Janwada Farm house : జన్వాడ ఫామ్ హౌస్ పై ఏం జరగబోతోంది? సాయంత్రానికి తేల్చేస్తారటగా?

జన్వాడ ఫామ్ హౌస్ లో పోలీసుల దాడులు రాజకీయంగా కలకలం రేపింది

Update: 2024-10-27 07:12 GMT

జన్వాడ ఫామ్ హౌస్ లో పోలీసుల దాడులు రాజకీయంగా కలకలం రేపింది. ఒక ప్రముఖ రాజకీయ నేతకు సంబంధించిన బంధువు ఫామ్ హౌస్ కావడంతో ఇది మరింత హాట్ టాపిక్ గా మారింది. ఈ ఫామ్ హౌస్ పై దాడులు జరిగి, డ్రగ్స్ తీసుకుంటున్నట్లు బయటపడటంతో సీసీ టీవీ ఫుటేజీలను బయటపెట్టాలంటూ బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. నిందితులను తప్పించే ప్రయత్నం చేస్తున్నారని బీజేపీ నేత రఘునందన్ రావు డిమాండ్ చేశారు. మరో వైపు కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా నిందితులను తప్పించే ప్రయత్నంలో ఉన్నారని, అధికార, ప్రతిపక్ష పార్టీలు ఈ విషయంలో ఏకమయ్యాయని ఆయన ఆరోపించారు. జన్వాడ ఫామ్ హౌస్ కేసులో అసలు నిందితులు ఎవరో తేల్చాలని రాజకీయ నేతలు పట్టుబడుతున్నారు. నిజాలు నిగ్గుతేల్చాలని కోరుతున్నారు.

సవాళ్లు.. ప్రతి సవాళ్లు...
జన్వాడ ఫామ్ హౌస్ గత కొంతకాలంగా రాజకీయంగా నడుస్తుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సన్నిహితుడికి సంబంధించిన జన్వాడ ఫామ్ హౌస్ ను కూల్చేవేస్తామని సాక్షాత్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. అది ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిందని, దానిని కూల్చివేయడం గ్యారంటీ అని రేవంత్ ప్రతి బహిరంగ సభలో చెబుతున్నారు. బుల్ డోజర్లు వస్తున్నాయని కాచుకో అంటూ కేటీఆర్ కు ఇటీవల రేవంత్ రెడ్డి సవాల్ కూడా విసిరారు. నిబంధనలు అతిక్రమిస్తే కూల్చవచ్చని కేటీఆర్ ప్రతి సవాల్ కూడా విసిరారు. అయితే జన్వాడ ఫామ్ హౌస్ కు సంబంధించి ఇప్పటికే న్యాయస్థానాన్ని సదరు వ్యక్తులు ఆశ్రయించారు. దానిని కూల్చివేయకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఫామ్‌హౌస్‌ యజమాని ప్రదీప్‌రెడ్డి ఈ పిటిషన్‌ దాఖలు చేశారు. ప్రతివాదులుగా రాష్ట్ర ప్రభుత్వం, హైడ్రా కమిషనర్‌, రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌, లేక్‌ ప్రొటెక్షన్‌ కమిటీ సభ్యులు, శంకర్‌పల్లి తహసీల్దార్‌, చీఫ్‌ ఇంజినీర్‌ను చేర్చారు. తన ఫామ్‌హౌస్‌, పొలము ఉస్మాన్‌సాగర్‌ ఎఫ్‌టీఎల్‌ పరిధిలో లేవని పిటిషనర్ పేర్కొన్నారు.
న్యాయనిపుణలతో సంప్రదించి...
జన్వాడ ఫాంహౌస్‌ కేసులో హైడ్రాకు హైకోర్టు కీలక ఆదేశాలిచ్చింది. అన్ని డాక్యుమెంట్లు పరిశీలించాలని.. జీవో 99 ప్రకారం నిబంధనల మేరకే చర్యలు తీసుకోవలని స్పష్టం చేసింది. హైడ్రాకు సంబంధించిన పూర్తి వివరాలను సమర్పించాలని ఏఏజీని న్యాయస్థానం ఆదేశించింది. ఇక తాజాగా జన్వాడ సమీపంలో ఫామ్ హౌస్ లో రేవ్ పార్టీ జరగడంతో ఇక కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయనిపుణులతో సంప్రదిస్తుంది. జన్వాడ ఫామ్ హౌస్ ను సీజ్ చేయాలని భావిస్తుంది. ఈ ఫామ్ హౌస్ లో డ్రగ్స్ తీసుకున్న వారిపై మోకిల పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. ఫామ్ హౌస్ యజమాని రాజ్ పాకాలపై కూడా రెండు కేసులు నమోదయినట్లు మోకిలా పోలీసులు తెలిపారు. సాయంత్రానికి తెలంగాణ ప్రభుత్వం జన్వాడ ఫామ్ హౌస్ వైపునకు బుల్ డోజర్ దూసుకు వచ్చే అవకాశాలున్నాయని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి. 



Tags:    

Similar News