Gold Price Today : పసిడి దిగివస్తుందిగా.. ఇక ధరలు అందుబాటులోకి వస్తున్నట్లేనా?
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరల్లో స్వల్ప తగ్గుదల కనిపించింది;

బంగారం ధరలు ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉన్నాయి. బంగారం ధరలు ఒకరకంగా పసిడి ప్రియులను భయపెడుతున్నాయి. ఈ మధ్య కాలంలో పెరిగినంత స్థాయిలో గతంలో ఎన్నడూ ధరలు పెరుగుదల లేదని వ్యాపారులు కూడా చెబుతున్నారు. బంగారం, వెండి డిమాండ్ ఏ మాత్రం తగ్గకపోవడంతో పాటు వివిధ దేశాల నుంచి దిగుమతి కావాల్సిన బంగారం దిగుమతి కాకపోవడంతో దాని ప్రభావం ధరలపై పడుతుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రపంచంలో కల్లా ఎక్కువగా భారత్ లోనే బంగారం, వెండి దిగుమతులు అధికంగా ఉంటాయి. ఇక్కడ కొనుగోలు చేసే వారు అధికంగా ఉండటంతో పాటు భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు నెలవు కావడంతో ఇక్కడ గిరాకీ ఎప్పుడూ అధికంగానే ఉంటుంది.
సీజన్ లేకపోయినా...
బంగారం, వెండి వస్తువులకు ఒక సీజన్ అనేది ఉండదు. మామూలు సమయంలోనైనా బంగారాన్ని కొనుగోలు చేయడానికి అనేక మంది ముందుకు వస్తుంటారు. దీనికి కారణం బంగారంపై మదుపు చేస్తే తమ భవిష్యత్ కు భరోసా ఉంటుందని భావించడమే ఇందుకు కారణం. ప్రధానంగా కరోనాతో ప్రపంచమంతా అల్లాడి పోతున్న సమయంలో ఎంతో మందికి బంగారం, వెండి వస్తువులు ఆసరాగా నిలిచాయి. వాటిని కుదువ పెట్టుకుని ఉపాధి అవకాశాలు దెబ్బతిన్నా బతికి బట్టకలిగారంటే దానికి కారణం బంగారం మాత్రమే. దీనికి తోడు భారతీయ మహిళలు అత్యంత ఎక్కువగా ఇష్టపడేది బంగారం మాత్రమే కావడంతో నిత్యంకొనుగోళ్లు జరుగుతూనే ఉంటాయి.
తగ్గిన ధరలతో...
కానీ గత కొన్ని రోజులుగా అమ్మకాలు గణనీయంగా తగ్గాయి. దీనికి ధరల పెరుగుదల కారణమని చెప్పకతప్పదు. బంగారం ధరలను చూసి బెంబేలెత్తిపోయి కొనుగోలు చేయడానికి వెనకాడుతున్నారు. ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరల్లో స్వల్ప తగ్గుదల కనిపించింది. పది గ్రాముల బంగారం ధరపై మూడు వందల రూపాయలు తగ్గింది. కిలో వెండి ధరపై వంద రూపాయలు తగ్గింది. ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 81,840 రూపాయలుగా చేరుకుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 89,280 రూపాయలుగా నమోదయింది. కిలో వెండి ధర 1,09,900 ట్రెండ్ అవుతుంది.