అమర్ అక్బర్ ఆంటోని మూవీ రివ్యూ

Update: 2018-11-16 08:44 GMT

బ్యానర్: మైత్రి మూవీస్

నటీనటులు: రవితేజ, ఇలియానా, సునీల్, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి, అభిమన్యు సింగ్, విక్రంజీత్ విర్క్, షియాజీ షిండే, లయ, ఆదిత్య మీనన్ తదితరులు

సినిమాటోగ్రాఫర్: వెంకట్. సి. దిలీప్

మ్యూజిక్ డైరెక్టర్: థమన్ ఎస్.ఎస్

ఎడిటింగ్: ఎం ఆర్ వర్మ

ప్రొడ్యూసర్స్: ప్రవీణ్ మార్పురి, నవీన్ యెర్నేని, వై. రవి శంకర్

డైరెక్టర్: శ్రీను వైట్ల

టాలీవుడ్ లో ఎనర్జిటిక్ హీరో అంటే మొదటగా వినబడే పేరు రవితేజదే. మొదట్లో చిన్నచిన్న వేషాలతో సినిమాల్లోకి ప్రవేశించిన రవితేజ... లేట్ ఏజ్ లో హీరో అయ్యాడు. ఏజ్ సంగతి ఎలా ఉన్నా... ఎనర్జిటిక్ పెరఫార్మెన్స్ తో తనకి ఎదురు లేకుండా చేసుకున్నాడు. ఎటువంటి బ్యాగ్డ్రౌండ్ లేకపోయినా... హీరోగా తనకంటూ ఒక ఇమేజ్, క్రేజ్ ఏర్పరుచుకున్నారు. స్వశక్తితో పైకొచ్చిన రవితేజకి ఈ మధ్యన ఏదీ కలిసి రావడం లేదు. కిక్ 2, బెంగాల్ టైగర్, నేలటికెట్, టచ్ చేసి చూడు సినిమాలు అట్టర్ ఫ్లాప్ అవడం.. మధ్యలో రాజా ది గ్రేట్ తో హిట్ కొట్టినా రవితేజ సినిమాలకు గ్యాప్ మాత్రం ఇవ్వడం లేదు. ఈ ఏడాది రాజా ది గ్రేట్, నెల టికెట్, టచ్ చేసి చూడు సినిమాలతో వచ్చిన రవితేజ ఇప్పుడు అమర్ అక్బర్ ఆంటోని అనే సినిమాతో మరోమారు ప్రేక్షకులను పలకరించాడు. అది కూడా తనకి కెరీర్ లో మంచి హిట్స్ ఇచ్చిన శ్రీను వైట్ల తో కలిసి. శ్రీను వైట్ల, రవితేజ కాంబోలో వచ్చిన వెంకీ, దుబాయ్ శీను సినిమాలు మంచి హిట్. అయితే శ్రీను వైట్ల గ్రాఫ్ ఈ మధ్యన పడిపోయింది. స్టార్ హీరోలతో సినిమాలు ఫ్లాప్ అవడంతో... శ్రీను వైట్ల దర్శకత్వానికి కాస్త గ్యాప్ వచ్చింది. మరి మళ్ళీ మునుపటిలా రవితేజ తో కలిసి హిట్ కొట్టాలనే కసితో శ్రీను వైట్ల ఈ అమర్ అక్బర్ ఆంటోని సినిమాని తెరకెక్కించాడు. ఎప్పటిలాగే శ్రీను వైట్ల తన మార్క్ కామెడీతో ఈ సినిమా ఉంటుందని అమర్ అక్బర్ ఆంటోని ఇంటర్వూస్ లో చెబుతున్నాడు. వరుస బ్లాక్ బ్లాస్టర్ సినిమాలను నిర్మించి అనతి కాలంలోనే నంబర్ వన్ నిర్మాణ సంస్థగా పేరు తెచ్చుకున్న మైత్రి మూవీ మేకర్స్‌ ఈ సినిమాని నిర్మించడంతో... ఈ సినిమా మీద మంచి అంచనాలే ఉన్నాయి. ఈ అంచనాలకు తగ్గట్టుగానే టీజర్, ట్రైలర్, సాంగ్స్‌ లో రవితేజ తన పూర్వవైభవాన్ని అందుకునేట్టు కనిపిస్తున్నాడు. అలాగే ఈ సినిమాకి మరో స్పెషల్ ఏమిటంటే... ఈ సినిమా కోసం చానాళ్ళు టాలీవుడ్ కి దూరమైన హీరోయిన్ ఇలియానాని కూడా తీసుకొచ్చారు. ఇక ఇలియానా రీ ఎంట్రీ తో అమర్ అక్బర్ ఆంటోని సినిమా తో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. మరి ప్లాప్స్ లో ఉన్న రవితేజకి, శ్రీను వైట్ల కి ఈ అమర్ అక్బర్ ఆంటోని హిట్ అందిస్తుందా? ఇక ఇలియానా కి ఈ రీ ఎంట్రీ ఎంతవరకు కలిసొచ్చిందో? అనేది సమీక్షలో తెలుసుకుందాం.

