కేంద్రమంత్రిని బంధించిన క్యాడర్
కేంద్రమంత్రి సుభాష్ సర్కార్ ను బీజేపీ కార్యకర్తలు పార్టీ కార్యాలయంలోని ఒక గదిలో బంధించి తాళం వేశారు.
కేంద్రమంత్రి సుభాష్ సర్కార్ ను బీజేపీ కార్యకర్తలు పార్టీ కార్యాలయంలోని ఒక గదిలో బంధించి తాళం వేశారు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్‌లోని బంకురాలో జరిగింది. పార్టీ కార్యకర్తలకు అన్యాయం చేస్తున్నారని, నియంతలా వ్యవహరిస్తూ తమను పట్టించుకోవడం లేదన్న కారణంతో కేంద్రమంత్రిని గదిలో వేసి సొంత పార్టీ కార్యకర్తలే బంధించడం హాట్ టాపిక్ గా మారింది. మంగళవారం మధ్యాహ్నం బంకారాలోని బీజేపీ కార్యాలయలో ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు కేంద్రమంత్రి సుభాష్ సర్కార్ వచ్చారు.
నియంతలా....
జిల్లాలోని బీజేపీ వ్యవహారాల్లో తమ నేతలకు అన్యాయం జరుగుతుందని, ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ బీజేపీ కార్యకర్తలు కార్యాలయంలోకి వచ్చి ఆయనను గదిలో వేసి నిర్భంధించారు. ఆయన అనుకూలురు మాత్రం గది నుంచి కేంద్ర మంత్రిని బయటకు తీసుకురావడానికి చేసిన ప్రయత్నాలు చాలాసేపు ఫలించలేదు. కేంద్రమంత్రి అనుకూల, ప్రతికూల వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఒకరినొకరు దుర్భాషలాడుకున్నారు. కార్యకర్తలకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం, కొందరికే ప్రయారిటీ ఇస్తున్నందునే కార్యకర్తలు కేంద్రమంత్రిని గదిలో బంధించి తాళం వేశారని ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు. సుభాష్ సర్కార్ కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రిగా పనిచేస్తున్నారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లోనూ బీజేపీ ఓటమికి సుభాష్ సర్కార్ కారణమంటూ కార్యకర్తలు ఆరోపించారు. చివరకు వారికి నచ్చ చెప్పి కేంద్రమంత్రిని గది నుంచి బయటకు తీసుకు వచ్చారు.