అవార్డుల వేడుకలో అపశృతి.. వడదెబ్బకు 11 మంది మృతి

మహారాష్ట్రలో సామాజిక ఉద్యమకారుడు అప్పాసాహెబ్ ధర్మాధికారికి ప్రభుత్వం ప్రతిష్టాత్మక ‘మహారాష్ట్ర భూషణ్’ అవార్డు..

Update: 2023-04-17 05:26 GMT

bhushan awards event

మహారాష్ట్ర రాజధాని ముంబైలో అట్టహాసంగా నిర్వహించిన ఓ అవార్డుల ఫంక్షన్ లో అపశృతి చోటుచేసుకుంది. ఆ ఫంక్షన్ కు వచ్చిన వారిలో 11 మందికి వడదెబ్బ తగలడంతో మృతి చెందారు. మరో 50 మంది వడదెబ్బకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మిట్టమధ్యాహ్నం ఫంక్షన్ ఏర్పాటు చేయడమే కాకుండా.. ఒక్క టెంటు కూడా లేకుండా ఎండలో కుర్చీలు వేసి కూర్చోబెట్టడమే ఈ విషాదానికి కారణమని పోలీసులు తెలిపారు.

మహారాష్ట్రలో సామాజిక ఉద్యమకారుడు అప్పాసాహెబ్ ధర్మాధికారికి ప్రభుత్వం ప్రతిష్టాత్మక ‘మహారాష్ట్ర భూషణ్’ అవార్డు ప్రకటించింది. ఈ అవార్డును అందించేందుకు ఆదివారం నవీ ముంబైలోని ఓ గ్రౌండ్ లో అధికారులు వేదికను ఏర్పాటు చేశారు. ఫంక్షన్ కు వచ్చే వారి కోసం కుర్చీలైతే వేశారు కానీ.. ఒక్క టెంట్ కూడా వేయలేదు. ఉదయం 11:30 కు మొదలైన సభ మధ్యాహ్నం 1 గంట వరకూ కొనసాగింది. వేలమంది ధర్మాధికారి అభిమానులు ఫంక్షన్ కు వచ్చారు. కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే, ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తదితరులంతా విచ్చేశారు.
ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో సభకు వచ్చినవారిలో కొందరు స్పృహతప్పి పడిపోయారు. వారిని ఆస్పత్రికి తరలించేలోగానే 11 మంది చనిపోయారని, మరో 50 మందికి వైద్యులు చికిత్స అందజేస్తున్నారని పోలీసులు తెలిపారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే ఆసుపత్రికి వెళ్లి బాధితులను పరామర్శించారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున పరిహారం అందిస్తామని సీఎం తెలిపారు.


Tags:    

Similar News