Hyderabad : తూలారో.. లోపలికి తోసేస్తారు అంతే.. పోలీసుల వార్నింగ్
న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా పోలీసులు హైదరాబాద్ నగరంలో అనేక ఆంక్షలు విధించారు
న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా పోలీసులు హైదరాబాద్‌లో అనేక ఆంక్షలు విధించారు. పోలీసులు ప్రతి చోటా నిఘా ఉంచేలా చర్యలు తీసుకున్నారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యగా అన్ని విధాలుగా ముందస్తు ఆంక్షలను విధించారు. ఎవరైనా పరిమితికి మద్యం తాగి బయటకు వస్తే లోపల వేయడానికి సిద్ధమవుతున్నారు. తాగి వాహనాలను నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు పోలీసు ఉన్నతాధికారులు ఇప్పటికే ప్రకటించారు. ఎవరూ న్యూ ఇయర్ వేడుకల పేరుతో ప్రమాదాలకు కారణం కాకూడదని చెబుతున్నారు.
అన్ని ఫ్లై ఓవర్లను...
దీంతో పాటు ఈరోజు నగరంలోని అన్ని ఫ్లై ఓవర్లను మూసివేస్తున్నారు. ఫ్లైఓవర్ పైకి ఎవరినీ అనుమతించబోమని పోలీసులు తెలిపారు. హైదరాబాద్‌లోని ఫ్లై ఓవర్లన్నింటినీ మూసివేస్తున్నట్లు ప్రకటించారు. పబ్‌లు, బార్‌ల వద్ద గట్టి నిఘాను ఉంచారు. రాత్రంతా డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తామని హెచ్చరికలు జారీ చేశారు. రేపు కూడా సెలవు దినం కావడంతో ఎక్కువ మంది పబ్‌లు, బార్లలో అధిక సమయం గడపకుండా నిర్ణీత సమయానికి మూసివేయని పబ్‌లు, బార్లపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.
అవుటర్ రింగ్ రోడ్డుపై...
అవుటర్ రింగ్ రోడ్డుపై కూడా పోలీసులు ఆంక్షలు విధించారు ఈరోజు రాత్రి పది గంటల నుంచి రేపు ఉదయం ఐదు గంటల వరకూ అవుటర్ రింగ్ రోడ్డుపై ఆంక్షలు ఉండనున్నాయి. అవుటర్ రింగ్ రోడ్డుపైకి కార్లను అనుమతించమని పోలీసులు స్పష్టం చేశారు. కేవలం విమానం టిక్కెట్ ఉంటేనే అవుటర్ రింగ్ రోడ్డు మీదకు అనుమతించనున్నారు. భారీ వాహనాలను మాత్రం అవుటర్ రింగ్ రోడ్డుపై అనుమతిస్తారు. అందుకోసమే నగర పౌరులు న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా తమ ఇళ్లలోనే పార్టీలు చేసుకుంటే మంచిదని సూచిస్తున్నారు.