Telangana : హైదరాబాద్ కు మరో వరం.. బీవైడీ త్వరలోనే ప్రారంభం

చైనా విద్యుత్తు కార్ల తయారీ కంపెనీ బీవైడీ హైదరాబాద్ లో విద్యుత్తు కార్ల యూనిట్ ను ఏర్పాటు చేసేందుకు సిద్ధమయింది;

Update: 2025-03-26 02:21 GMT
BYD, car manufacturer, china, hyderabad
  • whatsapp icon

ఆంధ్రప్రదేశ్ లో కియా కార్ల పరిశ్రమ ఉంటే అందుకు తగినట్లుగా తెలంగాణ ప్రభుత్వం బీవైడీ కార్ల పరిశ్రమను తేనుంది. తెలంగాణకు మరో ప్రతిష్టాత్మకైన కంపెనీ రాబోతుంది. దీంతో ఉపాధి అవకాశాలు పెద్దయెత్తున లభించనున్నాయి. చైనా విద్యుత్తు కార్ల తయారీ కంపెనీ బీవైడీ హైదరాబాద్ లో విద్యుత్తు కార్ల యూనిట్ ను ఏర్పాటు చేసేందుకు సిద్ధమయింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సంస్థను తీసుకు వచ్చేందుకు గత కొంతకాలంగా ఆ కంపెనీ ప్రతినిధులతో చర్చిస్తున్నారు. అయితే ప్రభుత్వం ఇచ్చే రాయితీలు, ఇక్కడ ఉన్న అనుకూల వాతావరణం, కార్ల అమ్మకాలు వంటివి పరిగణనలోకి తీసుకుని బీవైడీ కంపెనీ హైదరాబాద్ సమీపంలో కార్ల యూనిట్ ను స్థాపించేందుకు అంగీకరించినట్లు సమాచారం. ఈ మేరకు తన నిర్ణయాన్ని ప్రభుత్వానికి కూడా తెలియజేసినట్లు అధికారికవర్గాల నుంచి అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.

భూమితో పాటు రాయితీలు...
బీవైడీ సంస్థను ఏర్పాటు చేస్తే ఇక్కడ భూమిని ఇవ్వడంతో పాటుగా వివిధ రకాలు రాయితీలను ప్రభుత్వం ప్రకటించడంతో పాటు ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటకల్లో అమ్మకాలు జరిపేందుకు అనువైన ప్రదేశం కూడా కావడంతో ఆ కంపెనీ హైదరాబాద్ సమీపంలో కంపెనీ యూనిట్ ను స్థాపించేందుకు ముందుకు వచ్చిందని అధికారులు తెలిపారు. ఇందుకోసం ఇప్పటికే బీవైడీ సంస్థకు చెందిన ప్రతినిధులకు రాష్ట్ర ప్రభుత్వం మూడు స్థలాలకు చెందిన ప్రతిపాదనలను పంపింది. వీటిని పరిశీలించి తుది నిర్ణయం కంపెనీ తీసుకోనుంది. ఎక్కడ పెట్టాలన్నది నిర్ణయం జరిగిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వంతో కలసి బీవైడీ సంస్థ ఒప్పందం కుదుర్చుకోవడానికి సిద్ధమవుతున్నట్లు తెలసింది.
అగ్రగామి సంస్థ అయిన...
విద్యుత్తు కార్ల తయారీలో అతి పెద్ద సంస్థ గా పేరున్న బీవైడీకి దేశంలో ఎక్కడా యూనిట్లు లేకపోవడంతో చైనా నుంచి నేరుగా దిగుమతి చేసి భారత్ లో కార్లను విక్రయిస్తుంది. దీనివల్ల దిగుమతి సుంకం కూడా భారీగానే చెల్లించాల్సి రావడంతో ఆ ప్రభావం కారు ధరపై పడుతుంది. అందుకే నేరుగా ఇక్కడే తయారీ యూనిట్ ను పెట్టాలన్న బీవైడీ ఆలోచనలకు అనుగుణంగా, రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు కార్యరూపం దాల్చనున్నాయి. దీనివల్ల కార్ల ధర తగ్గి ఎక్కువ మంది కొనుగోలు చేసే అవకాశముందన్న అంచనాలు వినిపిస్తున్నాయి. సంస్థను ప్రారంభించిన ఏడేళ్లలో ప్రతి సంవత్సరం ఆరు లక్షల విద్యుత్తు కార్లను ఉత్పత్తి చేయాలన్న లక్ష్యంగా పెట్టుకునట్లు తెలిసింది. దీనివల్ల స్థానికంగా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు వేల సంఖ్యలో లభించే అవకాశాలున్నాయి.








Tags:    

Similar News