Weather Report : మరో నాలుగు రోజులు కుండపోతేనట.. అవసరమైతే తప్ప బయటకు రాకండి
తెలంగాణలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది
తెలంగాణలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. నిన్నటి నుంచే తెలంగాణలో వర్షాలు ప్రారంభమయ్యాయి. అనేక జిల్లాల్లో వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. నిన్న హైదరాబాద్ లో 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది. రహదారులన్నీ జలమయమయ్యాయి. ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి. నాలాలు పొంగాయి. ఆఫీసుకు వెళ్లిన వాళ్లు కొన్ని గంటల తర్వాత కానీ ఇళ్లకు చేరుకోలేదంటే వర్షం ఏ స్థాయిలో పడిందో చెప్పకనే చెప్పొచ్చు. గంటన్నర సేపు హైదరాబాద్ లో పడిన వర్షం బీభత్సమే సృష్టించింది. పలు చోట్ల చెట్లు విరిగిపడ్డాయి. అనేక ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
పిడుగులు పడే...
భారీ వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశముందని కూడా తెలిపింది. ఈదురుగాలుల తీవ్రత కూడా ఎక్కువగా ఉంటుందని చెప్పింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ చేసిన హెచ్చరికతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిన్న కురిసిన వానకు పంటలు తీవ్రంగా నష్టపోయారు. అకాల వర్షాలు తమకు తీవ్రమైన నష్టాన్ని చేకూర్చిపెట్టాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్ధిపేట, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబనగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో ఈరోజు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది.
పోలీసుల వార్నింగ్...
వర్షాలు కురుస్తాయన్న హెచ్చరికలో జీహెచ్ఎంసీ అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. మ్యాన్ హోల్స్ వద్ద బోర్డులు ఉంచాలని నిర్ణయించారు. అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని కూడా నిన్న హెచ్చరికలు జారీ చేసిన సంగతి తెలిసిందే. కుండపోత వర్షం కురిసిన తర్వాత గంట సేపు రోడ్లపైకి రావద్దని కూడా పోలీసులు సూచిస్తున్నారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు సాఫ్ట్్్ వేర్ కంపెనీలు విడతల వారీగా విధుల నుంచి వస్తే మంచిదన్న సూచనలు కూడా పోలీసుల నుంచి వినిపిస్తున్నాయి. ఒక్కసారిగా రోడ్లపైకి వస్తే ట్రాఫిక్ సమస్యలు ఏర్పడతాయని పోలీసులు అంటున్నారు. ప్రజలు కూడా తమకు సహకరించాలని కోరుతున్నారు. ఎవరూ వర్షం వచ్చిన గంట సేపు రోడ్లపైకి రావద్దని, నీరంతా రోడ్లపై నుంచి వెళ్లిపోయిన తర్వాత వస్తేనే ట్రాఫిక్ సజావుగా ఉంటుందని చెబుతున్నారు.