ఎన్టీఆర్‌ మహోన్నత వ్యక్తి

నేడు విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు, తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకులు, దివంగత మాజీ సీఎం నందమూరి తారక రామారావు శత

Update: 2023-05-28 02:07 GMT

నేడు విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు, తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకులు, దివంగత మాజీ సీఎం నందమూరి తారక రామారావు శత జయంతి. ఈ సందర్భంగా హైదరాబాద్‌ నగరంలోని ఎన్టీఆర్‌ ఘాట్‌ దగ్గర సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ నివాళులు అర్పించారు. ఉదయాన్నే బాలకృష్ణ పలువురు తెలుగుదేశం నాయకులతో కలిసి వచ్చిఅనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎన్టీఆర్‌ శత జయంతిని తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా, ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటున్నామని అన్నారు. ఎన్టీఆర్‌ సినిమాల్లోనే కాదు.. రాజకీయ రంగంలో కూడా ఎంతో ఉన్నత స్థాయిలో వెలుగొందారని చెప్పారు.

ఎన్టీఆర్‌ ఎల్లప్పుడూ సజీవంగా ఉంటారని, ఆయన ఒక మహానుభావుడని అన్నారు. తెలుగు ప్రజల రుణం తీర్చుకునేందుకే తెలుగు దేశం పార్టీని స్థాపించారని, పార్టీని అధికారంలోకి తీసుకువచ్చి ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలను తీసుకొచ్చారని కొనియాడారు. తమ తండ్రిగారు తీసుకొచ్చిన రెండు రూపాయలకు కిలో బియ్యం పథకం.. నేడు ఆహార భద్రతగా మారిందన్నారు. మహిళలకు ఆస్తి హక్కు వంటి ఎన్నో ముఖ్యమైన నిర్ణయాలను ఆయన తీసుకున్నారని, జాతీయ రాజకీయాల్లో ఎన్టీఆర్‌ కీ రోల్‌ పోషించారని అన్నారు.

ఎన్టీఆర్‌ కొడుకుగా జన్మించడం తన అదృష్టంగా భావిస్తున్నానని బాలకృష్ణ అన్నారు. అతను ఎంతో మహోన్నతమైన వ్యక్తి, క్లిష్ట పరిస్థితిలో నిలబడి విజయాలు సాధించారని పేర్కొన్నారు. ఆయన నటనకు పెట్టింది పేరు అని, ఆయన ఎవ్వరూ సాహసించని పాత్రలు చేశారుని తెలిపారు. NTR అంటే పేరు మాత్రమే కాదు. N అంటే నటన, T అంటే తారమండలం నుండి వచ్చిన ధ్రువ తారకుడు R అంటే రాజశ్రీ, రాజకీయ దురంధుడు అంటూ బాలకృష్ణ చెప్పుకొచ్చారు. నేడు ఎన్టీఆర్‌ శతజయంతి సందర్భంగా తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఎన్టీఆర్‌ అభిమానులు జయంతి వేడుకలు జరుపుకుంటున్నారు. ఆయన తెలుగు రాష్ట్రాలకు చేసిన సేవలను గుర్తు చేసుకుంటున్నారు. 

Tags:    

Similar News