హైదరాబాద్లో భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్లపై వరద నీరు చేరింది. పలు కాలనీలు వరదనీటితో నిండిపోయాయి. దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వరద నీటిలో బైక్, ఆటోలు కొట్టుకుపోతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంకొద్ది రోజుల పాటూ తెలంగాణ లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతవరణ శాఖ వెల్లడించింది. మెదక్ ,కామారెడ్డి, సిద్దిపేట్, సంగారెడ్డి, రంగారెడ్డి, హైదరాబాద్ ,మేడ్చల్, వికారాబాద్ ,నాగర్ కర్నూల్, మహబూబ్నగర్, కామారెడ్డి, సిరిసిల్ల, గద్వాల్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
బుధవారం సాయంత్రం నుండి దంచేసిన వాన:
రోడ్లపైకి వరదనీరు చేరుకోవడంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరడంతో ప్రజలు అవస్థలు పడ్డారు. తమ నివాసాలను విడిచి ఇతర ప్రాంతాలకు తరలివెళుతున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అవసరమైతే తప్ప బయటికి రాకూడదని జీహెచ్ఎంసీ అధికారులు సూచిస్తున్నారు. ఖైరతాబాద్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అమీర్‌పేట, పంజాగుట్ట, బేగంపేట్, యూసుఫ్‌గూడ, షేక్‌పేట్, గచ్చిబౌలి, హైటెక్ సిటీ, ఆర్సీపురం, రాజేంద్రనగర్, బండ్లగూడ, గొల్కొండ, నార్సింగి, పుప్పాలగూడ, మైలార్ దేవులపల్లి, మణికొండ, గండిపేట, షాద్‌నగర్, తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. హైదరాబాద్ నగరంలోని దాదాపు అన్ని ప్రాంతాల్లో బుధవారం రాత్రి కుండపోత వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు, రహదారులపైకి వరదనీరు భారీగా చేరుకుంది.