భారీగా టెన్షన్ పెడుతున్న మూసీ నది

భారీగా టెన్షన్ పెడుతున్న మూసీ నది.. మూసీ ప్రాజెక్టుకు వరద ప్రవాహం పెరుగుతూ ఉండడంతో ముందస్తుగా ఎనిమిది గేట్లు నాలుగు అడుగుల

Update: 2022-07-27 07:32 GMT

మూసీ నది హైదరాబాద్ ప్రజలను టెన్షన్ పెడుతూ ఉంది. భారీ వర్షాల కారణంగా వరదలు పోటెత్తుతూ ఉండడంతో మూసీ నది ఉగ్రరూపం దాల్చింది. జంటజలాశయాలతోపాటు గండిపేట చెరువు గేట్లు ఎత్తివేయడంతో నదిలో ఒక్కసారిగా వరద ఉధృతి పెరిగింది. దీంతో మూసారాంబాగ్‌ వంతెనపై నుంచి నీరు ప్రవహిస్తోంది. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు బ్రిడ్జిపై వాహనాల రాకపోకలను నిలిపివేశారు. వంతెనకు రెండు వైపుల బారికేడ్లు ఏర్పాటు చేశారు. అంబర్‌పేట-మలక్‌పేట మధ్య వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. మూసీ ఉగ్రరూపం దాల్చడంతో మూసానగర్‌, కమలానగర్‌ను వరద చుట్టిముట్టింది. మూసారాంబాగ్‌ లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు ఖాళీచేయించారు. రత్నానగర్‌, పటేల్‌నగర్ గోల్నాకలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు బాధితులను తరలించారు. వరదల కారణంగా చాదర్‌ఘాట్‌ బ్రిడ్జిని అధికారులు మూసివేశారు. ప్రభావిత ప్రాంతాల్లో ముందు జాగ్రత్తగా విద్యుత్‌ సరఫరాను నిలిపివేశారు.

రంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలకు గండిపేట, ఉస్మాన్‌ సాగర్‌, హిమాయత్‌ సాగర్‌ గేట్లను అధికారులు ఎత్తివేశారు. దీంతో మూసీ నదిలోకి వరద పోటెత్తింది. నేడు వరద మరింత పెరిగే అవకాశం ఉండటంతో మూసీ పరీవాహక ప్రాంతాల్లో అధికారులు హై అలర్ట్‌ ప్రకటించారు.
మూసీ ప్రాజెక్టుకు వరద ప్రవాహం పెరుగుతూ ఉండడంతో ముందస్తుగా ఎనిమిది గేట్లు నాలుగు అడుగుల మేర ఎత్తి దిగువకు నీటి విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 5733.36 క్యూసెక్కుల వరద వస్తుండగా.. 17,809.25 క్యూసెక్కుల నీరు బయటకు పంపుతూ ఉన్నారు. మూసీ పూర్తిస్థాయిస్థాయి నీటి సామర్థ్యం 645 అడుగులుగా ఉండగా, ప్రస్తుతం 637.50 అడుగులుగా ఉంది. ప్రాజెక్టు గరిష్ట నీటి నిల్వ 4.46 టీఎంసీలు. ఇప్పుడు 2.67 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
ఎగువ నుంచి భారీగా వరద పోటెత్తడంతో ఉస్మాన్‌సాగర్‌ జలాశయంలోకి 8 వేల క్యూసెక్కుల నీరు వచ్చిచేరుతోంది. దీంతో అధికారులు 13 గేట్లు 6 అడుగుల మేర ఎత్తి 8,281 క్యూసెక్కులు మూసీలోకి విడుదల చేశారు. ఉస్మాన్‌సాగర్‌లో ప్రస్తుతం 1,789.10 అడుగుల నీటిమట్టం ఉన్నది. పూర్తిస్థాయి నీటిమట్టం 1,790 అడుగులు. హిమాయత్‌సాగర్‌కు 10 వేల క్యూసెక్కులు వస్తుండగా, 8 గేట్లు ఎత్తి 10,700 క్యూసెక్కుల నీటిని మూసీకి విడుదల చేస్తున్నారు. హిమాయత్‌సాగర్‌ ప్రస్తుత నీటిమట్టం 1762.70 అడుగులు. గరిష్ఠ నీటిమట్టం 1763.50 అడుగులు.


Tags:    

Similar News