మూడు దశాబ్దాల క్రితం లంచం కేసు : రిటైర్డ్ రైల్వే ఉద్యోగికి ఏడాది జైలు
ఆ తర్వాత ఆయన రూ.100 ఇస్తుండగా సీబీఐ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా వర్మను పట్టుకున్నారు.
మూడు దశాబ్దాల నాటి లంచం కేసులో రిటైర్డ్ రైల్వే ఉద్యోగికి కోర్టు ఏడాది జైలుశిక్ష విధించింది. ఉత్తరప్రదేశ్ లోని లక్నోలో జరిగిన ఈ ఘటన తాలూకు వివరాలు ఇలా ఉన్నాయి. ఉత్తర రైల్వేలో లోకో డ్రైవర్ గా పనిచేసి పదవీ విరమణ చేసిన రామ్ కుమార్ తివారి 1991లో పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అందుకు అవసరమైన మెడికల్ సర్టిఫికేట్ కోసం రైల్వే డాక్టర్ రామ్ నారాయణ్ వర్మ వద్దకు వెళ్లగా.. ఆయన టెస్టులు చేసి సర్టిఫికెట్ ఇచ్చేందుకు ఆయన రూ.150 డిమాండ్ చేశారు.
తప్పనిసరి పరిస్థితుల్లో రామ్ కుమార్ రూ.50 ఇచ్చారు. మిగతా రూ.100 ఇవ్వడానికి ముందు సీబీఐకి ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత ఆయన రూ.100 ఇస్తుండగా సీబీఐ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా వర్మను పట్టుకున్నారు. అప్పుడు నమోదు చేసిన ఈ కేసు.. మూడు దశాబ్దాలుగా వాయిదాలు పడుతూ.. ఎట్టకేలకు తీర్పువచ్చింది. ఈ కేసును విచారించిన ప్రత్యేక న్యాయమూర్తి అజయ్ విక్రమ్ సింగ్.. వర్మను దోషిగా తేల్చి ఏడాది జైలు శిక్ష విధించారు. అయితే ప్రస్తుతం రామ్ నారాయణ్ వయసు 82 ఏళ్లు. తన వయసును దృష్టిలో పెట్టుకుని తీర్పు చెప్పాలన్న అతని అభ్యర్థనను న్యాయమూర్తి తిరస్కరించారు.