విశాఖపట్నం-సికింద్రాబాద్ వందేభారత్ ఎక్స్ ప్రెస్ రద్దు

విశాఖపట్నం-సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను కొన్ని సాంకేతిక సమస్యల కారణంగా

Update: 2023-08-17 09:05 GMT

విశాఖపట్నం-సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను కొన్ని సాంకేతిక సమస్యల కారణంగా గురువారం రద్దు చేశారు. దీంతో పలువురు ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. రైలు నంబర్ 20833 విశాఖపట్నం-సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఉదయం 5.45 గంటలకు బయలుదేరాల్సి ఉంది. అయితే రద్దు చేసినట్లు ఉదయం 5 గంటలకు తమకు సమాచారం అందిందని ప్రయాణికులు వాపోయారు. ఈస్ట్ కోస్ట్ రైల్వేలోని వాల్తేరు డివిజన్ విశాఖపట్నం నుండి సికింద్రాబాద్‌కు వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌తో పాటు అదే మార్గంలో ప్రత్యేక రైలును నడుపుతూ ప్రయాణికుల కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. అసౌకర్యానికి చింతిస్తున్నామని వాల్తేరు డివిజన్ రైల్వే మేనేజర్ అన్నారు. విశాఖపట్నం రైల్వేస్టేషన్ నుంచి ఉదయం 7 గంటలకు ప్రత్యేక రైలు బయలుదేరింది.

గురువారం ఉదయం 5:45గంటలకు వందేభారత్ ఎక్స్ ప్రెస్ విశాఖపట్నం నుంచి బయల్దేరాల్సి ఉంది. అయితే రైలును రద్దు చేయడంతో ప్రత్యామ్నాయంగా మరో రైలును ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ రైలు వందేభారత్ ఎక్స్ ప్రెస్ స్టాపుల్లోనే ఆగుతుందని వెల్లడించారు.వందేభారత్ రైలుకు టికెట్ రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులు ఈ రైలు ఎక్కాలని తెలిపారు. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నట్లు పేర్కొన్నారు. వందేభారత్ ఎక్స్ ప్రెస్ ప్రతిరోజు ఉదయం 5:45 గంటలకు విశాఖపట్నం నుంచి బయల్దేరుతుంది. మధ్యాహ్నం 2:15 గంటలకు సికింద్రాబాద్ కు చేరుకుంటుంది. తిరిగి సికింద్రాబాద్ లో మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరి రాత్రి 11:30 గంటలకు విశాఖకు చేరుకుంటుంది. రాజమండ్రి, విజయవాడ, ఖమ్మం, వరంగల్ స్టేషన్లలో మాత్రమే ఈ రైలు ఆగుతుంది.


Tags:    

Similar News