కథ:

అమ‌ర్ (రవితేజ‌) పూజ(ఇలియానా) ఇద్దరు చిన్నప్పుడే తమ త‌ల్లిదండ్రులకి దూరమవుతారు. తల్లిదండ్రులకి దూరమైనా అమర్ బాల్య‌మంతా జైల్లోనే గ‌డిచిపోతుంది. అయితే జైలు నుంచి బ‌య‌ట‌ప‌డిన అమ‌ర్‌… త‌న కుటుంబాన్ని చంపేసిన వాళ్ల మీద ప‌గ తీర్చుకోవాల‌నుకుంటాడు. కానీ అమ‌ర్ డిసోసియేటివ్ ఐడెంటిటీ డిజార్డర్ అనే వ్యాధితో స‌త‌మ‌త‌మ‌వుతూ ఉంటాడు. ఆ వ్యాధి వలన అమర్ ఒకే టైంలో వివిధ రకాల వ్యక్తులు (అక్బర్, ఆంటోని) లాగా ప్రవర్తిస్తుంటారు. అమ‌ర్ అమ‌ర్‌లా ఉన్న‌ప్పుడే త‌న పగ గుర్తొస్తుంది. అక్బ‌ర్‌, ఆంటోనీలా మారిన‌ప్పుడు మాత్రం గుర్తుండ‌దు. మరి అమ‌ర్ త‌న త‌ల్లిదండ్రుల‌ను చంపిన వారిపై ప‌గ తీర్చుకుంటాడా? చిన్న‌త‌నంలో విడిపోయిన స్నేహితురాలు పూజని క‌లుసుకుంటాడా? అమ‌ర్‌లోకి ఆ ఇద్దరు ఎలా ప్రవేశిస్తారు? అసలు పూజ, అమర్ తల్లిదండ్రులను ఎవరు? ఎందుకు చంపుతారు? అనేది తెలియాలంటే ‘అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ’ చూడాల్సిందే.

నటీనటుల నటన:

