Hyderabad: ఐటీ కారిడార్‌లో లేడీస్ స్పెషల్ బస్సు

ఆఫర్లు, డిస్కౌంట్ల పేరుతో ప్రయాణికులను తన వైపు మళ్లించుకుంటోంది తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్‌టీసీ).

Update: 2023-07-30 11:00 GMT

ఆఫర్లు, డిస్కౌంట్ల పేరుతో ప్రయాణికులను తన వైపు మళ్లించుకుంటోంది తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్‌టీసీ). ప్రత్యేక రాయితీలను ప్రకటిస్తూ ప్రయాణికులను ఆర్టీసీ బస్సు ఎక్కేలా చేస్తోంది. ఈ క్రమంలోనే జూలై 31 నుంచి ఐటీ కారిడార్‌లో ప్రత్యేక “మెట్రో ఎక్స్‌ప్రెస్ లేడీస్ స్పెషల్” బస్సు సర్వీసును నడిపేందుకు సిద్ధమైంది. స్పెషల్ లేడీస్ బస్సు సర్వీస్ అనేది జేఎన్టీయూ నుండి వేవ్ రాక్ వరకు పైలట్ ప్రాజెక్ట్. ఇది ఆఫీసు వేళల్లో మహిళలకు ఇబ్బంది లేని ప్రయాణాన్ని అందిస్తుంది. నగరంలోని ఐటీ కంపెనీల్లో ఐదు లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని అంచనా. జెఎన్‌టియు నుండి ఉదయం 9 గంటల నుండి బయలుదేరే బస్సు.. ఫోరం/నెక్సస్ మాల్, హైటెక్ సిటీ, మైండ్‌స్పేస్, రాయదుర్గ్, బయో డైవర్సిటీ పార్క్, గచ్చిబౌలి 'ఎక్స్' రోడ్, ఇందిరా నగర్, ఐఐటి 'ఎక్స్' రోడ్, విప్రో సర్కిల్, ఐసీఐసీఐ టవర్స్‌ నుంచి ప్రయాణిస్తుంది.

ఉదయం, సాయంత్రం ఈ బస్సు సర్వీసు ఉంటుంది. స్పందనను బట్టి మరిన్ని రూట్లను చేర్చనున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. రేపటి నుంచి అందుబాటులోకి వచ్చే ఈ ప్రత్యేక బస్సును.. మహిళా ప్రయాణికులు వినియోగించుకుని క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని ఆర్టీసీ సంస్థ కోరింది. ఇదిలా ఉంటే.. ఆర్టీసీ ఇటీవల ‘టి9-30 టికెట్’ని అందుబాటులోకి తెచ్చింది. ఈ టికెట్‌ కు రూ.50 చెల్లిస్తే 30 కిలోమీటర్ల పరిధిలో రానూపోను ప్రయాణించే వెసులుబాటును ప్రయాణికులకు కల్పిస్తారు. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మాత్రమే ఈ టికెట్‌ చెల్లుబాటు అవుతుంది. తక్కువ దూరం ప్రయాణించే ఉద్యోగులు, వ్యాపారులు, భవన నిర్మాణ కార్మికులకు టి9-30 టికెట్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. 

Tags:    

Similar News