‌Hyderabad : బెంగళూరు బాధ చూశాంగా ఎండాకాలంలో నీటి ఎద్దడి.. వానాకాలంలో మునక

హైదరాబాద్ లో "హైడ్రా" కూల్చివేతలు కొనసాగాలని ప్రజలు కోరుకుంటున్నారు. లేకుంటే నగరం మరో బెంగళూరుగా మారుతుందని అంటున్నారు

Update: 2024-08-25 06:04 GMT

చెరువులను, నాలాలను ఇలా ఎవడికి వాడు ఆక్రమించుకుంటూ పోతే బెంగళూరును చూసైనా మనం నేర్చుకోమా? హైడ్రాకు అండగా నిలవాల్సిన సమయంలో రాజకీయ పార్టీలు, నేతలు కొందరు చేస్తున్న విమర్శలకు బెంగళూరు బాధ కనిపించలేదా? అది తెలిసిన రాజకీయ నేతలు కూడా తమదైన ధోరణిలో వెళుతుండటం బాధాకరమైన విషయం. హైదరాబాద్ మరికొన్ని రోజులకు బెంగళూరుగా మారుతుందన్న ఆందోళన ప్రతి ఒక్కరిలోనూ ఉంది. ఎందుకంటే బెంగళూరు తరహాలోనే హైదరాబాద్ అనేక సమస్యలను ఎదుర్కొనడం ప్రత్యక్షంగా టెకీలకు మాత్రమే కాదు స్వచ్ఛంద సంస్థలు, మేధావులకు ఈ సంగతి తెలుసు.

ఏం జరిగిందో చూశారుగా?
సామాన్యులను పక్కన పెడితే చదువుకున్న వారికి ఎవరికైనా బెంగళూరులో జరిగింది ఏంటో స్పష్టంగా తెలిసింది. బెంగళూరులో మొన్న ఎండాకాలంలో విపరీతమైన నీటి ఎద్దడి ఏర్పడింది. కావేరి నదిలో నీరు లేకపోవడం ఒక కారణమయితే అక్రమ నిర్మాణాలతో చెరువులను, నాలాలాను ఆక్రమించడం వల్ల నీరు భూమిలోకి ఇంకక పోవడంతో భూగర్భ జలాలు ఎండిపోయాయి. చివరకు మొన్న బెంగళూరు నగర వాసులు గిన్నెలు తోముకోవడానికి కూడా కష‌్టంగా మారింది. మంచినీటి సరఫరా లేకపోవడం, బోర్లు ఎండిపోవడంతో నీటి కోసం నానా కష్టాలు పడ్డారు. వాహనాలను శుభ్రం చేసుకుంటే బెంగుళూరు మహానగర పాలక సంస్థ భారీగా జరిమానా విధించిన సంగతిని మనం కళ్లారా చూశాం.
చినుకు పడితే...
ఇక వర్షం పడితే బెంగళూరులో రహదారులే కాదు అపార్ట్‌మెంట్లకు అపార్ట్‌మెంట్లే వరద నీటిలో మునిగిపోయాయి. ఖరీదైన కార్లు నీటిలో కొట్టుకుపోయాయి. భారీ వర్షాలకు బెంగళూరు బెంబెేలెత్తి పోయింది. కొందరు మరణించారు కూడా. విల్లాల్లోకి నీరు రావడం, మూడు అంతస్తుల వరకూ మునిగిపోవడంతో వస్తువులన్నీ తడిసి పోయి పాడై పోయాయి. ఇలాంటి పరిస్థితిని మనం అదే బెంగళూరులో చూశాం. ఇక బెంగళూరులో ట్రాఫిక్ సమస్య ఎక్కువ. ఇంటి నుంచి కార్యాలయానికి వెళ్లాలంటే గంటల తరబడి సమయం పడుతుంది. ఉదయం పది గంటలకు ఆఫీసయితే.. ఉదయం ఆరుగంటలకు ఉద్యోగులు బయలుదేరాల్సిన పరిస్థితి. మెట్రో రైళ్లు ఉన్నా ట్రాఫిక్ సమస్యకు ఇప్పటికీ తెరపడలేదు.
హైదరాబాద్ లోనూ...
బెంగళూరు తరహాలోనే ట్రాఫిక్ విషయంలోనూ హైదరాబాద్ తయారయింది. అయితే ఇప్పుడు వర్షం పడితే రహదారుల్లోకి వర్షపు నీరు చేరి ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. హైదరాబాద్ లోనూ ఇలా అక్రమ నిర్మాణాలను చూస్తూ పోతే రానున్న కాలంలో నీటి ఎద్దడి కూడా తలెత్తక తప్పదన్న ఆందోళన ప్రతి ఒక్కరిలోనూ వ్యక్తమవుతుంది. చెరువులు, నాలాలు, కుంటలు ఆక్రమిస్తే నీరు ఎక్కడకు వెళుతుంది? అసలు ఇప్పటికే హైదరాబాద్ జనాభా కోటి దాటింది. భవిష్యత్ లో ఇది మరింత పెరిగే అవకాశముంది. ఈ పరిస్థితుల్లో అక్రమ కట్టడాలను కూల్చి వేసి భవిష్యత్ కు బంగారు బాట వేస్తే తప్పెలా అవుతుంది భయ్యా? హైడ్రా చేసే ఈపనికి నగరవాసిగా ప్రతి ఒక్కరూ స్పందించాలి. సహకరించాలి. అప్పుడే మన హైదరాబాద్ ను మనం నీటీ ఎద్దడి, వరద నీటి ముప్పు నుంచి రక్షించుకోగలుగుతాం.


Tags:    

Similar News