Tomato : గుడ్ న్యూస్.. టమాటా ధరలు దిగివచ్చాయిగా.. కిలో ధర ఎంతంటే?
గత కొద్ది రోజులుగా టమాటా ధరలు విపరీతంగా పెరిగాయి.
గత కొద్ది రోజులుగా టమాటా ధరలు విపరీతంగా పెరిగాయి. ఒక దశలో కిలో వంద రూపాయలకు కూడా చేరుకుంది. మదనపల్లి, పత్తికొండ మార్కెట్ లో ధర ఎక్కువ పలుకుతుండటంతో హైదరాబాద్ తో పాటు ఇతర ప్రాంతాలకు టమాటా వచ్చేసరికి దాని ధర మరింత ఎక్కువయింది. గత రెండు నెలల నుంచి టమాటా ధరలు దిగి రావడం లేదు. టమాటాను కొనుగోలు చేయాలంటేనే భయపడిపోయే పరిస్థితి ఏర్పడింది. కిలో వంద రూపాయలు పెట్టి కొనుగోలు చేయలేక కొందరు టమాటాను పూర్తిగా పక్కన పెట్టేశారు.
దిగుబడి లేక...
అయితే వంటింట్లో అతి ముఖ్యమైన కూరగాయ కావడంతో టమాటాను విధిగా కొనుగోలు చేయాల్సి ఉంటుంది. పంట దిగుబడి లేకపోవడంతో పాటు డిమాండ్ ఒక్కసారిగా పెరిగిపోవడంతో టమాటా ధరలు పెరిగిపోయాయి. మార్కెట్ లోకి వచ్చిన టమాటా కూడా నాణ్యత లేకుండా ఉండటంతో వినియోగదారులు ఇబ్బంది పడ్డారు. పండిన కొద్దిపాటి టమాటాను ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తుండటంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ధరలు విపరీతంగా పెరిగిపోయాయి.
ధరలు తగ్గి.....
టమాటా పంట దిగుబడి సెప్టెంబరు నాటికి రాదని, అప్పటి వరకూ ఈ ధరలు ఇంతేనని వ్యాపారులు కూడా చెబుతున్నారు. అయితే గత రెండు రోజుల నుంచి టమాటా ధరలు దిగి వచ్చాయి. ఇప్పుడు కిలో ఇరవై ఐదు రూపాయలకు చేరుకుంది. ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి అవుతుండటంతో పాటు రాష్ట్రంలోనూ పంట కొంత చేతికి రావడంతో ధరలు దిగి వచ్చాయి. రానున్న రోజుల్లో టమాటా ధరలు మరింత దిగి వచ్చే అవకాశముందని చెబుతున్నారు. రైతు బజార్లలో కిలో ఇరవై రూపాయలకే విక్రయిస్తున్నారు.