కోట్లు పలికిన భూములపై సీఎం కేసీఆర్ ఏమన్నారంటే
కోకాపేటలో భూములు 100 కోట్లకు పైగా పలకడం తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది
కోకాపేటలో భూములు 100 కోట్లకు పైగా పలకడం తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయంలో కూడా సీఎం కేసీఆర్ కొందరి టార్గెట్ చేసి వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ విడిపోతే.. హైదరాబాద్ లో భూములకు విలువ లేకుండా పోతుందని చాలా మంది అన్నారు. ఆ వ్యాఖ్యలపై సీఎం కేసీఆర్ ఇప్పుడు కౌంటర్ వేశారు. ప్రభుత్వ వేలంలో హైదరాబాద్ భూములు ఎకరాకు రూ. 100 కోట్లకు పైగా ధర పలకడం తెలంగాణ పరపతికి, సాధిస్తున్న ప్రగతికి దర్పణం పడుతున్నదని సీఎం అన్నారు. తెలంగాణ వస్తే హైదరాబాద్ ఆగం అవుతుందని, భూముల రేట్లు పడిపోతాయని భయభ్రాంతులకు గురి చేశారని అన్నారు. హైదరాబాద్ ఆత్మ గౌరవాన్ని కించపరిచిన వారి చెంప చెళ్లుమనిపించేలా.. ఈ భూముల ధరలు పలికాయని అన్నారు.
ప్రపంచస్థాయి దిగ్గజ కంపెనీలు పోటీ పడి మరీ ఇంత ధర చెల్లించి తెలంగాణ భూములు కొనడాన్ని ఆర్థిక కోణంలో మాత్రమే కాకుండా తెలంగాణ సాధించిన ప్రగతి కోణంలో కూడా విశ్లేషించాలన్నారు. ఇంతింతై వటుడింతై అన్నట్లుగా హైదరాబాద్ నగర అభివృద్ధి సూచిక అందనంత ఎత్తుకు దూసుకుపోతున్న వర్తమాన పరిస్థితికి అద్దం పడుతున్నదని సీఎం తెలిపారు. ఎవరెంత నష్టం చేయాలని చూసినా ధృఢ చిత్తంతో పల్లెలను, పట్టణాలను ప్రగతి పథంలో నడిపిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ పట్టుదలకు, హైదరాబాద్ వంటి మహానగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన కృషికి దక్కిన ఫలితమని కేసీఆర్ అన్నారు.
హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో గురువారం జరిగిన భూముల ఈ-వేలం ద్వారా జరిగిన విక్రయంలో దేశ వ్యాప్తంగా పలు దిగ్గజ కంపెనీలు పాల్గొన్నాయి. రంగారెడ్డి జిల్లా, గండిపేట మండలం, కోకాపేట లోని నియో పోలీస్ ఫేస్ టు లో జరిగిన వేలంపాటలో అత్యధికంగా ఎకరానికి రూ. 100.75 కోట్లను చెల్లించి ప్లాట్లను స్వంతం చేసుకున్నారు. ప్రభుత్వానికి మొత్తంగా రూ. 3319 కోట్ల ఆదాయం వచ్చింది. కోకాపేటలో గత ఏడాది జూలై 15న హెచ్‌ఎండీఏ 49.94ఎకరాలు విక్రయిస్తే రూ.2వేల కోట్ల ఆదాయం వచ్చింది. ఈ సారి కేవలం 45 ఎకరాలకే రూ.3319 కోట్ల ఆదాయం వచ్చింది. అప్పట్లో అత్యధికంగా ఎకరం ధర రూ.60.20 కోట్లు, అత్యల్పంగా రూ.31.20 కోట్లు పలికింది.