లైగర్ ట్విట్టర్ రివ్యూ : ప్రేక్షకుల స్పందన ఎలా ఉందంటే..
కొందరు పూరీ జగన్నాథ్ స్టాండర్డ్ మూవీలా లైగర్ లేదని అంటున్నారు. పూరీ నుంచి ఆశించిన స్థాయిలో సినిమా కనిపించలేదంటున్నారు.;
సినీ అభిమానులు ఈగర్ గా ఎదురుచూస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమా లైగర్ నేడు ప్రపంచవ్యాప్తంగా తెలుగు, హిందీ సహా ఇతర భాషల్లో విడుదలైంది. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ తో పాటు.. మరికొన్ని ప్రాంతాల్లో ఉదయం 7.30 గంటలకే స్క్రీన్లపై పడింది. లైగర్ సినిమా చూసేందుకు వచ్చిన అభిమానులతో థియేటర్లు కిక్కిరిసిపోయాయి. ఈ సినిమాకు సంబంధించి ప్రేక్షకులు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాలను చెప్తున్నారు. లైగర్ పై తొలి షో లోనే మిశ్రమ స్పందన వచ్చింది.
ట్విట్టర్లో విజయ్ అభిమానులు, సినీ ప్రియులు లైగర్ పై తమ అభిప్రాయాలను షేర్ చేసుకున్నారు. లైగర్ ఎక్సలెంట్ అని కొందరు అంటున్నారు. ఒక రెజ్లర్ కథతో తెరకెక్కి ఈ సినిమా అద్భుతంగా ఉందని, ఫైటింగ్ సీన్లు ఓ రేంజ్ లో ఉన్నాయని చెబుతున్నారు. సినిమాను విజయ్ అన్నీ తానై నడిపించాడని కితాబునిస్తున్నారు. అనన్య పాండే చాలా హాట్ గా ఉందని కొందరంటే.. అసలు హీరోయిన్ వల్ల ఏం యూజ్ లేదని కొందరు అభిప్రాయపడ్డారు.
ప్రపంచ హెవీ వెయిట్ బాక్సింగ్ మాజీ ఛాంపియన్ మైక్ టైసన్ పాత్ర బాగుంది కానీ.. కావాల్సినంత మేర అతనిని ఉపయోగించుకోలేదని ట్వీట్లు చేస్తున్నారు. మరికొందరు ఫస్ట్ హాఫ్ పర్వాలేదని.. సెకండ్ హాఫ్ అనుకున్న స్థాయిలో మెప్పించలేకపోయిందని పేర్కొంటున్నారు. క్లైమాక్స్ ఈ సినిమాకు పెద్ద డ్రాబ్యాక్ అని, ఆకట్టుకోలేకపోయిందని అంటున్నారు. కథలో బలం లేదని, స్క్రీన్ ప్లే బలహీనంగా ఉందని చెపుతున్నారు.
కొందరు పూరీ జగన్నాథ్ స్టాండర్డ్ మూవీలా లైగర్ లేదని అంటున్నారు. పూరీ నుంచి ఆశించిన స్థాయిలో సినిమా కనిపించలేదంటున్నారు. తెలుగు సినిమాను బాలీవుడైజేషన్ చేశారంటూ ఇంకొందరు పెదవి విరిచారు. హిందీలో తీసిన సినిమాను తెలుగులో డబ్ చేశారని విమర్శిస్తున్నారు. తెలుగు ఇండస్ట్రీని ఇది అగౌరవపరచడమేనని అంటున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జొహార్ భాగస్వామి కావడం అతి పెద్ద మైనస్ పాయింట్ అని చెపుతున్నారు. అలాగే సాంగ్స్ కూడా సరైన సమయంలో పడలేదని విమర్శలు వస్తున్నాయి.
మొత్తం మీద ట్విట్టర్ రివ్యూలో.. లైగర్ కు తొలి ఆటతోనే డివైడ్ టాక్ వచ్చింది.