Dhiraj Prasad Sahu : ఎవరీ ధీరజ్ ప్రసాద్ సాహు...? ఒక్క ఇంట్లో ఇన్ని కోట్లు ఉండటం సాధ్యమా?
ఒడిశా వ్యాపారవేత్త ధీరజ్ ప్రసాద్ సాహు ఇంట్లో మూడు వందల కోట్ల బ్లాక్ మనీ ఐటీ అధికారులకు దొరికింది
దేశ వ్యాప్తంగా ఇప్పుడు ఒకటే చర్చ. ధీరజ్ ప్రసాద్ సాహు. కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు. అసలు ఎవరీయన? ఏం వ్యాపారాలు చేస్తాడంటూ గూగుల్ సెర్చ్ లో ఒకటే చూస్తున్నారు నెటిజన్లు. సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయ్యారు. ఈ నెల 6వ తేదీ నుంచి ధీరజ్ ప్రసాద్ సాహు ఇంట్లో, కార్యాలయాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే మూడు వందల కోట్ల రూపాయలను ఆదాయపు పన్ను శాఖ అధికారులు కనుగొన్నారు. కరెన్సీ కట్టలు చూసి వాళ్లే నోళ్లు తెరిచారు. ఒక్క మనిషికి ఇంత డబ్బు ఉండటం ఎలా సాధ్యమన్నది వారి మైండ్‌కు కూడా అర్థం కాకుండా ఉంది. ఎలా సంపాదించాడు.. ఇన్ని కోట్లు.... అంటూ ఐటీ శాఖ అధికారులే ఆశ్చర్యపోతున్నారంటే అసలు ధీరజ్ ప్రసాద్ సాహు ఎవరనేది అందరికీ తెలియాల్సి ఉంది.
కాంగ్రెస్ ఎంపీగా...
ఒడిశా నుంచి కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఆయన ఇంట్లో బీరువాల నిండా కరెన్సీ కట్టలే. డబ్బులు లెక్కించలేక కౌంటింగ్ మెషీన్లు కూడా మొరాయిస్తున్నాయి. రోజుల తరబడి లెక్కిస్తున్నా తరగడం లేదు. అన్ని కట్టలు. 300 కోట్ల ఒక ఇంట్లో కుక్కిపడేశాడంటే మామూలోడు కాదని మాత్రం అందరికీ అర్థమయిపోయింది. బ్రేక్ లేకుండా లెక్కిస్తున్నా కౌంటింగ్ పూర్తి కావడం లేదంటే సాహూ సామాన్యుడు మాత్రం కాదు. కాంగ్రెస్ పార్టీ ధీరజ్ ప్రసాద్ సాహుకు రాజ్యసభ ఇచ్చి ఆయనను పెద్దల సభకు పంపింది. ఆ సభకే తలవంపులు తెచ్చేలా సాహు బండారం బయటపడటంతో ఆయనతో పాటు పార్టీ పరువు కూడా గంగలో కలసినట్లయింది.
మద్యం కంపెనీలతో...
థీరజ్ ప్రసాద్ సాహు.. రాజకీయాల్లో సంపాదించారని ఎవరూ అనలేదు. కేవలం వ్యాపారంలోనే ఈ మొత్తాన్ని గడించారు. జార్ఖండ్, ఒడిశా రాష్ట్రాల్లో మద్యం తయారీ కంపెనీల ఓనర్ ఇతగాడు. బౌద్ డిస్టలరీస్ పేరిట ఆయన మద్యం వ్యాపారం చేస్తున్నాడు. మద్యాన్ని తయారు చేసి రాష్ట్రాల్లో విక్రయిస్తూ సొమ్ము గడిస్తున్నాడు. డిస్టలరీ కంపెనీలతో పాటు మరికొన్ని వ్యాపారాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు. అయితే ఇప్పుడు ఆదాయపు పన్ను శాఖ అధికారులకు దొరికిన ధనమంతా బ్లాక్ మనీగా గుర్తించారు. వీటికి లెక్కేలేమీ లేవు. అంతా బ్లాక్ లోనే. ఐదు వందల రూపాయల నోట్లను బీరువాల్లో కుక్కి మరీ ఆయన దాచి పెట్టడం ఎందుకు అన్న ప్రశ్న సహజంగానే తలెత్తుంది. పన్ను ఎగవేయడానికే ఈ విధంగా ఇంట్లో కోట్లాది రూపాయలను దాచి పెట్టాడన్నది ప్రాధమికంగా అందుతున్న సమాచారం.
వెతికే కొద్దీ...
ఇంకా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. కరెన్సీ కట్టలు బయటపడుతూనే ఉన్నాయి. అయితే ఇంత డబ్బు ఆయన ఇంట్లోనే బయటపడటంతో రాజకీయంగా కూడా సంచలనంగా మారింది. కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడిగా ఆయన సంపాదించి ఉండకపోవచ్చు కానీ.. మద్యం వ్యాపారంతో పాటు ఇతర వ్యాపారాలు ఆయనకు కనక వర్షం కురిపించిందంటున్నారు. మరి పన్ను సక్రమంగా కడితే ఈయన సొమ్మేం పోయింది అనుకునే వారికి.. పన్ను కట్టాడు.. కట్టకుండా వదిలేసిన మొత్తమే ఇది అంటే ... ఇక ఎంత పన్ను ను ఆయన అధికారికంగా చెల్లించాడో కదా? అన్న చర్చ దేశ వ్యాప్తంగా జరుగుతుంది. మొత్తం మీద ధీరజ్ ప్రసాద్ సాహు యవ్వారం మాత్రం మామూలుగా లేదు.