Hyderabad : హైదరాబాద్ లో గాలివాన బీభత్సం.. నేలకొరిగిన చెట్లు

హైదరాబాద్ లో భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులు బలంగా వీచాయి. దీంతో నగరం కాసేపు వణికిపోయింది

Update: 2024-05-26 13:04 GMT

హైదరాబాద్ లో భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులు బలంగా వీచాయి. దీంతో నగరం కాసేపు వణికిపోయింది. అనేక చోట్ల విద్యుత్తు స్థంభాలు విరిగి పడ్డాయి. చెట్లు నేలకొరిగాయి. దీంతో అనేక చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. భారీ చెట్లు నేలకొరగడంతో అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. వనస్థలిపురం, ఎల్బీ నగర్, సరూర్ నగర్ ప్రాంతాలలో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. చెట్లు కార్లు, వాహనాలపై పడటంతో అవి ధ్వంసమయ్యాయి. వనస్థలిపురం ఎన్జీవోస్ కాలనీ ప్రధాన రహదారిపై ఉన్న చెట్లు గాలివానకు పడిపోయాయి. అయితే ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. దాదాపు అరగంట సేపు గాలి వాన బీభత్సం సృష్టించింది.

విద్యుత్తు సరఫరాకు...
హయత్‌నగర్, పెద్ద అంబర్‌పేట్ ప్రాంతాల్లోనూ వానగాలి బీభత్సం సృష్టించింది. అనేక చోట్ల గుడిసెల పైకప్పులు ఎగిరిపోయాయి. కొన్ని చోట్ల పిడుగులు పడినట్లు కూడా వార్తలు అందుతున్నాయి. విద్యుత్తు లైన్లతో పాటు నెట్, కేబుల్ వైర్లు కూడా రహదారులపై తెగిపడ్డాయి. దీంతో అనేక చోట్ల నెట్ రాక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గాలివాన ఒక్కసారిగా రావడంతో రోడ్డు మీద ఉన్న వారు భయపడి భవనాల కింద తలదాచుకున్నారు. జీహెచ్ఎంసీ సిబ్బంది పడిపోయిన చెట్లను తొలగించే పనిని చేపట్టారు. విద్యుత్తును కూడా కొన్ని చోట్ల పునరుద్ధరించే కార్యక్రమం చేపట్టారు. ఇంత పెద్ద స్థాయిలో ఈదురుగాలులు వీయడంతో ఇళ్లలో ఉన్న ప్రజలు కూడా భయపడిపోయారు.


Tags:    

Similar News