారిలో తైవాన్‌కు చెందిన చెచువాన్‌, చైనాకు చెందిన లెక్‌ అలియాస్‌ లి ఝువాంజు మరో ఎనిమిది ఉన్నారని తెలిపారు. వీరిని ముంబై, ఢిల్లీ, హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్నట్టు వివరించారు. చైనీయులు భారత్‌లో రహస్యంగా తమ నెట్‌వర్క్‌ను నిర్వహిస్తూ భారీ ఎత్తున మన దేశ సంపదను కొల్లగొడుతున్నారని తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న ఈ భారీ మోసాన్ని హైదరాబాద్‌ పోలీసులు ఛేదించారని ఆయన వెల్లడించారు.


Tags:    

Similar News