Hyderabad : హైదరాబాదీలకు గుడ్ న్యూస్... ఇక ఏకంగా ఒంటి గంట వరకూ షాపింగ్
తెలంగాణ ప్రభుత్వం హైదరాబాదీలకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై ఒంటి గంట వరకూ దుకాణాలు తెరుచుకునే వీలు కల్పించింది
తెలంగాణ ప్రభుత్వం హైదరాబాదీలకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై ఒంటి గంట వరకూ దుకాణాలు తెరుచుకునే వీలు కల్పించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ సమావేశాల్లో ప్రకటించారు. ఇటీవల కాలంలో హైదరాబాద్ లో హత్యలు, అత్యాచారాలు జరుగుతుండటంతో వ్యాపార సముదాయాలతో పాటు హోటళ్లను రాత్రి పదకొండు గంటలకే మూసివేయిస్తున్నారు. హైదరాబాద్ లో రాత్రి వేళ షాపింగ్ ను ఎక్కువ మంది ఇష్టపడతారు. అయితే కొద్ది రోజుల నుంచి పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో దుకాణాలన్నీ రాత్రి పదకొండు గంటలకే మూతబడుతున్నాయి.
నైట్ షాపింగ్ కు...
నైట్ షాపింగ్ కు అవకాశం లేకుండా పోయింది. ప్రధానంగా పాతబస్తీలోనూ హోటళ్లు, దుకాణాలు రాత్రి పదకొండు గంటలకే మూసి వేయాలని ఆదేశాలు జారీ చేయడంతో అనేక మంది నిరాశపడుతున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన పర్యాటకులు సయితం రాత్రి వేళ షాపింగ్ ను ఇష‌్టపడుతుంటారు. కొద్ది రోజుల క్రితం వరస హత్యలు జరగడం, ఘర్షణలు చోటు చేసుకోవడంతో పోలీసులు గట్టి చర్యలు చేపట్టారు. పదకొండు గంటలు దాటిన తర్వాత రోడ్డు మీద కనిపిస్తే వారిపై చర్యలు తీసుకోవడం ప్రారంభించారు.
ఇకపై ఒంటి గంట వరకూ....
అయితే దీనిపై ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీపీ అసెంబ్లీలో అసహనం వ్యక్తం చేశారు. తాను రాత్రి పదకొండు గంటల తర్వాత బయట తిరుగుతానని కేసులు పెట్టుకోవచ్చని అసెంబ్లీ సాక్షిగా సవాల విసిరారు. అమాయకులపై కేసులు పెట్టడాన్ని ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనికి స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అర్ధరాత్రి ఒంటి గంట వరకూ హైదరాబాద్ నగరంలో దుకణాలను తెరిచి ఉంచేందుకు అనుమతిస్తామని ప్రకటించారు. దీంతో వ్యాపార వర్గాలతో పాటు ముఖ్యంగా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు, చిరు వ్యాపారులు, పాతబస్తీలోని యువకులు ఊపిరి పీల్చుకున్నారు.