ఇనుప రాడ్ తలపై పడింది.. 1.7 కోట్ల రూపాయలు చెల్లించాలని హైదరాబాద్ మహిళ డిమాండ్
తనకు గాయమవ్వడానికి మెట్రో రైల్ హైదరాబాద్ లిమిటెడ్, ఎల్‌అండ్‌టి, పురపాలక శాఖ నిర్లక్ష్యమే
2017లో మెట్రో రైలు స్టేషన్‌లో ఇనుప రాడ్ తనపై పడడంతో ఓ మహిళ తలకు గాయమైంది. ఇందుకు సంబంధించి తనకు నష్టపరిహారం చెల్లించాలని సదరు మహిళ కోర్టుకు ఎక్కింది. ఆమె దాఖలు చేసిన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు స్పందించింది. తనకు గాయమవ్వడానికి మెట్రో రైల్ హైదరాబాద్ లిమిటెడ్, ఎల్‌అండ్‌టి, పురపాలక శాఖ నిర్లక్ష్యమే కారణమని పేర్కొంది. ఈ పిటిషన్‌పై తమ స్టాండ్‌ను సమర్పించాలని ప్రతివాదులందరినీ జస్టిస్ తడకమళ్ల వినోద్ కుమార్ కోరారు. గాయపడిన రెయిన్ బజార్ నివాసి, పోషకాహార ఉత్పత్తుల డీలర్ ఉజ్మా హఫీజ్ మాట్లాడుతూ అధికారుల నిర్లక్ష్యానికి తాను భారీ మూల్యం చెల్లించుకుంటున్నానన్నారు. ఈ ఘటన జరిగినప్పటి నుంచి ఐదుగురు పిల్లలతో సహా తన కుటుంబం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
ఉజ్మా హఫీజ్ తన భర్తతో కలిసి మార్చి 11, 2017న ద్విచక్ర వాహనంపై తమ ఇంటి నుంచి కార్యాలయానికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. నాంపల్లి మెట్రో రైలు స్టేషన్ సమీపంలో ఉండగా.. రైల్వే ట్రాక్‌లను మార్చడానికి ఉపయోగించిన భారీ ఇనుప రాడ్ నేరుగా ఆమె తలపై పడి ఆమె పుర్రెకు గుచ్చుకుంది. స్పృహ తప్పి పడిపోయిన ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటన తర్వాత చెవిపోటు, ఇతర ఆరోగ్య సమస్యలు, మూర్ఛలు, స్వల్పకాలిక జ్ఞాపకశక్తి కోల్పోవడం, నడక సరిగా లేకపోవడం, దృష్టి మందగించడం, పాక్షిక వినికిడి వంటి సమస్యలతో బాధపడుతున్నట్లు ఆమె చెప్పారు. నాంపల్లి పోలీసులు మెట్రో రైలు నిర్మాణ కాంట్రాక్ట్‌ను కలిగి ఉన్న ఎల్‌అండ్‌టిపై ఐపిసి సెక్షన్ 338 (ఇతరుల ప్రాణాలకు లేదా వ్యక్తిగత భద్రతకు హాని కలిగించే చర్య ద్వారా తీవ్రంగా గాయపరచడం) కింద కేసు నమోదు చేశారు.
పరిహారం కోసం ఆమె వినియోగదారుల ఫోరమ్‌ను ఆశ్రయించారు. మెట్రో రైల్ వినియోగదారు లేదా కస్టమర్‌గా పరిగణించబడదు అనే కారణంతో ఆమె దరఖాస్తును తిరస్కరించింది. ఆమె హైకోర్టును ఆశ్రయించగా, అది ప్రతివాదుల స్టాండ్‌ను కోరింది. కేసును అక్టోబర్ 13కి వాయిదా వేసింది. తనకు 1.7 కోట్ల రూపాయల పరిహారం చెల్లించాలని ఉజ్మా హఫీజ్ కోరుతున్నారు.