రేపే నిమజ్జనం
గణేశ్ నిమజ్జన వేడుకలకు అంతా సిద్ధమయింది. రేపు హైదరాబాద్ నగరంలో గణేశ్ నిమజ్జనం జరగనుంది.
గణేశ్ నిమజ్జన వేడుకలకు అంతా సిద్ధమయింది. రేపు హైదరాబాద్ నగరంలో గణేశ్ నిమజ్జనం జరగనుంది. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. గణేశ్ శోభాయాత్రకు అవసరమైన ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. వేల సంఖ్యలో గణనాధులు రేపు హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం కానున్నాయి. రేపు హైదరాబాద్ లో ప్రభుత్వ కార్యాలయాలకు, ప్రయివేటు సంస్థలకు సెలవు దినంగా ప్రకటించింది. ఉదయం ఏడు గంటల నుంచి శోభాయాత్ర ప్రారంభం కానుంది. పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు.
అడగడుగునా నిఘా...
తొలుత బాలాపూర్ గణనాధుడు వద్ద లడ్డూకు వేలం పాటను నిర్వహిస్తారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి దాదాపు పంధొమ్మిది కిలోమీటర్ల మేర శోభాయాత్ర సాగనుంది. ముఖ్యంగా పాతబస్తీలో గణనాధులు ప్రవేశించే సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు అన్ని ఏర్పాట్లు చేశారు. అడుగడుగునా నిఘాను ఏర్పాటు చేశారు. ఏమాత్రం అనుమానం వచ్చినా ముందస్తు అరెస్ట్ లు చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. దారి పొడువునా భక్తుల కోసం గణేశ్ ఉత్సవ సమితి ఆహారం, మంచినీటి సదుపాయాలను కల్పించింది.
మధ్యాహ్నం పన్నెండు కల్లా...
రేపు మధ్యాహ్నం పన్నెండు గంటలకల్లా ఖైరతాబాద్ గణేశ్ నిమజ్జనం పూర్తయ్యేలా చూడాలని అధికారులు నిర్వాహకులను కోరారు. వీలయినంత త్వరగా ముగిస్తే ట్రాఫిక్ అంతరాయం ఏర్పడకుండా ఉంటుందని తెలిపారు. నిమజ్జనం కోసం నలభై వేల మంది పోలీసులతో భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో నగరాన్ని పకడ్బందీగా కాపలా కాస్తున్నారు. ఈరోజు అర్ధరాత్రి నుంచే ఖైరతాబాద్ గణేశ్ ను నిమజ్జనానికి తరలించే ఏర్పాట్లు చేస్తారు. ట్యాంక్ బండ్ వద్ద ఇప్పటికే భారీ క్రేన్లను ఏర్పాటు చేశారు. క్రేన్ నెంబరు 4వ వద్ద ఖైరతాబాద్ గణేశ్ నిమజ్జనం చేయడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రేపు నగరమంతా శోభాయమానంగా, గణపతి బప్ప మోరియా అంటూ నినాదాలతో మారుమోగనుంది.