NoroVirus: ఓల్డ్ సిటీలో నోరో వైరస్ కలకలం
హైదరాబాద్ పాతబస్తీలో నోరోవైరస్ కేసులు నమోదవుతున్నాయి
హైదరాబాద్ పాతబస్తీలో నోరోవైరస్ కేసులు నమోదవుతున్నాయి. గ్యాస్ట్రోఎంటెరిటిస్‌కు అత్యంత సాధారణ కారణమైన ఈ వైరస్.. మధ్య వయస్కులు, సీనియర్ సిటిజన్‌లు, గర్భిణీలు, కౌమారదశలో ఉన్న బాలికలలో తీవ్రమైన కిడ్నీ ఇన్ఫెక్షన్స్ ను కలిగిస్తోందని వైద్యులు తెలిపారు. విరోచనాలు , వాంతులు, శరీరం వేగంగా డీహైడ్రేషన్ అవ్వడంతో మూత్రపిండాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. రోగులను డయాలసిస్‌కు వెళ్లేలా చేస్తుంది కూడా. మధుమేహ వ్యాధిగ్రస్తులు ఆహారం, నీరు, కలుషితమైన ఉపరితలాల ద్వారా వ్యాపించే ఈ వైరస్‌కు గురవుతారు. నోరోవైరస్ సోకిన రోగి, ఇతరుల మధ్య మానవ సంబంధాల ద్వారా కూడా ఈ వైరస్ వ్యాపిస్తుంది. పురానీ హవేలీ, షా అలీ బండాలోని ఆసుపత్రుల్లో పలువురు రోగులు ఈ వైరస్ బారిన పడినట్లు వైద్యులు తెలిపారు.
నోరోవైరస్ కేసులు ఎక్కువగా అజంపురా, ఈడీ బజార్, పురానీ హవేలీ, యాకుత్‌పురా, ఓల్డ్ మలక్‌పేట్ ప్రాంతాలలో నమోదయ్యాయి. తక్షణమే నివారణ చర్యలు చేపట్టకపోతే హైదరాబాద్‌లోని ఇతర ప్రాంతాలకు ఇది బాగా వ్యాపించే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. గ్యాస్ట్రోఎంటెరిటిస్ లక్షణాలతో ఆసుపత్రికి వచ్చే రోగులలో 2-5% మంది ఆసుపత్రిలో డయాలసిస్ చేయాల్సి వస్తోందని వైద్యులు తెలిపారు.