రవితేజ అమర్, అక్బర్, ఆంటోని గా మూడు రకాల వేరియేషన్స్ ఉన్న పాత్రల్లో ఫర్వాలేదనిపించారు. మూడు పాత్రల్లో అమర్ పాత్రకే ప్రేక్షకుడు తొందరగా కనెక్ట్ అవుతాడు. కానీ అక్బర్, ఆంటోని పాత్రల్లో రవితేజ తేలిపోయాడు. ఆ రెండు పాత్రల్లో రవితేజ నటన చిరాకు అనిపిస్తుంది. కాస్త అతిగాను అనిపిస్తుంది. అలాగే లుక్స్ పరంగా కాస్త ఇబ్బంది పెట్టాడు కానీ... దర్శకుడు మాత్రం రవితేజ ఎనర్జీ నటనను పూర్తిగా ఉపయోగించుకోలేకపోయాడు. ఇక టాలీవుడ్ కి రీ ఎంట్రీ ఇచ్చిన ఇలియానా బాగా బొద్దుగా కనబడి ఇబ్బంది పెట్టింది. లుక్స్ లోనూ గ్రెస్ లేదు. అలాగే ఇలియానా స్క్రీన్ ప్రెజెన్స్ కూడా బాగోలేదని చెప్పాలి, పాటల్లోనూ ఇలియానా బొద్దుతనం ఇబ్బంది పెట్టింది. ఇలియానా మొత్తంగా తన పాత్రలో తేలిపొయిందనే చెప్పాలి. ఇక ఈమధ్యనే కమెడియన్ గా రీ ఎంట్రీ ఇచ్చిన సునీల్ అయితే చిన్న పాత్రలకే సంతోషపడిపోయేలా కనబడుతున్నాడు. హీరోగా సినిమాలు వదిలేశాక బాడీ మీద కంట్రోల్ కూడా పోయినట్లుగా కనబడుతుంది. ఈ సినిమాలో సునీల్ బాగా లావుగా కనిపించాడు. ఇక కామెడీ కూడా అంతంత మాత్రంగానే ఉంది. వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి, స‌త్య కామెడీలో కాస్త వెన్నెల కిషోర్ పాత్రే నవ్విస్తుంది. సినిమాకి సరిపడా కమెడియన్ లు ఉన్నా... శ్రీను వైట్ల వాళ్ళని సరైన పద్దతిలో వాడుకోలేకపోయాడు. మిగతా నటీనటులు పరిధిమేర నటించి ఆకట్టుకున్నారు.

విశ్లేషణ:

ఒకప్పుడు శ్రీను వైట్ల సినిమాలు అంటే కామెడీతో కూడిన ఎంటెర్టైనెర్ మూవీస్ గా ఉండేవి. శ్రీను వైట్ల తన దగ్గరున్న రైటర్స్ తో తన కథల్లో కామెడీకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవాడు. అయితే రెడీ, ఢీ, దుబాయ్ శీను, దూకుడు సినిమాల్లో ఈ కామెడీ బాగా వర్కౌట్ అయ్యింది. కానీ అదే కామెడీ మహేష్ తో తీసిన ఆగడు, రామ్ చరణ్ తో తీసిన బ్రూస్లీ విషయంలో తేడా కొట్టడం... మిస్టర్ సినిమాతో శ్రీను వైట్ల డైరెక్షన్ మీద హీరోల్లో నమ్మకం పోయింది. మరి అమ‌ర్ అక్బ‌ర్ అంటోని సినిమా... దర్శకుడిగా శ్రీను వైట్లకు లైఫ్ అండ్ డెత్ లాంటిది. ఈ సినిమా మొత్తం రివెంజ్ డ్రామాగానే సాగుతుంది. ఒక మామూలు రివైంజ్ డ్రామాకు అమెరికా నేప‌థ్యం... జోడించి రాసుకున్న కథ అమర్ అక్బర్ ఆంటోని కథ. హీరో హీరోయిన్లు చిన్న‌ప్పుడే విడిపోవ‌డం, తమ తల్లిదండ్రుల్ని చంపిన వాళ్ల‌పై ప్ర‌తీకారం తీర్చుకోవాల‌నుకోడం... దానికి డిసోసియేటివ్ ఐడెంటిటీ డిజార్డర్ అనే జబ్బుని జోడించాడం... అద్దం ప‌గిలితే… అమ‌ర్ అయిపోవ‌డం, మంట గుర్తొస్తే… ఒక పాత్ర‌లోంచి మ‌రో పాత్ర‌లోకి జంప్ అయిపోవ‌డం, ఎంత రీజ‌న్ లెస్‌గా అనిపిస్తాయో, తెర‌పై అంత సిల్లీగా తీశాడు ద‌ర్శ‌కుడు శ్రీను వైట్ల. అయితే అదే రివెంజ్ డ్రామాని త‌న‌దైన స్టైల్‌లో కామెడీని జోడించి తీయాల‌న్న తాప‌త్ర‌యంతో వాటా లాంటి ఎపిసోడ్లు జాయింట్ చేసుకుంటూ పోయాడు. శ్రీ‌ను వైట్ల సినిమాలో మొదట్లో మనం చెప్పుకున్నట్లుగా కామెడీ చాలా బాగుంటుంది. వైట్ల సెన్సాఫ్ హ్యూమ‌ర్ సినిమాలో చాలా స‌న్నివేశాల్ని నిల‌బెడుతుంటుంది. కానీ.. ఈ సినిమాలో అవేం క‌నిపించ‌లేదు. ఇక సినిమా సెకండ్‌హాఫ్‌కు వ‌చ్చేస‌రికి ఆసక్తిగా మొద‌లైనా.. క‌థ‌కు అవ‌స‌రం లేని ట్రాక్‌లు సృష్టించి గంద‌ర‌గోళం చేశాడు. దీంతో యాక్ష‌న్ అండ్ ఎమోష‌న్స్ మ‌ధ్య కామెడీ సీన్లు స‌రిగ్గా డిజైన్ చేయ‌క‌పోవ‌డంతో ప్రేక్ష‌కులు క‌న్ఫ్యూజ‌న్‌తో త‌ల‌లు ప‌ట్టుకున్నారు. ఇక ర‌వితేజ అయితే త‌న‌దైన కామెడీ టైమింగ్‌తో అద‌ర‌గొట్టి సినిమాని కాస్త పైకెత్తే బాధ్యతని తీసుకున్నాడు. కానీ రవితేజ ఎంత చేసినా పెద్దగా ఉపయోగం లేదనే చెప్పాలి.

