GHMC: మీ ప్రాంతంలో కుక్కల బెడద ఉంటే.. ఈ నెంబర్ కు కాల్ చేయండి

హైదరాబాద్ నగరంలో కుక్కల బెడద ఎక్కువైపోయిందంటూ

Update: 2024-07-24 14:57 GMT

హైదరాబాద్ నగరంలో కుక్కల బెడద ఎక్కువైపోయిందంటూ పలు ప్రాంతాల ప్రజలు చెబుతూనే వస్తున్నారు. అంతేకాకుండా కొన్ని ప్రాంతాల్లో కుక్కలు దాడి చేయడం, కొందరు మరణించడం కూడా జరిగింది. ఇది ఎంతో ఆందోళన కలిగించే అంశం. అయితే గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (GHMC) ఆయా ప్రాంతాల్లో కుక్కల బెడద ఉంటే తమకు తెలియజేయాలని కోరింది. ఫిర్యాదులను స్వీకరించిన తర్వాత వీధి కుక్కలను పట్టుకుని, వాటికి వ్యాక్సినేషన్ చేస్తామని, స్టెరిలైజ్ కూడా చేస్తామని జీహెచ్ఎంసీ తెలిపింది. తక్షణ సహాయం కోసం 040-21111111 లేదా 040-232253975కు డయల్ చేయాలని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) అధికారులు ట్వీట్‌లో కోరారు. ఒక్క కాల్‌ చేస్తే మీ సమస్యను పరిష్కరిస్తామని కార్పొరేషన్ హామీ ఇచ్చింది.

అయితే స్టెరిలైజ్ చేసిన కుక్కలను తిరిగి అదే పరిసరాల్లోకి విడుదల చేసే పద్ధతిని నెటిజన్లు ప్రశ్నించారు. అదే సమస్య పునరావృతమయ్యే సమస్యలు ఉన్నాయని తెలిపారు. మొత్తం కుక్కల జనాభాపై స్టెరిలైజేషన్ దీర్ఘకాలిక ప్రభావం చూపుతుందా అనే సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. 18 నెలల బాలుడిపై కుక్కల దాడి నేపథ్యంలో, వీధికుక్కల బెడదపై పెరుగుతున్న ఆందోళనపై తెలంగాణ హైకోర్టు దృష్టి సారించింది. ఇలాంటి ఘటనలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై పూర్తి వివరాలను అందించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. ప్రభుత్వం స్టెరిలైజేషన్ ప్రయత్నాలను ఒక పరిష్కారంగా వివరించగా, న్యాయస్థానం దాని ప్రభావం గురించి అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ప్రత్యామ్నాయ వ్యూహాలను కోరింది. యానిమల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఒక ఎంపికగా వీధి కుక్కలను షెల్టర్‌లకు తరలించాలని ప్రతిపాదించింది.



Tags:    

Similar News