Hyderabad : ఇద్దరూ ఎదురుపడ్డారు... టెన్షన్ క్రియేట్ అయిందిగా
ఎన్నికల సమయంలో హైదరాబాద్ నగరంలో ఎంఐఎం ఎంపీ అభ్యర్థి అసదుద్దీన్ ఓవైసీ, బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత ఎదురుపడ్డారు.
పార్లమెంట్ ఎన్నికల సమయంలో హైదరాబాద్ నగరంలో ఎంఐఎం ఎంపీ అభ్యర్థి అసదుద్దీన్ ఓవైసీ, బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత ఎదురుపడ్డారు. ఈ ఘటన మీర్‌పేట్‌లో జరిగింది. దీంతో ఉద్రిక్తత నెలకొంది. ఇరు పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున నినాదాలు చేయడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. కార్యకర్తలు ఇరువురు వాహనాలను కదలనివ్వకుండా చుట్టుముట్టారు. విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు.
మాధవీలతపై కేసు...
భారీ బందోబస్తు మధ్య ఇద్దరు అభ్యర్థుల వాహనాలను అక్కడ నుంచి పంపించివేశారు. మరోవైపు పోలింగ్ సమయంలో మాధవీలత వ్యవహారశైలి విమర్శలకు తెర తీసింది. ఓ పోలింగ్ కేంద్రంలో మాధవీలత ఓటు వేయడానికి వచ్చిన ముస్లిం మహిళలతో వివాదాస్పదంగా వ్యవహరించారన్న ఆరోపణలు వినిపించాయి. పోలింగ్ కేంద్రంలో బురఖా ధరించి కనిపించిన ముస్లిం మహిళల ఓటరు కార్డులను ఆమె తనిఖీ చేశారు. ఆ సమయంలో వారి బురఖాను తొలగించాలని అనడంతో దీనిపై ఈసీ దర్యాప్తునకు ఆదేశించింది. మాధవీలతపై కేసు నమోదు చేశారు