ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న తాజా నిర్ణయంతో హైదరాబాద్ లోని ఉత్తర ప్రాంతంలో ఉన్న భూముల ధరలు మరింత పెరగనున్నాయి. ఇప్పటికే ఆ ప్రాంతంలో ధరలు ఆకాశాన్నంటాయి. తాజాగా తీసుకున్న నిర్ణయంతో ధరలు మరింత పెరిగే అవకాశముందని తెలిసింది. మేడ్చల్, కొంపల్లి, శామీర్ పేట్ వరకూ భూముల ధరలకు ఇక రెక్కలు వస్తాయి. అందుకు ప్రధాన కారణం మెట్రో రైలు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడమే. ఇప్పటికే ఈ ప్రాంతం విస్తరించింది. దాదాపు మేడ్చల్ వరకూ రియల్ ఎస్టేట్ వ్యాపారులు వెంచర్లు వేశారు. అనేక చోట్ల ఈ ప్రాంతంలో వేసిన వెంచర్లు అలాగే ఉన్నాయి. అమ్ముడు పోవడం లేదు. సిటీకి రావాలంటే కష్టంగా మారడం వల్లనే ఈ ప్రాంతంలో కొనుగోలు చేయడానికి ఎక్కువ మంది ఆసక్తి చూపడం లేదు.
కొత్త ఏడాది నిర్ణయంతో...
కొత్త సంవత్సరం తొలి రోజు హైదరాబాద్ వాసులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. మెట్రో రైలును మేడ్చల్ వరకూ పొడిగించాలని నిర్ణయించారు.ప్యారడైజ్ నుంచి మేడ్చల్ వరకూ కారిడార్ ను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టును తయారు చేయాలని ఆదేశించారు. డీపీఆర్ ను వెంటనే కేంద్ర ప్రభుత్వానికి పంపి ఆమోదం పొందేందుకు ప్రయత్నిస్తామని రేవంత్ రెడ్డి చెబుతున్నారు. ప్యారడైజ్ నుంచి మేడ్చల్ వరకూ, షామీర్ పేట్ నుంచి జేబీఎస్ వరకూ వెంటనే రెండు కారిడార్లకు సంబంధించిన డీపీఆర్ లను సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించడంతో నార్త్ హైదరాబాద్ లో ఉంటున్న వారికి నిజంగా ఇది అమలయ్యేతే కొత్త సంవత్సరం వేళ శుభవార్తే అవుతుంది.
సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు...
ప్లాట్లు, ఫ్లాట్లు కొనుగోలు చేయాలంటే సాప్ట్ వేర్ ఇంజినీర్లు ముందుకు రావాలి. అయితే ఇక్కడ నివాసం ఉండి మాదాపూర్, గచ్చిబౌలికి రావాలంటే గంటల తరబడి ప్రయాణం తప్పదు. రోడ్డు మార్గంలో రావాలంటే ట్రాఫిక్ చిక్కుల్లో పడక తప్పదు. అంత దూరంలో ఉండి గంటల తరబడి ఇళ్లకు చేరుకోవడం సాధ్యం కానిపని. కార్యాలయాలన్నీ ఇటు వైపు ఉండగా నగర శివార్లలో ఉత్తరం వైపు ఉన్న ఆ ప్రాంతం వైపు ఉన్న ఫ్లాట్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి కనపర్చడం లేదు. అయినా ఇప్పటికే కొంపల్లి నుంచి హైవే ఉన్నందున కొంత మేర అక్కడ అభివృద్ధి ప్రారంభమయింది. చాలా డెవలెప్ అయింది. అనేక నిర్మాణాలు వెలిశాయి. కార్పొరేట్ సంస్థలు కూడా అక్కడ ఏర్పాటయ్యాయి. ఇక మెట్రో రైలు కూడా ఏర్పాటయితే ఇక అక్కడ భూముల ధరలు కొనలేని పరిస్థితి ఉంటుంది.
సుదీర్ఘ డిమాండ్ అయినా...
ఎప్పటి నుంచో మేడ్చల్ వైపు కనీసం కొంపల్లి వరకూ అయినా మెట్రో రైలును విస్తరించాలని ఆ ప్రాంత వాసులు డిమాండ్ చేస్తూనే ఉన్నారు. గత ప్రభుత్వం ఇటువైపు చూపిన శ్రద్ధ అటు వైపు పెట్టలేదన్న ఆగ్రహంతో ఉన్నారు. అయినా గత ఎన్నికల్లో మేడ్చల్ ఇతర ప్రాంతాల్లో తిరిగి బీఆర్ఎస్ పార్టీనే గెలిపించారు. అయితే రేవంత్ రెడ్డి కొత్త ఏడాది తీసుకున్న నిర్ణయంతో తమ ట్రాఫిక్ కష్టాలు తీరతాయని భావిస్తున్నారు. ప్రధానంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు కూడా ఖుషీ కబురు అందినట్లే ఫీలవుతున్నారు. మెట్రో రైలు ఏర్పాటయితే నగరం నడిబొడ్డుకు రాకపోకలు సాగించేందుకు సులువవుతుందని ఇక అమ్మకాలు ఊపందుకున్నాయన్న అంచనాలు వినిపిస్తున్నాయి.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now