సాంకేతిక వర్గం పనితీరు

మ్యూజిక్ డైరెక్టర్ గా అరవింద సమేతతో 100 సినిమాల మైలురాయిని అందుకున్న థమన్ ఈ అమర్ అక్బర్ ఆంటోని సినిమాకి ఏమైనా స్పెషల్ ట్యూన్స్ ఇస్తాడేమో అనుకున్న ప్రేక్షకుడికి మళ్లీ నిరాశే. చిన్న సినిమాలకు హిట్ మ్యూజిక్ ఇచ్చిన థమన్ ఈ మధ్యన భారీ సినిమాల విషయంలో వరసగా ఫెయిల్ అవుతున్నాడు. తనలోని టాలెంట్ మొత్తం నేపధ్య సంగీతానికి వాడుతున్నాడు కానీ.. పాటలపై ప్రత్యేక శ్రద్ద పెట్టలేకపోతున్నాడు. ఇప్పుడు ఈ సినిమాకి నేపధ్య సంగీతంతో ఆకట్టుకున్నాడు కానీ... మ్యూజిక్ మాత్రం రొటీనే. పాటలు ఒక్కటీ ఆకట్టుకోలేకపోయాయి. ఇక ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణ సినిమాటోగ్రఫీ. వెంకట్ దిలీప్ కెమెరా గొప్పదనం ప్రతి సీన్ లోనూ కనబడుతుంది. ఇక ఎడిటింగ్ మాత్రం ఇంకాస్త షార్ప్ గా ఉండాలి. కత్తెర వేయాల్సిన చోట మర్చిపోయారనుకుంటా.. చాలా లాగింగ్ సీన్స్ ఇబ్బంది పెట్టేస్తాయి. ఈ సినిమాకి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది మాత్రం మైత్రి మూవీస్ నిర్మాణ విలువలు. ఎక్కడా తగ్గకుండా ఈ సినిమాకి డబ్బు పెట్టారు మైత్రి వారు.

ప్లస్ పాయింట్స్:

నిర్మాణ విలువలు,

రవితేజ అమర్ క్యారెక్టర్,

నేపధ్య సంగీతం,

సినిమాటోగ్రఫీ

మైనస్ పాయింట్స్:

కథ,

కామెడీ,

బ్యాడ్ నేరేషన్,

మ్యూజిక్,

ఇలియానా,

దర్శకత్వం,

కమర్షియల్ ఎలిమెంట్స్ లేకపోవడం

రేటింగ్: 2.0/5

Similar News