హైదరాబాద్ లో భారీ వర్షం.. మూడురోజులు ఎల్లో అలర్ట్
ఆదిలాబాద్, కొమురంభీమ్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు సహా పలు జిల్లాల్లో ఉరుములు..
తెలంగాణలో ప్రస్తుతం వాతావరణం కాస్త చల్లబడింది. కొద్దిరోజులుగా అధిక ఉష్ణోగ్రతలకు అల్లాడిన ప్రజలకు ఉపశమనం లభించింది. రాష్ట్రంలో మరో మూడురోజులపాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణశాఖ తెలిపింది. ఉపరితల ద్రోణి ప్రభావంతో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఆదిలాబాద్, కొమురంభీమ్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు సహా పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. శేరిలింగంపల్లి, చందానగర్, మాదాపూర్ గచ్చిబౌలిలో 4 సెంటి మీటర్ల వర్షపాతం నమోదు అయింది. అమీర్ పేట, పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్, సైదాబాద్, మాదన్నపేట, బహదూర్ పురా, చంద్రాయణగుట్ట, సంతోష్ నగర్, శాలిబండతోపాటు పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది.
నిన్న రాత్రి నుండి ఉదయం 7 గంటల వరకూ హైదరాబాద్ లో ఎడతెరపి లేని వర్షం కురిసింది. రహదారులపై భారీగా వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. లోతట్టు ప్రాంతాలు జలమయమవ్వగా.. వర్షానికి డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. నగరంలోని పలు చోట్ల చెట్లు నేలకొరిగాయి. పలు ప్రాంతాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. హైదరాబాద్ లోని ఓల్డ్ సిటీ చార్మినార్ జోన్, శేరిలింగంపల్లి జోన్ పరిధిలో అధిక వర్షపాతం నమోదైంది. రాజేంద్రనగర్ సర్కిల్ తో పాటు పలు ప్రాంతాల్లో 4-5 సెంటీమీటర్లు, అంబర్ పేట, శేరిలింగంపల్లి, చందానగర్, మాదాపూర్, గచ్చిబౌలిలో 4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.