మంచు మనోజ్ సామగ్రి తరలింపుకు అంతా సిద్ధం
సినీనటుడు మోహన్ బాబు ఇంటి వద్ద ఇంకా డ్రామా కొనసాగుతుంది.మనోజ్ సామగ్రిని తరలించేందుకు సిబ్బంది సిద్ధమయ్యారు
సినీనటుడు మోహన్ బాబు ఇంటి వద్ద ఇంకా డ్రామా కొనసాగుతుంది. మంచు విష్ణు రావడంతో ఈరోజు మనోజ్ కు చెందిన బౌన్సర్లను జల్పల్లిలోని మోహన్ బాబు ఇంటి నుంచి పంపించివేశారు. దీంతో పాటు ఆ ఇంటిలో ఉన్న మనోజ్ సామగ్రిని తరలించేందుకు సిబ్బంది సిద్ధమయ్యారు. పోలీసుల రక్షణలో సామాగ్రిని తరలించేందుకు ప్రయత్నాలు ప్రారంభిస్తున్నారు.
మూడు వాహనాలను...
ఇప్పటికే మంచు మనోజ్ సామగ్రిని తరలించేందుకు మూడు వాహనాలను సిద్ధం చేశారు. తన ఇల్లు కావడంతో మంచు మనోజ్ ఇక్కడకు వచ్చే అవకాశం లేదని మోహన్ బాబు చెబుతున్నారు. మోహన్ బాబు ఇంట్లో రెండు రోజుల నుంచి జరుగుతున్న పరిణామాలతో రెండు వర్గాలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు దగ్గరుండి ఈ వివాదానికి తెర దించాలని ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.