ఇమ్రాన్ ఖాన్ అనుకున్నదొక్కటి.. అయ్యిందొక్కటి

తోషాఖానా అవినీతి కేసులో పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు మూడేళ్ల శిక్షను ఇస్లామాబాద్ హైకోర్టు

Update: 2023-08-29 13:26 GMT

తోషాఖానా అవినీతి కేసులో పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు మూడేళ్ల శిక్షను ఇస్లామాబాద్ హైకోర్టు సస్పెండ్ చేసింది. అయితే సైఫర్ కేసుకు సంబంధించి ఆగస్టు 30న ప్రత్యేక కోర్టు ముందు హాజరుపరిచే వరకు ఇమ్రాన్ ఖాన్ జ్యుడీషియల్ రిమాండ్‌లో కొనసాగుతాడని పాక్ మీడియా నివేదించింది. తోషఖానా కేసులో పడిన జైలు శిక్షను నిలిపివేస్తూ ఇస్లామాబాద్‌ హైకోర్టు తీర్పు వెలువరించిన వెంటనే.. ఇమ్రాన్‌ఖాన్‌పై పోలీసులు అధికారిక రహస్యాల చట్టం కింద సైఫర్‌ కేసు నమోదు చేశారు. దౌత్య అంశాలను ఇమ్రాన్ ఖాన్ దుర్వినియోగం చేశారని అభియోగాలు మోపారు పోలీసులు.

తోషాఖానా అవినీతి కేసులో ఇమ్రాన్‌‌కు విధించిన మూడేళ్ల శిక్షను ఇస్లామాబాద్‌ హైకోర్టు మంగళవారం రద్దు చేసింది. ఈ కేసులో దిగువ న్యాయస్థానం విధించిన శిక్షను రద్దు చేయాలని కోరుతూ ఇమ్రాన్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై ఇస్లామాబాద్ హైకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. తోషాఖానా కేసులో జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పును నిలిపివేసిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అమీర్ ఫరూఖ్, జస్టిస్ తారిఖ్ మొహమూద్ జహంగీరీల ధర్మాసనం ఇమ్రాన్‌కు బెయిల్ మంజూరు చేసింది. పాకిస్థాన్ ప్రధానిగా 2018 నుంచి 2022 మధ్య ఇమ్రాన్ ఖాన్, ఆయన కుటుంబసభ్యులు ప్రభుత్వ కానుకలను చట్టవిరుద్ధంగా అమ్ముకున్నట్టు ఆరోపణలు రావడంతో కేసు నమోదైంది. దీనిపై విచారణ చేపట్టిన ఇస్లామాబాద్ జిల్లా కోర్టు ఇమ్రాన్‌ను దోషిగా నిర్దారించింది. ఆయనకు మూడేళ్ల జైలు శిక్ష విధించడంతో పాటు ఐదేళ్ల పాటు ఎన్నికల్లో పోటీకి అనర్హుడిగా ప్రకటించింది.


Tags:    

Similar News