Hyderabad : ప్లీజ్.. వీలయినంత వరకూ బయటకు రాకండి... పురాతన భవనాల్లో ఉండొద్దంటూ హెచ్చరిక
హైదరాబాద్ లో భారీ వర్షం నగరాన్ని వణికించింది దాదాపు గంట సేపు కురిసిన వర్షంతో అన్ని ప్రాంతాల్లో నీరు చేరింది.
హైదరాబాద్ లో భారీ వర్షం నగరాన్ని వణికించింది దాదాపు గంట సేపు కురిసిన వర్షంతో అన్ని ప్రాంతాల్లో నీరు చేరింది. అనేక చోట్ల ట్రాఫిక్ సమస్యలు ఏర్పడ్డాయి. వాతావరణ శాఖ ఈ నెల 23వ తేదీ వరకూ తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ లోనూ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రజలు నిత్యం అప్రమత్తంగా ఉండాలని కోరింది. వీలయినంత వరకూ బయటకు రాకుండా ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులు హెచ్చరించారు. శని, ఆదివారాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశముండటంతో వీలయినంత వరకూ వీకెండ్ లో ఇంట్లోనే గడపాలని అధికారులు సూచిస్తున్నారు.
పురాతన భవనాల్లో...
హైదరాబాద్ లోని పురాతన భవనాల పట్ల అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే గతంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ అధికారులు నగరంలో అనేక పురాతన భవనాలను పరిశీలించారు. వాటి లెక్క తేల్చారు. వాటిని కూల్చివేసి నూతనంగా నిర్మాణాలు చేపట్టాలని కూడా అప్పట్లో అధికారులు ఆదేశాలు జారీ చేసినా ఇంకా అనేక చోట్ల పురాతన భవనాల్లోనే అనేక మంది నివసిస్తున్నారు. భారీ వర్షాలకు పురాతన భవనాలు కూలిపోయే అవకాశముందని చెబుతున్నారు. అందుకే వాటిని ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళితే మంచిదని సూచిస్తున్నారు. గోడలు తడిసి కూలిపోయేందుకు ఛాన్స్ ఉందని అంటున్నారు.
మే 23 వరకూ...
ఇప్పుడు కురిసే వర్షాలతో పాటు ఈ నెల 22వ తేదీ నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే సూచనలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడనం మరింత బలపడి మే 24వ తేదీ నాటికి వాయుగుండంగా మారే అవకాశాలున్నాయని కూడా చెప్పింది. తమిళనాడులోని ఉత్తర ప్రాంతాల వరకూ ఉపరిత ఆవర్తనం విస్తరించిాందని, ఈ నెల 23 వ తేదీ వరకూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈదురుగాలులు గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో వీయవచ్చని తెలిపింది. దీంతో పాటు పిడుగులు పడే అవకాశముందని కూడా చెప్పింది. సో.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరుతున్నారు.