Hyderabad : మాస్క్ లకు మళ్లీ పెరిగిన డిమాండ్.. శానిటైజర్ల కొనుగోళ్లు కూడా
హెచ్ఎంపీవీ వైరస్ తెలంగాణలోనూ కలకలం రేపుతుంది మాస్క్ ల కొనుగో్ళ్లు పెరిగాయి;
హెచ్ఎంపీవీ వైరస్ తెలంగాణలోనూ కలకలం రేపుతుంది. ఇప్పటికే భారత్ లో ఏడు కేసులు నమోదు కావడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమయింది. పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటకల్లోనూ కేసులు వెలుగు చూడటంతో తెలంగాణలో ఈ కేసుల సంఖ్య వెలుగు చూసే అవకాశముందన్న ఆందోళన వ్యక్తమవుతుంది. అయితే హెచ్ఎంపీవీ వైరస్ విషయంలో భయాందోళనలు చెందాల్సిన పనిలేదని, సాధారణ వైరస్ మాత్రమేనని వైద్యులు చెబుతున్నప్పటికీ ప్రజల్లో మాత్రం ఆందోళన ఎక్కువగా ఉంది. కరోనా సమయంలో తాము పడిన ఇబ్బందులను గుర్తించి ప్రజలు కూడా తమకు తాము జాగ్రత్తలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. వైరస్ సోకకుండా ముందు జాగ్రత్త చర్యలు పాటిస్తున్నారు.
భయం అవసరంలేదని...
ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమయి మార్గదర్శకాలను విడుదల చేసింది. బయట నుంచి వచ్చిన తర్వాత శుభ్రంగా చేతులు కడుక్కోవాలని, ఎవరికీ షేక్ హ్యాండ్ ఇవ్వవద్దని, భౌతిక దూరం పాటిస్తే మంచిదని సూచించారు. జలుబు, దగ్గు, జ్వరం, దుద్దుర్లు ఉంటే నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను వెంటనే సంప్రదించాలని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ కోరింది. అయితే ఎవరూ భయాందోళనలకు గురి కావాల్సిన అవసరం లేదని, ఇది మామూలు వైరస్ మాత్రమేనని, గతంలోనే ఈ వైరస్ ను కనుగొన్నారని, ఫ్లూకు సంబంధించి వాడే మందులను మాత్రమే వాడితే సరిపోతుందని చెబుతున్నప్పటికీ ప్రజల్లో మాత్రం భయాందోళనలు తగ్గడం లేదు.
రెండు రోజుల నుంచి...
ఇప్పటికే మాస్క్ లు అధిక సంఖ్యలో కొనుగోలు చేస్తున్నారు. గత నాలుగేళ్ల నుంచి మాస్క్ ల వాడకం తగ్గింది. అయితే తాజాగా హెచ్ఎంపీవీ వైరస్ తో మళ్లీ మాస్క్ లను కొనుగోలు చేయడానికి మందుల దుకాణాలకు ప్రజలు క్యూ కడుతున్నారు. నిన్న మొన్నటి వరకూ మాస్క్ లు అడిగే వారు లేరని, కానీ రెండు రోజుల నుంచి మాస్క్ లకొనుగోళ్లు పెరిగాయని మందుల షాపుల నిర్వాహకులు చెబుతున్నారు. అదే సమయంలో శానిటైజర్ వాడకం కూడా ఎక్కువగా పెరిగింది. వివిధ రకాల శానిటైజర్లను మందుల దుకాణాలు ఇప్పటికే అందుబాటులోకి తెచ్చాయి. వాటిని కూడా హైదరాబాద్ నగరంలో ఎక్కువ మంది కొనుగోలు చేస్తున్నట్లు మందుల దుకాణాల యాజమాన్యం చెబుతుంది.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now