Hyderabad : హీరో లేదు.. లీడర్ లేదు.. తొక్కాలేదు.. కూల్చి అవతల పారేయండి జనం మీ వెంటే

హైదరాబాద్ లో కూల్చివేతలపై పెద్దయెత్తున ప్రజల నుంచి ప్రశంసలు వినిపిస్తున్నాయి

Update: 2024-08-24 04:13 GMT

హైదరాబాద్ లో కూల్చివేతలపై పెద్దయెత్తున ప్రజల నుంచి ప్రశంసలు వినిపిస్తున్నాయి. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏర్పాటు చేసినప్పుడు ఇది రాజకీయ కక్ష కోసమే వినియోగించడానికి అన్న విమర్శలు వినిపించాయి. కానీ అందుకు భిన్నంగా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. హైడ్రా కమిషనర్ గా సీనియర్ ఐపీఎస్ అధికారి రంగనాధ్ ను నియమించడంతో దీని సీరియస్నెస్  కొందరికి అర్థమయినా మరికొందరు పొలిటీషియన్లకు మాత్రం ఇది బెదిరించడానికి, బ్లాక్ మెయిల్ చేయడానికే అనుకున్నారు. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న చెరువలన్నింటినీ ఆక్రమించారు.

పేదోడు ఆక్రమిస్తే...
సహజంగా పేద వాడు ఆక్రమించి గుడెసెలు వేసుకుంటే వెంటనే తొలగించే అధికారులు డబ్బున్న వాళ్లు ఆక్రమిస్తే మాత్రం వారి జోలికి పోరు. గత దశాబ్దాలుగా హైదరాబాద్ లో ఆక్రమణలు జరుగుతున్నా ఎవరూ పట్టించుకోలేదు. చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, కె. చంద్రశేఖర్ రావు హయాంలో ఎక్కువగా ఈ ఆక్రమణలు జరిగాయి. అయినా రాజకీయ వత్తిడులతో ఎవరూ ఏమీ చేయలేదు. చూసీ చూడనట్లు వ్యవహరించారు. దీంతో తమ వ్యాపారాల కోసం కొందరు కన్వెన్షన్ సెంటర్లు నియమించుకుంటే, మరికొందరు వీకెండ్ లో తాము సేదతీరడానికి ఫామ్ హౌస్ లను నిర్మించుకుని మరీ జల్సా చేస్తున్నారు. నాలుగు రాళ్లు సంపాదిస్తున్నారు. హీరోలు, రాజకీయ నేతలు, బిల్డర్లు తమకు తిరుగులేదని భావించి ధైర్యంగా ఆక్రమించి మరీ నిర్మించి పడేశారు.
చిన్న పాటి వర్షం పడితే...
చెరువులను, ప్రభుత్వ భూములను ఆక్రమించుకోవడంతో హైదరాబాద్ లో చిన్న పాటి వర్షం పడితే చాలు రోడ్లన్నీ నదులుగా మారుతున్నాయి. వర్షాకాలంలో హైదరాబాద్ వణికిపోయే పరిస్థితి ఉంది. హైదరాబాద్ లో భూముల విలువ పెరగడంతో తమకున్న పలుకుబడితో చెరువులను, ప్రభుత్వ భూములను కబ్జా చేసి మరీ ఆక్రమించి భారీ భవనాలను నిర్మించారు. వీరిలో సినీ హీరోలున్నారు. రాజకీయ నేతలు మరింత ఎక్కువ మంది ఉన్నారు. అందుకే హైదరాబాద్ పరిస్థితి దయనీయంగా తయారైంది. పాలకులు కూడా ఓట్ల కోసం వారి జోలికి పోలేదు. కానీ ఇప్పుడు మాత్రం హైడ్రా గత కొద్ది రోజులుగా కొనసాగిస్తున్న కూల్చివేతలన్నీ అక్రమ నిర్మాణాలే.
శభాష్ రేవంత్....
కానీ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత హైడ్రాను ఏర్పాటు చేశారు. అయితే దీనిపై ప్రజలు కూడా పెద్దగా ఆశలు పెట్టుకోలేదు. కానీ ఎవరినీ హైడ్రా వదిలిపెట్టడం లేదు. అక్రమమని తెలిస్తే చాలు ఎంతటి నిర్మాణాన్నై కూల్చివేస్తున్నారు. ప్రధానంగా బిల్డర్లు అక్రమంగా నిర్మించిన విల్లాలను కూడా హైడ్రా కూల్చి వేసింది. డబ్బులు సంపాదించుకోవడానికి అనేక వ్యాపారాలున్నా ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి అక్రమ నిర్మాణాలను చేపట్టి అక్కడ వ్యాపారాలు చేస్తున్న వారికి మాత్రం ఇది హెచ్చరికగానే చూడాలి. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు లేకపోతే ఏ సంస్థ ఇంత ధైర్యంగా ముందుకు అడుగు వేయలేదు. అందుకు ముందుగా మనం అభినందించాల్సింది రేవంత్ రెడ్డినే. శభాష్ రేవంత్. కొనసాగించండి. మీ వెంట మేమున్నామంటూ జనం సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు
Tags:    

Similar News