138 ఏళ్ల తర్వాత తొలి ఆడపిల్ల.. ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్న దంపతులు
అమెరికాలోని మిషిగాన్ రాష్ట్రానికి చెందిన కలడోనియా నివాసి ఆండ్రూ క్లార్క్-కరోలిన్ కుటుంబంలో జరిగిన ఘటన ఇది. 1885 తర్వాత
పురుషుడికి సమానంగా.. అన్నిరంగాల్లోనూ స్త్రీలు రాణిస్తున్న ఈ రోజుల్లో కూడా ఇంకా చాలా మంది ఆడపిల్ల పుడితే భారంగానే భావిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో ఆడబిడ్డను ప్రసవిస్తే.. ఆ ముక్కుపచ్చలారని పసికందులను నిర్దాక్షిణ్యంగా చెత్తకుప్పల్లో, ముళ్లపొదల్లో పారేసి చేతులు దులిపేసుకుంటున్నారు. కానీ.. ఓ కుటుంబం 138 సంవత్సరాలుగా ఆడపిల్ల కోసం ఎదురుచూస్తోంది. శతాబ్దానికి పైగా ఆడపిల్ల పుడుతుందని చూసిన వారికి నిరాశ ఎదురైంది. ఇన్నాళ్లకు వారి కల ఫలించి.. 138 ఏళ్ల తర్వాత తొలిసారి ఆడపిల్ల పుట్టడంతో.. ఆ దంపతుల ఆనందానికి అవధుల్లేవు.
అమెరికాలోని మిషిగాన్ రాష్ట్రానికి చెందిన కలడోనియా నివాసి ఆండ్రూ క్లార్క్-కరోలిన్ కుటుంబంలో జరిగిన ఘటన ఇది. 1885 తర్వాత వారి వంశంలో ఆడపిల్ల పుట్టలేదు. అమ్మాయి కోసం ఎదురుచూడని తరం లేదు. శతాబ్దకాలం పాటు నిరీక్షించినా వారి ఆశ నెరవేరలేదు. ఆఖరికి ఇన్నాళ్లకు వారి వంశంలో ఆడపిల్ల పుట్టి.. సంతోషాన్ని నింపింది. తమ కుటుంబంలో అమ్మాయి లేనందుకు చాలా బాధపడేదానినని కరోలిన్ చెప్పుకొచ్చారు. గర్భం దాల్చిన తర్వాత ఎవరు పుడతారన్న దాని గురించి ఆలోచించలేదన్నారు. 9 నెలల తర్వాత ఆడపిల్ల పుట్టడం చాలా సంతోషంగా ఉందన్న కరోలిన్.. పాపకు ఏ పేరు పెట్టాలో తెలియలేదన్నారు. బాగా ఆలోచించి తొలిసారి పుట్టిన పాపకు ఆడ్రీ అని పేరు పెట్టినట్టు చెప్పారు. క్లార్క్ - కరోలిన్ జంటకు నాలుగేళ్ల కొడుకు కామెరాన్ ఉన్నాడు.